మనం ఇంతకుముందు చెప్పుకున్నదే… ఒక ప్రకాష్‌రాజ్ స్థాయి ఏమిటి రాజకీయాల్లో…? తను అసలు రాజకీయ నాయకుడేనా..? కేసీయార్ తనను వెంటేసుకుని తిరుగుతాడు కొన్నాళ్లు…! తరువాత గాయబ్… మరికొన్నాళ్లు ప్రశాంత్ కిశోర్‌తో గంటలకొద్దీ భేటీలు వేస్తాడు… నా ఫ్రెండ్ అంటాడు… తరువాత మాయం..! రైతుసంఘాలే దూరం పెడుతున్న రాకేష్ టికాయిట్‌ను ఇంకొన్నాళ్లు వాడుకున్నాడు కేసీయార్… ఇప్పుడు అదీ అయిపోయింది… ఢిల్లీలో ఇదే టికాయిట్‌ను నమ్ముకుని రైతుదీక్ష పెడితే, ఒక్కడంటే ఒక్కడూ మద్దతుకు సిద్ధపడలేదు…
అంతెందుకు..? తెలంగాణ జనం సొమ్మును తీసుకుపోయి, పంజాబ్‌లో పంచిపెడితే… అక్కడ అధికారం ఉద్దరిస్తున్న ఆ కేజ్రీవాల్ కూడా ఢిల్లీ దీక్ష మొహం చూడలేదు… బీహార్ వెళ్లి అక్కడా తెలంగాణ జనం సొమ్ము పంచిపెట్టి వచ్చాడు కేసీయార్… నితిశ్, తేజస్వి కేసీయార్‌ను లైట్ తీసుకున్నారు… కేసీయార్ ప్రెస్‌మీట్ తీరు చూసి నవ్వుకున్నారు… లేలేవయ్యా, ఇక చాల్లే అన్నట్టుగా వ్యవహరించారు… అదేకాదు, ముక్కూమొహాలు తెలియని వాళ్లను రైతుసంఘాల నేతలు అంటూ హైదరాబాద్ తీసుకొచ్చి, కేసీయార్ సత్కారాలు చేశాడు… మీడియాలో ఆహాలు, ఓహోలు, చిడుతలు, భజనరచయితలు, డప్పుమోతలు సరేసరి…
కాలం కలిసొస్తే కాబోయే ప్రధానిని అనే కల తప్పు కాదు… రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఉన్నత పదవుల మీద ఆశ సహజం… మానవసహజం… కానీ ఇవా వేసే అడుగులు..? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెబుతున్నట్టు… ఖాళీగా ఉన్నవాళ్లు, జనం వదిలేసినవాళ్లేనా కేసీయార్‌కు దిక్కు..? పోనీ, వాళ్లయినా తనతో కలిసొస్తారా..? నెవ్వర్… అదీ భ్రమే… అవసరార్థం లెఫ్ట్ ఇప్పుడు కావల్సి వచ్చింది కేసీయార్‌కు… కానీ లెఫ్ట్‌తో స్నేహం కూడా కేసీయార్‌తో స్నేహం వంటిదే… దొందూదొందే…
Ads
కన్నడ జనం పట్టించుకోని కుమారస్వామి ఇప్పుడు కేసీయార్‌కు ఆప్తుడు… అన్నింటికీ మించి శంకర్‌సిన్హ్ వాఘేలా, కేసీయార్ భేటీ ఆసక్తి కలిగించేది కాదు, నవ్వు పుట్టించేది… కేసీయార్ పట్ల ఆర్కే చెబుతున్నట్టు జాలి పుట్టించేదే… ఎక్కడా ఎవడూ కనీస మద్దతు చెప్పే దిక్కులేని జాతీయ ఎడారిలో వాఘేలా ఒక ఎండిపోయిన ముసలి చెట్టు బెరడు… అక్షరాలా అదే నిజం… ఓసారి సంక్షిప్తంగా ఆ వాఘేలా గురించి చదివితే, కేసీయార్ అడుగుల్లోని శుష్కత ఎంతో అర్థమవుతుంది… ఈ తోకల్ని పట్టుకుని గోదావరి ఈదుతాడా అనిపిస్తుంది…
ఇప్పుడు 82 ఏళ్ల వయస్సున్న వాఘేలా ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ మనిషి… ఇప్పటి ప్రధాని మోడీ, వాఘేలా ఇద్దరూ కలిసి ఓ బైక్ మీద ఊరూరూ తిరిగేవాళ్లు… సంఘ్ పనిమీదే… జాన్‌జిగ్రీ గురుశిష్యులు… రైళ్లు, బస్సులు, కాలినడక… ఎక్కడ ఆశ్రయం దొరికితే అక్కడే పడక, కూడు… అలాంటి వాఘేలా అవకాశం వచ్చినప్పుడు, తనను సీఎంగా అంగీకరించని బీజేపీ మీద తిరగబడ్డాడు… మోడీ మద్దతు… 47 మంది ఎమ్మెల్యేలను చీల్చి, కాంగ్రెస్ మద్దతుతో సీఎం అయ్యాడు… అప్పుడు ఆ చీలికవర్గం పెట్టుకున్న పార్టీ పేరు రాష్ట్రీయ జనతా పార్టీ…
అందరూ అనుకుంటున్నట్టు మోడీ బీజేపీకి వీరవిధేయుడేమీ కాదు… పార్టీ ఆలోచనలకు భిన్నంగా అడుగులు వేసిన గతమే తనది కూడా… తన లెక్కలు తనవి… అందుకే వాఘేలా ఎపిసోడ్ సమయంలో గుజరాత్ నుంచి పార్టీ మోడీని బయటికి తరిమేసింది… గుజరాత్‌లో కనిపిస్తే బాగుండదు అని హెచ్చరించింది… సరే, కాంగ్రెస్ ఏ చీలిక పార్టీకి సపోర్ట్ ఇచ్చినా, చివరకు ఆపార్టీని కాంగ్రెస్‌లో కలిపేసుకోవడమే కదా చరిత్ర… వాఘేలా కూడా కాంగ్రెస్‌లో కలిసిపోయాడు… 2017లో జనవికల్ప మోర్చా అని ఓ సొంత పార్టీ పెట్టుకున్నాడు…
ఎన్నికల సంఘం పార్టీని గుర్తించకపోతే ఎక్కడో జైపూర్ కేంద్రంగా ఉన్న ఆల్ ఇండియా హిందుస్తాన్ కాంగ్రెస్ పార్టీ అనే ఓ అనామక పార్టీ పేరిట 95 స్థానాల్లో పోటీచేసింది వాఘేలా పార్టీ… వచ్చిన వోట్లు ఎన్నో తెలుసా..? 83 వేలు… మీరు చదివింది నిజమే… 95 సీట్లలో కలిపి 83 వేలు… ఒకప్పటి సీఎం, గుజరాత్ లయన్ సాధించిన వోట్లు అవే మరి… తరువాత ఎన్సీపీలో చేరాడు… ‘‘కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్’’ అన్నట్టుగా..!! దరిద్రం ఏమిటంటే… ఎన్సీపీ గుజరాత్ అధ్యక్ష పదవి నుంచి పార్టీ తనను పీకేసింది… ఇంకేం చేస్తాడు..? ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పాడు…
అప్పుడే అయిపోలేదండీ… మొన్నటి ఆగస్టులో… ఎస్, గత నెలలోనే… ఈ వయస్సులో ఆయన ప్రజాశక్తి డెమోక్రటిక్ పార్టీ అనే కొత్త దుకాణాన్ని తెరిచాడు… ఇదీ వాఘేలా చరిత్ర… కేసీయార్‌కు ఇప్పుడు కావల్సిన దేశ్‌కీనేత… ఇలాంటివాళ్లను పట్టుకుని కేసీయార్ జాతీయ రాజకీయాల్లో రాటుదేలి, ప్రధాని అవుతాడా..? ఏమో… అవుతాడేమో… చంద్రశేఖర్, గుజ్రాల్, దేవెగౌడలు కాలేదా అంటారా..? అంతేలెండి… గుర్రమెగురావచ్చు..!!
Share this Article