Taadi Prakash……………. (27 జూలై 2020) … అమెరికన్ జర్నలిస్ట్ ‘మిస్సింగ్ ‘…. A COMPELLING FILM BY COSTA GAVRAS…. గ్రీసుదేశానికి చెందిన కాన్స్టాంటినో గౌరస్ సినిమా దర్శకుడు. కోస్టాగౌరస్గా ప్రపంచ ప్రసిద్ధుడు. నియంతలు, నరహంతకులు పాలకులుగా వున్న దేశాల్లో హత్యా రాజకీయాలపై సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు. నిజమైన గ్రీకు వీరుడు. కోస్టాగౌరస్ సినిమా విడుదలవుతోందంటే, అమెరికా, లాటిన్ అమెరికా ప్రభుత్వాలు గడగడలాడతాయి. గ్రీస్‌లో కోస్టాగౌరస్ని నిషేధించారు. ఆయన సినిమాల్ని నిషేధించారు. ఆస్కార్‌తో సహా అనేక అంతర్జాతీయ అవార్డులు పొందిన ఆయన పేరు కో…అని పలకడం కూడా అక్కడ నిషేధం.
1933 ఫిబ్రవరి 12న గ్రీస్‌లో జన్మించిన కోస్టాగౌరస్ స్థిర నివాసం పారిస్. 1964 నుంచే ఫ్రెంచిలో సినిమాలు తీశారు. ఇప్పుడాయన వయసు 87 ఏళ్ళు. గత ఏడాది 2019లో కూడా ADULTS IN THE ROOM అనే సినిమా తీశారు. ఆయన 30 సినిమాల వరకూ తీసినా, నాకు నచ్చిన, నేను చూసిన రెండు సినిమాల గురించి చెప్పాలి.
1. Z ( దీన్ని ‘జీ’ అని పలకాలి) గ్రీకు భాషలో జీ అంటే HE LIVES అనీ HE IS ALIVE అనీ అర్ధం. 1969లో జీ రిలీజ్ అయింది.
Ads
2. మిస్సింగ్. 1982లో వచ్చింది. చిలీ దేశంలో కనపడకుండా పోయిన ఒక అమెరికన్ జర్నలిస్టు కథ.
చిలీ అనే చిన్న దేశం దక్షిణ అమెరికా పశ్చిమ తీరాన చిటికెన వేలులా సన్నగా పొడవుగా వుంటుంది. అర్జెంటీనా, బ్రెజిల్, చిలీని A,B,C countries అంటారు. ఆరు వేల కిలోమీటర్ల పసిఫిక్ సముద్ర తీరం వున్న చిలీలో ఆండీస్ పర్వతశ్రేణి ప్రత్యేక ఆకర్షణ. స్పానిష్ మాట్లాడే ఆ దేశ జనాభా కోటిన్నర. రాజధాని శాంటియాగో. చిలీని ‘COUNTRY OF POETS’ అంటారు. సాహిత్య నోబెల్ పొందిన పాబ్లోనెరూడా, గ్రాబియేలా మిస్త్రల్ యిద్దరూ చిలీ దేశస్తులే !
1960వ దశకంలో చిలీలో వామపక్ష ఉద్యమం పుంజుకుంది. కమ్యూనిస్టులు, విప్లవ కవులు, గాయకులు, మేధావుల ఉత్తేజంతో
ఎర్రగాలి బలంగా వీచింది. ఆ వూపులో 1970 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సోషలిస్టు ఐక్య సంఘటన అధికారంలోకి వచ్చింది. సాల్వడార్ గిల్లేర్మో అలెండీ దేశాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆయన శాంటియాగో యూనివర్సిటీలో మెడిసిన్ చదివిన డాక్టరు. మార్క్సిజాన్ని నమ్మినవాడు. దక్షిణ అమెరికాలో ఒక మార్క్సిస్టు ప్రభుత్వం అధికారంలోకి రావడం అమెరికాకి నచ్చలేదు. అలెండీ ప్రభుత్వాన్ని యిబ్బంది పెట్టడానికి వ్యూహ రచన చేసింది.
1973 సెప్టెంబర్ వరకూ అలెండీ అధికారంలో వున్నారు. చిలీ ఆర్మీలోని ఒక వర్గాన్ని అమెరికా చేరదీసింది. సిఐఏ వాళ్ళకి సైనిక సహయం అందించింది. తిరుగుబాటు చేయించింది. సెప్టెంబర్ 11న అగస్టో పినోచెట్ అనే ఆర్మీ జనరల్ నాయకత్వాన భయానకమైన సైనిక దాడి జరిగింది. శాంటియాగోలో దేశాధ్యక్షుడు అలెండీ అధికార నివాస భవనాన్ని సైన్యం చుట్టుముట్టింది. కాల్పులు జరిపింది. పైనించి భవనంపై బాంబులు కురిపించారు. కుట్రని ఎదుర్కొడానికి అలెండీ, ఇతర ప్రభుత్వ నేతలు మెషీన్ గన్లతో కాల్పులు జరిపారు. బాంబింగ్ జరుగుతుండగానే దేశ ప్రజల్ని ఉద్దేశించి చీలీ రేడియోలో అలెండీ అఖరి ప్రసంగం చేశారు. చివరిదాకా తుపాకీతో పోరాడిన అలెండీ బాంబుదాడిలో మరణించారు. సైన్యం అధికారం చేజిక్కించుకుంది. వైట్‌హౌస్‌లో కేరింతలు కొట్టి కేకులు తిన్నారు. చిలీ పరిణామాలని కవర్ చేయడానికి న్యూయార్క్, వాషింగ్టన్ల నుంచి అమెరికా జర్నలిస్టులు వచ్చివున్నారు. అందులో యిద్దరు జర్నలిస్టులు కనిపించకుండాపోయారు.
శాంటియాగోలో మార్షల్ లా విధించారు. మార్షల్ లా అంటే కర్ఫ్యూ జేజమ్మ. రోడ్ల మీద ఎవరు కన్పించినా కాల్చి చంపేస్తారు. ఒక చిమ్మ చీకటి తెర చిలీని కమ్ముకుంది. మిస్సింగ్ జర్నలిస్టు కథే సినిమా ! ఛార్లెస్ హార్మన్ అనే అమెరికన్ జర్నలిస్టు కనిపించకుండా పోతాడు. అమెరికాలో పలుకుబడిగల వ్యాపారస్తుడైన ఛార్లెస్ తండ్రి ఎడ్ హార్మన్ కొడుకుని వెతకటం కోసం చిలీ వస్తాడు. నిజ జీవిత కథని కోస్టాగౌరస్ తెరకెక్కించాడు. రాజకీయ హత్యలతో నిండిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ని GRIPPING, DISTURBING, HAUNTING, UNSETTLING అని అప్పట్లో అంతర్జాతీయ పత్రికలు రాశాయి.
శాంటియాగో చేరుకున్న ఎడ్ హార్మన్,కొడుకు భార్య Bethని కలుస్తాడు. మామకీ, కోడలికీ రాజకీయంగా పడదు. మీ వామపక్ష రాజకీయాల వల్లే నా కొడుకు కనిపించకుండా పోయాడని బెత్‌తో అంటాడు. అమెరికా దుర్మార్గ రాజకీయ విధానం వల్లే యిలా జరిగిందని ఆమె అంటుంది. 24 గంటల మార్షల్ లా సమయంలోనే తండ్రి వెదకడం మొదలుపెడతాడు. అమెరికన్ గనక ప్రభుత్వం ఎలానూ సహకరిస్తుంది. శాంటియాగోలోని అమెరికన్ ఎంబసీలో అధికార్లని అడుగుతాడు ” మేమూ అదే చూస్తున్నాం” అంటూ దొంగమాటలు చెబుతారు. పలుకుబడి ఉపయోగించి హర్మన్ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతాడు. ఫలితం వుండదు. మిస్సింగ్ కేసు పెడతాడు. కోర్టు విచారణ నడుస్తూంటుంది. ఈలోగా 1973 సెప్టెంబర్ నాటి శాంటియాగో నగరాన్ని కోస్టా గౌరస్ మనకి చూపిస్తాడు. గుండెలు పగిలిపోయే దృశ్యాలవి !
కమ్యూనిస్టుల్నీ, వాళ్ళ సానుభూతిపరుల్నీ, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే సోషలిస్టుల్నీ, గాయకుల్నీ, రచయితల్నీ ఆడవాళ్ళనీ, పిల్లల్నీ, శాంటియాగో మధ్యలో వున్న ఫుట్‌బాల్ స్టేడియంకి తీసుకెళుతుంటారు. అతిపెద్ద స్టేడియంలో వందల మందిని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపేస్తుంటారు. ఆ స్టేడియం హింసల భయానక దృశ్యాలు ప్రేక్షకుడు ఎన్నటికీ మరిచిపోలేడు. శాంటియాగో ప్రధాన వీధిలో ఒక అర్ధరాత్రి మార్క్సిస్ట్ గ్రంథాలని కుప్పలుగా పోసి తగలబెడుతుంటారు. వీధివీధంతా తగలబడిపోతుంటే, సైనికులు తుపాకులతో కాపలా కాస్తుంటారు.
హఠాత్తుగా వచ్చిన ఒక తెల్ల గుర్రం గట్టిగా సకిలిస్తూ ఆ రోడ్డు మీద మెరుపు వేగంతో పరిగెత్తి వెళిపోతుంది. జీపులో వెళ్తున్న సైనికులు దానిపై కాల్పులు జరుపుతారు. ఆ సింబాలిక్ షాట్ మనల్ని షాక్ చేస్తుంది. స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న చిలీ ప్రజల ఆకాంక్షకు సింబల్ ఆ తెల్ల గుర్రం.
Missing… Flashback
తన యింట్లో వార్తలు టైప్ చేసుకుంటున్న అమెరికన్ జర్నలిస్ట్‌ని చిలీ సైనికులు వచ్చి బలవంతంగా లాక్కుపోతారు. కోర్టులో విచారణ జరుగుతున్నపుడు, సాక్షులు చెబుతున్న దాన్ని దర్శకుడు విజువల్‌గా ప్రెజెంట్ చేయడం మనల్ని వూపేస్తుంది. సాయుధ సైనికులు ట్రక్కుదిగడం, ఆ భారీ బూట్ల చప్పుడికి అక్కడున్న తెల్ల బాతుల గుంపు ఎగరడం… మళ్ళీ ఇంకో సాక్షి చెబుతున్నప్పుడు బాతులు మరోలా ఎగరడం… మరోసారి ఇంకోలా ఎగరడం… ఆ ఇనప బూట్లు…
ఆ అందమైన బాతులు… కర్కశమైన సైనిక పాలన శాంతిని ఎలా విచ్ఛిన్నం చేస్తుందో కవితాత్మకంగా కంపించిపోయేలా చెబుతాడు కోస్టాగౌరస్.
ఆ ఫోటోగ్రఫీ, ఆ సంగీతం ఒక జీవితకాలం వెన్నాడతాయి. ఇక్కడ అమెరికా అధికారులూ, ప్రభుత్వంలోని వాళ్ళూ తియ్యని అబద్ధాలతో కాలక్షేపం చేస్తున్నారని కొడుకు కోసం వెతికే తండ్రికి బోధపడుతుంది. కోడల్ని కలుస్తాడు. నువ్వూ నా కొడుకూ చెపుతున్నదే నిజం అంటూ అమెరికాపై అనుకూల అభిప్రాయం మార్చుకుంటాడు. వామపక్షభావాలున్న ఆ అమెరికన్ జర్నలిస్ట్‌ని పుట్‌బాల్ స్టేడియంలో ఎప్పుడో చంపేస్తారు.
“పూర్తిగా దర్యాప్తు చేస్తాం. మీ కొడుకు ఏమయ్యారో విచారించి నిర్ధారణ చేస్తాం” అని చిలీ ప్రభుత్వాధికార్లు హామీ ఇచ్చి జర్నలిస్టు భార్యనీ, తండ్రినీ అమెరికా పంపేస్తారు. చిలీలో మిటలరీ హింస, విధ్వంసకాండ జరుగుతూనే వుంటుంది. ఏడు నెలల నిరీక్షణ తర్వాత….
మిస్సింగ్ ఆఖరి సీను : న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో తండ్రి ఎదురుచూస్తూ వుంటాడు. శాంటియాగో నుంచి వచ్చిన విమానం నెమ్మదిగా ఆగుతుంది. తలుపు తెరుచుకుంటుంది. కన్వేయర్ బెల్ట్ మీద కొడుకు శవపేటిక నెమ్మదిగా వస్తూ వుంటుంది. ఆ కన్నతండ్రీ, ప్రేక్షకుడూ కన్నీటి పర్యంతమై, వేదనతో నిస్సహాయంగా మిగిలిపోతారు. ఉదాసీనత, నిర్లక్ష్యం వల్లే తన కొడుకు చనిపోయాడని హెన్రీ కిసింజర్ సహా 11 మంది ప్రభుత్వ అధికారులపై దావా వేస్తాడు. కేసు చాన్నాళ్ళు నడుస్తుంది. తగిన సాక్ష్యాధారాలు లేవంటూ కొట్టేస్తారు. ఆ జర్నలిస్టు హత్య అమెరికా స్టేట్ సీక్రెట్‌గా మిగిలిపోతుంది.
ఈ సినిమాలో వినిపించిన పియానో థీమ్ సంగీతం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. దాన్ని, తర్వాత ఎంతో మంది అనేక రూపాల్లో వాడారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డుకి ‘మిస్సింగ్’ నామినేట్ అయింది. కేన్స్, యితర ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఉత్తమ చిత్రం, ఉత్తమ స్కీన్‌ప్లే, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ సంగీత అవార్డుల్ని మిస్సింగ్ గెలుచుకుంది.
మిస్సింగ్ ని పూర్తిగా మెక్సికోలో చిత్రీకరించారు. 1981లోనే ఈ హాలీవుడ్ ప్రొడక్షన్ కి 9.5 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టారు. చాలా దేశాల్లో జనాల్ని వెర్రెత్తించిన ఈ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ 16 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. కోస్టా గౌరస్ తీసిన అతి ఖరీదైన చిత్రం యిది. చార్లెస్ హార్మన్తో పాటు మరో అమెరికన్ జర్నలిస్టుని కూడా పాసిస్టులు హతమార్చారు. అమెరికా గంభీరంగా మౌనం దాల్చింది ! సాల్వడార్ అలెండీ నుండి చార్లెస్ హార్మన్ దాకా చిలీలో జరిగిన వేలాది రాజకీయ హత్యలకి అమెరికా స్వార్థం, దురహంకారమే కారణం ! అప్పుడు అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్. స్పైరో ఆగ్నూ, గెరాల్డో ఫోర్డ్ ఉపాధ్యక్షులు.
చిలీతో నా అనుబంధం
1973వ సంవత్సరం. మా అన్నయ్య ఆర్టిస్టు మోహన్ ‘విశాలాంధ్ర’ దినపత్రికలో సబ్ ఎడిటర్. విజయవాడ ఎస్.ఆర్.ఆర్ కాలేజీలో నేను ఇంటర్మీడియెట్ చదువుకుంటున్నా. అప్పటికి మోహన్‌కి 22 ఏళ్ళు. నాకు 16-17 ఏళ్ళు. 1973 సెప్టెంబర్ 11వ తేదీ సాయంకాలం…. కాలేజీ అయిపోయాక మారుతీనగర్ నించి నడుచుకుంటూ చుట్టుగుంటలోని విశాలాంధ్ర ఆఫీసుకి వెళ్ళాను. ‘ టీ తాగుదాం పద ‘ అన్నాడు మోహన్. నడుస్తున్నాం.
“అరేయ్, చిలీలో దారుణం జరిగిందిరా, బాంబులు వేసి అలెండీని చంపేశారు. పినోచెట్ అనే రాస్కెల్ పవర్లోకి వచ్చాడు. వందలమందిని చంపుతున్నారు. అమెరికా చేస్తున్న ఘోరం అంతాయింతా కాదు. ఇప్పుడే ఆ వార్త రాసి వస్తున్నా” అని చెప్పాడు. సరే, అమెరికా ఇంట్రెస్ట్ ఏమిటి? అని అడిగా. “చిలీలో అద్భుతమైన రాగి గనులున్నాయి. ఆ ఖనిజంతో ఎన్ని వేల కోట్ల డాలర్లు అయినా పిండుకోవచ్చు. దక్షిణ అమెరికాపై అమెరికా ఆధిపత్యానికి ఢోకా వుండదు” అని మోహన్ చెప్పాడు. ఇప్పటికి 47 సంవత్సరాల క్రితం జరిగిన మా సంభాషణ అది.
కట్ చేస్తే 1983 సెప్టెంబర్….. నేను తిరుపతి ఈనాడుకి రిజైన్ చేసి ‘ఉదయం’ దినపత్రికలో చేరడానికి హైద్రాబాద్ వచ్చాను. “ఎవడ్రా నిన్ను రమ్మనింది ! ఇంత ఫూల్ వి ఏంట్రా ! ఈనాడుకి ఎందుకు రిజైన్ చేశావ్ ? అని మోహన్ చచ్చేట్టు తిట్టాడు. నాకు ఏడుపు ఒకటే తక్కువ ! నాటికి ‘ఉదయం’కి ఒక ఆఫీసూ, తాడూ బొంగరం అంటూ ఏమీ లేవు.
” సెప్టెంబర్ 11 వస్తోంది. పదేళ్ళయింది. చిలీ మీద ఆర్టికల్ రాయాలి” అన్నాడు. వ్యాసాలు రాసి పత్రికలకి పంపే అలవాటు మోహన్ కి లేదు. ‘ఉదయం’ మరో ఏడాదికిగానీ రాదు. సో, మోహన్ వ్యాసం రాయలేదు. 1993 సెప్టెంబర్ 11, నేను సికింద్రాబాద్ ఆంధ్రభూమిలో న్యూస్ ఎడిటర్ని. ” అరే చిన్నా. సెప్టెంబర్ 11 వస్తోందిరా, చిలీ మీద రాయాలి అన్నాడు మోహన్. రాయలేదు. 2003 సెప్టెంబర్… ఇద్దరికీ ఉద్యోగాల్లేవు. మోహన్ ఆఫీస్‌లోనే నేను…
30 ఏళ్ళు అయిపోయిందిరా. ఈ సారైనా చిలీ మీద రాయాలి అన్నాడు. దక్షిణ అమెరికా, లాటిన్ అమెరికా రాజకీయాల మీద మోహన్ స్పెషలిస్ట్.
ఆ సీరియస్‌నెస్‌కి అదే కారణం. ఐనా రాయలేదు. 2013 సెప్టెంబర్ : బంజారాహిల్స్ రోడ్‌నెం.12లో అమృతావేలీలో మోహన్ ఆఫీసు. లంచ్ తర్వాత బ్లాక్ టీ తాగుతున్నాం. 40 ఏళ్ళు అవుతోందిరా, చిలీ మీద ఈసారి తప్పకుండా రాస్తాను అన్నాడు మోహన్. సిగిరెట్ వెలిగించి చిలీ జ్ఞాపకాలు చెప్పాడు. పాబ్లో నెరూడా, లూయి కార్వలాన్, విక్టర్ జారా, సాల్వడార్ అలెండీ,..ఆ ఫుట్‌బాల్ స్టేడియం..కోస్టాగౌరస్, ఆ తెల్ల గుర్రం..ఆ నెత్తుటి మరకలు…తగలబడిన ఆశలు.. పినోచెట్గాడి అరాచకం..ఆశలు మొలకెత్తించే ఒక స్పానిష్ పాట.. మానవత్వం మీద నుంచి చరిత్ర నిర్దాక్షిణ్యంగా నడిచి వెళ్ళిపోయిన కాలం గురించి చెప్పాడు. చివరికి చిలీ గురించి రాయకుండానే 2017 సెప్టెంబర్ 17న మోహన్ అందర్నీ విడిచి వెళ్ళిపోయాడు.
ఈ వ్యాసం మోహన్ కోసమే…
– తాడి ప్రకాష్ 97045 41559
extra interesting detail :
గాయకుడు విక్టర్ జూరా హత్య…. 1973 సెప్టెంబర్ 11న చిలీలో ఫాసిస్టులు అధికారంలోకి వచ్చాక, సెప్టెంబర్ 16న విక్టర్ జారాని అరెస్ట్ చేశారు. విక్టర్ లిడియో జారా మార్టినెజ్ చిలీలో పేరుపొందిన జానపదగాయకుడు. నాటక దర్శకుడు. స్పానిష్ గిటార్ అతని చేతిలో పరవశించిపోతుంది. కవి, రచయిత, టీచర్, కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు.
40 ఏళ్ళ జారా చేతివేళ్ళు నరికి, చిత్రహింసలు పెట్టి, తలలో తుపాకీతో కాల్చి చంపేశారు. చిలీ యువతరం రోడ్ల మీదకొచ్చింది. నిరసన ప్రదర్శనలు చేసింది. జారా పాటల్ని గొంతెత్తి పాడింది. 17 ఏళ్ళ ఫాసిస్టు పాలనలో జారా హంతకులు జల్సాగా బతికారు. విక్టర్ జారా మరణించిన 45 ఏళ్ళ తర్వాత తొమ్మిది మంది చిలీ మాజీ సైనికాధికారుల్ని అరెస్టు చేశారు. జారాని అరెస్టు చేసి, ఇంటరాగేట్ చేసి, హింసించి, చంపింది వాళ్ళే. అందరికీ జైలు శిక్షలు పడ్డాయి. సాంస్కృతిక ఉద్యమగీతంగా చిలీ ప్రజలు గుండెల్లో జ్వలిస్తూనే వుంటాడు విక్టర్ జూరా !
Share this Article