నిజంగా సీరియస్‌గా ఆలోచించాల్సిన కేసే ఇది… ఒక హత్య కేసు… బోలెడు కోర్టు సమయం, పోలీసుల ప్రయాస, సాక్ష్యాధారాల సేకరణ, తరువాత కోర్టు జీవితఖైదు విధిస్తే… సింపుల్‌గా ఒక రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి, ఆ నేరస్థుల్ని వదిలేయవచ్చా..? మరిక ఇంత లీగల్ ప్రొసీజర్‌కు, కోర్టు తీర్పుకు అర్థమేమిటి..? అసలు ఖైదీల విడుదలలో ఓ రాష్ట్ర ప్రభుత్వం అధికారాలేమిటి..? పరిమితులేమిటి..? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఎందుకు తెరపైకి వస్తున్నాయీ అంటే…
ఏపీ హైకోర్టులో ఒక మహిళ పిటిషన్ వేసింది… ‘‘నా భర్త పార్థమరెడ్డిని హత్య చేసిన కేసులో ఎనిమిది మంది నేరస్థులు జీవితఖైదు అనుభవిస్తున్నారు… వాళ్లకు ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది… దీనికోసం ప్రత్యేకంగా 121 జీవో తీసుకొచ్చింది… క్షమాభిక్ష ద్వారా బయటకు వచ్చిన పుచ్చలపల్లి నరేన్ రెడ్డి , కొండూరు దయాకర్ రెడ్డి , పుచ్చలపల్లి శ్రీనివాసులురెడ్డి , పుచ్చలపల్లి నిరంజన్ రెడ్డి , పుచ్చలపల్లి సుబ్రమణ్యంరెడ్డి , యల్లసిరి మస్తాన్ , కలతూరు సుధాకర్ రెడ్డి , చెన్నూరు వెంకటరమణారెడ్డిలను తిరిగి జైలుకు పంపేవిధంగా ఆదేశాలు జారీచేయాలి…’’ ఇదీ ఆ పిటిషన్ సారాంశం…
తాజాగా జరిగిన విచారణలో ఆమె తరఫు లాయర్ ఏమంటాడంటే..? ‘‘కనీసం 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించకుండా దోషులను విడుదల చేశారు… వాళ్లలో కొందరు 8, మరికొందరికి 11 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే అనుభవించారు… మరణశిక్ష పడి, కనీసం పదేళ్లు జైలు జీవితం అనుభవిస్తే, అలాంటివాళ్ల శిక్షను జీవిత ఖైదుగా మార్చే అధికారం గవర్నరుకు ఉంది… అది మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది… అంతేతప్ప జీవిత ఖైదు శిక్ష పడి కనీసం 14 ఏళ్లు జైలు జీవితం అనుభవించని వారికి క్షమాభిక్ష ప్రసాదించడానికి వీల్లేదు…’’
Ads
‘‘నేరస్థులు 14 ఏళ్లు కూడా శిక్ష అనుభవించకుండానే, క్షమాభిక్ష ప్రసాదిస్తున్న విషయం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లలేదు… నేరస్థులు విడుదల అయితే తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందనేది పిటిషనర్ భయం… పోలీసులకు కూడా చెప్పింది… ఐనా ప్రభుత్వం గవర్నర్‌కు పూర్తి వివరాలు ఇవ్వలేదు… సో, ప్రభుత్వ పాలసీయే చట్టవిరుద్ధం…’’ ఇదీ పిటిషనర్ తరఫు వాదేన…
161 సెక్షన్ ప్రకారం ఖైదీలకు క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందనీ, పశ్చాత్తాపం- సత్‌ప్రవర్తన కోణాల్లో కమిటీ సిఫారసు మేరకు 14 ఏళ్లు జైలుశిక్ష అనుభవించకపోయినా సరే, విడుదల చేయవచ్చుననీ, ఆ ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉందనీ ప్రభుత్వ న్యాయవాది వాదించాడు… ఈ విచారణను కోర్టు 26 వ తేదీకి వాయిదా వేసి, సంబంధిత వివరాలన్నీ సబ్మిట్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది… ఇలాంటి కేసుల్లో ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారాలేమిటో తెలపాలనీ, తరువాత వాటికి పరిమితులేమిటో చెబుతామని హైకోర్టు చెప్పింది… చర్చనీయాంశమైన కేసే ఇది…!!
Share this Article