ధర్మేంద్ర అనే పెద్ద తోపు… రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఉంటాడు… పెళ్లాం పేరు స్వప్న… పెళ్లిరోజు కానుకగా ఆమెకు మూడెకరాల పొలం కొని… సారీ, జాగా కొనేసి, రిజిస్ట్రేషన్ పత్రాలు ఆమె చేతిలో పెట్టి… ఐ లవ్యూ డియర్ అన్నాడు… ఆ కానుక చూసి మురిసిపోయి నా మొగుడు బంగారం, కాదు, కాదు… మంచి వాల్యూ ఉన్న సైట్ అనుకున్న ఆమె కూడా ఐ టూ డియార్ అనేసింది… మరి కాదా..? అక్కడా ఇక్కడా… ఏకంగా చంద్రుడి మీద మూడు ఎకరాల స్థలం…
ఈ వార్త దాదాపు అందరూ రాశారు… ఇక్కడ మనం చూసే క్లిప్పింగ్ సాక్షిలో వచ్చింది లెండి… చంద్రమండలం మీద జాగా కొన్న తొలి రాజస్థానీ అని కూడా ఓ సర్టిఫికెట్ ఇచ్చేసింది… సరే, వాళ్ల బాధ వాళ్లది కానీ… మనిషి చూడబోతే చదువుకున్నోడిలాగే ఉన్నాడు… మరి ఇదేం రోగం..? ఇదేమిటి ఇంత మాటనేశావేమిటి అంటారా..? కొంపదీసి ఎల్ఆర్ఎస్ చేయించలేదా ఏమిటి..? ధరణిలో ఎంట్రీ లేదా ఏమిటి..? అయినా అదేమైనా తెలంగాణా..? చంద్రుడి మీద కదా అంటారా..? అదే అసలు పైత్యం మరి…
Ads
న్యూయార్కులోని లూనా సొసైటీ ఇంటర్నేషనల్ అనే సంస్థకు మెయిళ్లు పెట్టి, బాగా ప్రయాసపడి, ఒప్పించి, వందల డాలర్లు కొని… ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడట… హహహ…
అసలు చంద్రమండలం మీద ఓనర్షిప్ ఎవరిది..? సోకాల్డ్ లూనా సొసైటీ వాడు ఎవరి దగ్గర కొన్నాడు..? అమ్మినవాడికి ఉన్న రైట్స్ ఏమిటి..? అక్కడ లేఅవుట్ ఎవరు వేశారు..? దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు..? ఈ ధరలు ఖరారు చేసింది ఎవడు..? ఈ బేసిక్ లాజికల్ ప్రశ్నలు రాలేదా సదరు ధర్మేంద్రుడికి..?
ఒక్కసారి ఆ సైటులోకి వెళ్లి చూడండి… INTERNATIONAL LUNAR LAND REGISTRY… ద్వారా రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నట్టు చెబుతాడు వాడు… ఇదెక్కడి రిజిస్ట్రీ… అమెరికాకు చెందిన రిజిస్ట్రీ అన్నారనుకొండి… రష్యా వాడు, చైనా వాడు జాయింటుగా నడ్డి విరిగేట్టు తంతారు వాడిని… పైగా ఎన్నిరకాల సైట్లను ఆఫర్ చేస్తున్నాడో తెలుసా..?
SEA OF RAINS, LAKE OF DREAMS, SEA OF TRANQUILITY, TAURUS MOUNTAINS, THE LUNAR ALPS, LAKE OF HAPPINESS, MOSCOVIENSE (FAR SIDE), ORIENTALE (FAR SIDE), OCEAN OF STORMS, SEA OF SERENITY, SEA OF CLOUDS, SEA OF VAPORS
చదివారు కదా… నిజానికి ఈ ఒక్క సొసైటీయే కాదు… చాలా మంది ఉన్నారు ప్రపంచంలో… చంద్రుడి మీద వేల ఎకరాల్ని అమ్మారు, కొన్నారు… అమ్మేవాడు అమ్ముతూనే ఉన్నాడు… కొనే ధర్మేంద్రలు కొంటూనే ఉన్నారు… స్వప్న వంటి పెళ్లాలు స్వప్నాలు కంటూనే ఉన్నారు… వాటిని ఆహా ఓహో అని మనం వార్తలు రాస్తూనే ఉన్నాం… ఇదుగో ఇలాంటి రిజిస్ట్రేషన్ కాగితాల్ని చుట్టచుట్టి మన చెవుల్లో పెట్టేస్తుంటారు… పోనీ, వాడికి ఓ మెయిల్ కొట్టండి… ‘‘బాబూ, సైటుకు హద్దులు చూపించు… లేదా ఇంకెవరికైనా అమ్మిపెట్టు’’ అని…!!
ఆమధ్య మరణించిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ సహా బోలెడు మంది సెలబ్రిటీలు కూడా ఇలాగే చంద్రుడి మీద ప్లాట్లు కొన్నారు… కానీ అసలు నిజం ఏమిటో తెలుసా..? ది ఔటర్ స్పేస్ ట్రీటీ అనే ఓ అంతర్జాతీయ ఒప్పందం ఉంది… 109 దేశాలు దానిపై సంతకం చేశాయి… ఏ ఖగోళ ఆస్తి మీద ఎవరికీ ఏ హక్కులూ, ఓనర్ షిప్పులూ ఉండవు దానిప్రకారం… అవును, ఇండియా కూడా ఆ దేశాల్లో ఉంది… ఎలాన్ మస్క్ గాడిని రిక్వెస్ట్ చేసి, రయ్యిన స్పేస్ ఎక్స్ వాడి రాకెట్ తీసుకుని, చంద్రుడి మీద దిగేసి, జెండా పాతేసి, ప్లాట్లు చేసేసి, అమ్మకానికి పెడతాను అంటే కుదరదు… ఆ పత్రాలు నాలుక గీక్కోవడానికి కూడా పనికిరావు… అదీ అసలు కథ…
Share this Article