“పదహారేళ్ళ వయస్సులో హైదరాబాదు బులెటిన్ లో కుర్ర రిపోర్టర్ గా చేరాను. సైకిల్ చేతిలో వుండేది. తొలి అనుభవాల నుంచే రిపోర్టర్ చాలా నేర్చుకుంటాడు. నిజానికి జర్నలిజం ఒక వ్యామోహం. మానవ సహజమయిన సౌకర్యాలను గురించి పట్టింపు వుండేది కాదు. వీటన్నిటికీ పరిహారం ఏమిటంటే, మీకు లభించే గుర్తింపు. మీరంటే గౌరవిస్తారు. మీరంటే భయపడతారు.
“ఒక్కోసారి పెద్ద ప్రయత్నం లేకుండానే కొన్ని అద్భుతమైన వార్తలు వచ్చి విలేకరి వొళ్ళో పడతాయి. 1967 లో నిజాం అస్వస్థతకు గురై మరణించినప్పటి వార్త నాకు అలానే అయాచితంగా దొరికింది. అప్పుడు యు.ఎన్.ఐ. ఆఫీసు నిజాం క్లబ్ ని ఆనుకుని వున్న రోషన్ మంజిల్ లో వుండేది. అప్పట్లో మూడు సంపన్న క్లబ్బుల్లో సభ్యత్వం కలిగిన ఏకైక జర్నలిస్టును నేనే. అక్కడ బ్యూరో చీఫ్ గా ఉద్యోగం చేస్తూనే నాలుగు ఆంగ్ల పత్రికలకు కరస్పాండెంట్ గా పనిచేసేవాడిని. సహజంగా క్లబ్బు పక్షులకు అన్నిరకాల వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడుకునే వీలుంటుంది.
పారిశ్రామికవేత్తలు, ఐ.యే.ఎస్., ఐ.పి.ఎస్. వంటి మూడక్షరాల బ్యూరోక్రాట్లు, జూదర్లు, లోఫర్లు, తిరుగుబోతులు అందరూ అక్కడ దర్శనమిస్తారు. రాజకీయ, అధికార సౌధాల్లోని ముచ్చట్ల నుంచి సామాజిక, రంకు పురాణాల వరకు అక్కడ బయల్పడుతుంటాయి. నా నివాసం జాంబాగ్ లో. స్కూటర్ పై బయలుదేరి బొగ్గులకుంట మీదుగా యే అర్ధరాత్రికో ఇంటికి చేరుకోవడం అలవాటు.
Ads
ఓ రాత్రి అలా వస్తుండగా నిజాం రాజభవనంలో దీపాలు వెలుగుతూ కనిపించాయి. ప్రధాన ద్వారం తెరిచివుంది. గార్డులు సావధానంగా నిలబడి వున్నారు. ఒక కారు బయటకు వస్తోంది. కారులో వున్నది డాక్టర్ రామయ్య కాదు కదా అన్న అనుమానం కలిగింది. ఇంటికి వెళ్లి డాక్టర్ కు ఫోను చేసాను. రాజభవనంలో ఎవరో అస్వస్తులుగా వున్నారు. ఎవరని అడిగితే కరక్టుగా జవాబు రాకపోవచ్చు. అందుకే ధైర్యం చేసి సూటిగా అడిగేశా. ‘డాక్టర్, ముసలాయన తెల్లారేదాకా వుంటాడా’ అని. ఆయన ముక్తసరిగా ‘యెలా చెప్పగలను? మంచే జరుగుతుందని అనుకుందాం’ అన్నాడు.
ఇక ఆలశ్యం చేయకుండా ఫోను తీసుకుని, ఆఫీసుకు ఫోను చేసి, డ్యూటీలో వున్న ఆపరేటర్ కు ‘నిజాంకు తీవ్ర అస్వస్తత’ అంటూ రెండు లైన్ల ఫ్లాష్ వార్త చెప్పాను. ఉద్దేశ్య పూర్వకంగానే స్తానిక పత్రికలకు ఈ వార్తను తెల్లవారుఝాము వరకు విడుదల చేయకుండా ఆపాను. ఈ విధంగా చేయడం వల్ల ప్రత్యర్ధి న్యూస్ ఏజెన్సీ పీ.టీ.ఐ. కి వార్త లీక్ అయ్యే అవకాశం వుండదు. మరునాటికల్లా ఈ వార్త సంచలనంగా మారింది.
నిజాం వంటశాలలో పనిచేసేవాడు మా ఆఫీసులో ప్యూను జానేజాద్ కు బంధువు. సమాచారం పట్టి సాయంత్రానికల్లా ‘నిజాం మృతి’ అంటూ స్నాప్ వార్త పంపాను. ప్రత్యర్ధి వార్తా సంస్థలు అప్పటికి ఇంకా నిజాం అస్వస్థతకు సంబంధించిన వార్తలు మాత్రమే ఇస్తున్నాయి. ఆ సమయంలో మా వార్తాసంస్థ నిజాం మరణం గురించి ప్రపంచానికి తెలియచేసింది.”
((….. ఈ స్వగతం అంతా ప్రసిద్ధ జర్నలిస్టు ధర్మవరపు సీతారాం రాసిన ‘జర్నలిజం ఒక నషా’ అనే వ్యాసంలోనిది… ఇప్పటి జర్నలిజానికి అప్పటి జర్నలిజానికీ ఛాయమాత్రం పోలిక కూడా ఉండదు… ఇప్పటివాళ్లు ఎవరూ రిలేట్ చేసుకునే సాహసం చేయొద్దు సుమీ… ఈ వ్యాసభాగాన్ని కూడా Srinivasa Rao Apparasu, మరియు Bhandaru Srinivasa Rao ఫేస్‌బుక్ సంభాషణ నుంచి ఎత్తుకొచ్చాను…))
Share this Article