ఫాఫం, సీపీఐ నారాయణ కూడా ఇప్పుడు బిగ్‌బాస్ షో నడుస్తున్న తీరు చూస్తే… తనే జాలిపడి, అందరినీ వ్యభిచారులుగా ముద్ర వేసినందుకు లెంపలేసుకుని.., ఇవేం దరిద్రపు ఆటలురా, అసలు వీళ్లేం పోటీదారులు, ఇదేం పోటీ అని నాలుగు కన్నీటి బొట్లు రాల్చేసి.., ఇక జీవితంలో బిగ్‌బాస్‌ను గానీ, నాగార్జునను గానీ ఒక్క మాటా పరుషంగా అనబోనని భీషణ శపథం చేసే అవకాశముంది.., అద్భుత విశ్లేషకుడు, సర్వజ్ఞుడు, సకల రంగాల నిపుణుడు త్రిపురనేని చిట్టిబాబు కూడా బహుశా ఇకపై ఈ షో మీద కామెంట్లు చేయకపోవచ్చు కూడా…!
అంతెందుకు..? ఈ వీకెండ్ షోకు హోస్టింగ్ చేయకుండా, అసలు ఈ షో వదిలేస్తే ఎలా ఉంటుందని నాగార్జునే తీక్షణ సమీక్ష చేసుకునే అవకాశం కూడా ఉంది… అసలు బిగ్‌బాసే అంతా నా ఖర్మరా భయ్ అని టపటపా లెంపలేసుకున్నట్టుగా వ్యవహరించాడు బుధవారం… ఎందుకో తెలుసా..? రెండు రోజులుగా ఓ టాస్క్ ఇచ్చాడు కదా… ఓ అడవి, అందులో విలువైన వస్తువులు, ఓ దొంగల టీం, ఓ పోలీసుల టీం, ఒక వ్యాపారి… వీళ్లు దొంగిలించాలి, వాళ్లు కాపాడాలి, వ్యాపారి అడ్డికి పావుశేరులా కొనేయాలి…
తీరా చూస్తే ఒక్కరికీ ఆ ఆటేమిటో అర్థం కాలేదు అందులో… అది అర్థం కానందుకు వాళ్లను మందబుద్ధులు అని నిందించాలా..? అర్థమయ్యేలా వాళ్లకు చెప్పనందుకు, ఓ పిచ్చి ఆటతో ప్రేక్షకులను కూడా చిరాకుపెట్టినందుకు బిగ్‌బాస్ టీంను నిందించాలా..? మనమెందుకు బిగ్‌బాసోడికే తన తప్పేమిటో అర్థమైంది… మళ్లీ అందరినీ కూర్చోబెట్టి… అవ్వలూ, అయ్యలూ… ఇది చాలా సింపుల్ ఆట… దొంగలు ఎత్తుకుపోతారు, పోలీసులు కాపాడతారు, చాలా సింపుల్… కాస్త జాగ్రత్తగా ఆడండి అని చెప్పాడు…
Ads
అంటే ఏమిటి అర్థం..? తను ఇచ్చిన గేమే ఓ చెత్త అని… అందుకే ఒక్క సభ్యుడు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేక, అడ్డదిడ్డంగా ఆడుతున్నారని… విచిత్రం ఏమిటంటే… బిగ్‌బాస్ అందరినీ కూర్చోబెట్టి వివరంగా చెప్పినా సరే, తరువాత కూడా కంటెస్టెంట్లు అలాగే అర్థంపర్థం లేకుండా ఆడుతున్నట్టు కనిపిస్తోంది… ఏం టీం ఎంపిక చేశావురా బాబూ..? చివరకు ఎంత దారుణం అంటే..? రేవంత్‌కు మంచి పాయింట్లు రావొద్దని తన సొంత టీం సభ్యులే తనకు వెన్నుపోటు పొడవడం…
ఇక చెప్పండి… ఈ దరిద్రంపై నాగార్జున ఏం విశ్లేషించగలడు..? ఎందరిని తిట్టగలడు..? మొన్నటి వీకెండ్ షోలోనే అందరినీ బయటికి పంపించేస్తానంటూ ఢాంఢూం అన్నాడు… ఓ ఇద్దరిని పంపించేశాడు… చూడబోతే వాసంతి ఈసారి లైన్‌లో ఉండేటట్టుంది… బాలాదిత్యది కూడా పూర్ గేమ్… రేవంత్ తీరుతో విసిగి మధ్యలోనే బిగ్ బాస్ ‘‘ఇక వెంటనే నీ ఆట ఆపెయ్’’ అని చెప్పాల్సి వచ్చింది… బిగ్‌బాస్ హౌజులో ఎలా ఉండాలో ఒక్క గీతు మాత్రమే కరెక్టుగా అర్థం చేసుకుంది…
అసలు ఉద్దేశపూర్వకంగానే స్టార్ గ్రూపు ఈ షోను అండర్ ప్లే చేస్తోందనీ, దానివెనుక ఏదో వాణిజ్య ఎత్తుగడ ఉండవచ్చునని ప్రచారం ఉంది… ప్రస్తుతం షో నడుస్తున్న తీరు కూడా అలాగే ఉంది… ప్రేక్షకుల నుంచి పూర్ రెస్పాన్స్… యాడ్స్ లేవు… రేటింగ్స్ రావడం లేదు… బిగ్‌బాస్ టీంకే పెద్దగా ఇంట్రస్టు ఉన్నట్టు కనిపించడం లేదు… కంటెస్టెంట్లు కూడా వాళ్లేం ఆడుతున్నారో వాళ్లకే తెలియడం లేదు… బహుశా బిగ్‌బాస్ టీం ఇంత బేకార్ షో ఇంతకుముందు అస్సలు నడిపించినట్టుగా లేదు… హేమయ్యా, నాగార్జునా… అంతిమంగా ఎవరి ఇజ్జత్ పోతోంది..?!
Share this Article