ఉస్మానియా యూనివర్శిటీ జువాలజికల్ పరిశోధకులు ఓ అత్యంత అరుదైన చేపను కనుగొన్నారు అని నమస్తే తెలంగాణలో ఓ పెద్ద వార్త వచ్చింది… పులి చారలున్న చేప అంటే… సూపర్, వీర తెలంగాణ పోరాటపటిమ రేంజ్లో ఉందిలే చేపరూపం అనుకుంటూనే ఉన్నాను… ఆ చేప ఫోటో చూస్తుంటే, దానికి పెట్టిన తెలంగాణేన్సిస్ పేరు చదువుతుంటే… అరెరె, కేసీయార్ పేరు కలిసొచ్చేలా పెడితే వీళ్ల సొమ్మేం పోయింది అనిపించిన మాట నిజం… కానీ ఉస్మానియా యూనివర్శిటీ కదా… పెట్టరులే అని సమాధానపరచుకున్నాను… కానీ..? ఎక్కడో ఏదో కొడుతోంది… ఏమిటబ్బా అది..?
…….. ఈ పేరు ఎక్కడో విన్నా… చదివా… సేమ్, అదే పేరు… తెలంగాణేన్సిస్… ఎస్… సరిగ్గా అయిదేళ్ల క్రితం ఇదే వర్శిటీ, ఇదే జువాలజికల్ విభాగం పరిశోధకులు… ఓ సాలీడును కనిపెట్టారు… దానికి తెలంగాణేన్సిస్ అని శాస్త్రీయ నామం పెట్టినట్టుగా పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి… Thomisus telanganensis… కరీంనగర్ జిల్లా, నగునూరులో కనిపెట్టాం, Journal of Threatened Taxa లో ఈమేరకు ఓ ఆర్టికల్ పబ్లిష్ అయ్యిందనీ చెప్పారు…
Ads
ఆ సాలీడు తన తోటి సాలెపురుగుల్లాగా సాలెగూడు అల్లదు… అచ్చం పీతలా కనిపిస్తుంది… క్రిములను తింటుంది… హఠాత్తుగా తన ఆహారం మీద పడి, విషాన్ని జల్లి, ఆరగిస్తుంది… అప్పట్లో దిహిందూలో దీని ఫోటో కూడా పబ్లిష్ చేశారు… ఇదుగో…
అచ్చం ఎండ్రికాయలాగే ఉంది కదా… దీన్ని తెలంగాణ కోసం అసువులు బాసిన వందలాది మందికి అంకితం చేస్తున్నట్టు కూడా అప్పట్లో చెప్పారు… గుడ్… అభినందనీయం…
సరే, ఇక ప్రస్తుతానికొద్దాం… ఈ పులిచారల కొత్త రకం మత్స్యం, అనగా చేపను కూడా ఉస్మానియా వర్శిటీ జువాలజీ విభాగమే కనిపెట్టింది… అదీ ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లోని నీటిజాడల్లో… పులుల అభయారణ్యంలో మరి పులిచారల చేపలు దొరకడం అంటే మజాకా… అక్కడ జీవజాతులన్నీ పులుల టైపే…
దీన్ని కూడా జాటాక్సా అనే ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ పబ్లిష్ చేసింది… గుడ్… కానీ ఈ చేప రూపలక్షణాలే గాకుండా మైటోకాండ్రియా, డీఎన్ఏ వేరుగా ఉన్నాయనే వాక్యం చదివాక బోలెడంత అయోమయం, గందరగోళం నిండిపోయింది… డీఎన్ఏ మారిపోతే అసలు చేప అనొచ్చా దీన్ని..? పోనీలే, మ్యుటేషన్లతో పుట్టుకొచ్చిన కొత్త జాతి అనుకుందాం… కానీ అప్పట్లో పీతసాలీడుకూ అదే తెలంగాణేన్సిస్ అని పేరుపెట్టి, మళ్లీ ఇప్పుడు ఈ పులిచేపకూ అదే పేరు ఎందుకు పెట్టడం..?
ఏమోలెండి… బాగా చదువుకున్న పరిశోధకులు కదా… వార్త రాయడంలోనే ఏదో తప్పు దొర్లి ఉంటుంది… రేప్పొద్దున మరింత అరుదైన ఇంకేదో జీవం కనిపించినా సరే… మరో అయిదేళ్ల తరువాతయినా సరే… అదే తెలంగాణేన్సిస్ అని పేరు పెడదాం… ఏమంటారు..?! మరీ ఈ చేప దొరికిన స్థలం గుర్తొచ్చేలా కవ్వాలిసిస్ అనో, ఆ సాలీడు దొరికిన నగునూరు స్పైడర్ అనో పేర్లు పెడితే ఏం బాగుంటుంది..? శాస్త్రీయనామం అంటే మాటలా..? ఇదుగో, ఇలా ఓ రేంజ్ ఉండాలి… తెలంగాణేన్సిస్… రిపీటైనా సరే, పలకలేకపోయినా సరే… నో, ఈ పేరు దగ్గర మాత్రం రాజీపడేది లేదు… అంతే…
Share this Article