మలయాళ సినిమా పేరు తంత్రం… బాగానే ఆడుతోంది… మలయాళం వాళ్లు కథల్లో భలే ప్రయోగాలు చేస్తారు… ఆ హీరోలు కూడా నిక్షేపంగా అంగీకరిస్తారు… ఓ పిరికి లాయర్ మమ్ముట్టి, పక్కన హీరోయిన్ ఉండదు, పాట ఒక్కటీ లేదు… కామెడీ మచ్చుకైనా కనిపించదు… సో, అవి యాడ్ చేసుకుంటే ఓ మంచి సినిమా అవుతుందిలే అనుకున్నాడు దర్శకుడు వంశీ… కామెడీ యాడ్ చేయాలి కదా, రాజేంద్రప్రసాద్ బెటర్ అని కూడా అనుకున్నాడు…
రాజమండ్రి దగ్గర బొమ్మూరు నుంచి ఓ కుర్రాడు, ఓ అమ్మాయి వస్తే… కనుముక్కూతీరు బాగానే ఉన్నాయి కదా, పర్లేదులే, తీసేసుకుందాం హీరోయిన్‌గా అనీ ఫిక్సయిపోయాడు… పేరు దేవి అట… కానీ ఎవరో పెద్దాయన కిన్నెర అని మార్చేశాడట… ఇక వంశీకి మార్చడానికి ఏమీ లేదు… అదే పేరు ఫిక్స్… కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ సినిమాలో హీరోయిన్ ఎంపికే ఓ మైనస్ అని కూడా మళ్లీ మరిచిపోయాడు… సినిమా టైటిల్ చెట్టుకింద ప్లీడరు అని ఫైనల్ చేసేశాడు…
మైండ్‌లో మాత్రం గాలికొండపురం రైల్వే గేటు స్టోరీ లైన్ గురించే మథనం… యద్దనపూడి సులోచనరాణి వర్క్ చేసి ఉంటే బాగుండు అనుకున్నాడు… కానీ ఆమె చేయలేదు… హఠాత్తుగా తనకు డిటెక్టివ్ యుగంధర్ సృష్టికర్త కొమ్మూరి సాంబశివరావు గుర్తొచ్చాడు… వెంటనే నాలుగు నల్లని చుక్కలు, మోటారు కారులో శవం, గణగణ మోగిన గంట, పారిపోయిన ఖైదీ… ఇలా ఒకటా రెండా చిన్నప్పుడు చదివిన ఆ నవలలన్నీ మదిలోకి వచ్చేస్తున్నాయి… ఆ సాంబశివరావు అంటే వంశీకి భలే ఇష్టం…
Ads
నార్త్ ఉస్మాన్ రోడ్, కుడిపక్క బజుల్లా రోడ్, రైట్‌లో మొట్టమొదటి ఇల్లు ఆయనదే… సత్యం, వంశీ వెళ్లి కూర్చున్నాక కాసేపటికి నవ్వుతూ వచ్చి కూర్చున్నాడు కొమ్మూరి… ఫోటోల్లో ఎప్పుడూ కనిపించడు ఆయన… ఓహో, ఈయనే కదా యుగంధర్నీ, తన అసిస్టెంటు రాజునీ, లేడీ అసిస్టెంటు కాత్యానీ క్రియేట్ చేసింది’’ అనుకుంటూ, బుష్ షర్ట్ వేసుకుని, బక్కపల్చగా ఉన్న ఆయన్నే చూస్తూ ఉండిపోయాడు వంశీ… ‘‘ఇతను మీర్రాసిన డిటెక్టివ్ నవలలే కాదు, సోషల్ నవలలూ చదివాడు, చలం భక్తుడు’’ అని పరిచయం చేశాడు వంశీతోపాటు వచ్చిన సత్యం… ‘‘122 రూటు బస్సెక్కి, తిరువన్నామలై వెళ్లి, నాన్న గారి ఆశ్రమంలోకెళ్లి, ఆయన్ని కలిశొచ్చాను’’ అని చెబుతూ పోతున్నాడు వంశీ…
సాంబశివరావు ప్లజెంటుగా ఓ నవ్వు విసిరేసి… ‘‘అవును, నాకు స్వయానా పెదనాన్న చలం… గుడిపాటి వెంకటచలం… చిన్నప్పుడు గుడిపాటివారు దత్తత తీసుకున్నారు, దాంతో ఇంటి పేరు మారిపోయింది’’ అన్నాడాయన… ఆయన రాసినవన్నీ చిన్నప్పుడే చదివేసి ఉంటారు కదా అనడిగాడు వంశీ… ‘‘నేను నడిపిన మంజూష పత్రికలో చాలా రాయించేవాడ్ని పెదనాన్నతో… అసలు నేను సోషల్ నవలలు రాయడానికి ప్రేరణ మా పెదనాన్నే’’ అన్నాడాయన…
మరి ఎక్కువగా సోషల్ నవలలు ఎందుకు రాయలేదు అంటాడు వంశీ, వాటికన్నా డిటెక్టివ్స్‌కే డిమాండ్ ఎక్కువ అంటాడు ఆయన… వచ్చిన పని మానేసి ఆ నవలల ముచ్చట్లలో పడిపోయారు ఇద్దరూ… 90 దాకా బుక్స్ రాశారు కదా, ఎన్ని నవలలు సినిమాలుగా వచ్చాయనడిగాడు వంశీ… పెద్దగా ఏమీలేవు, పట్టుకుంటే లక్ష, ఒక చల్లని రాత్రి, నకిలీ మనిషి… ఒకటి నేనే నిర్మించడం మొదలెట్టాను, అది కాస్త మధ్యలోనే ఆగిపోయిందని బదులిచ్చాడు ఆయన…
‘‘అసలు మీ యుగంధర్ కేరక్టర్‌కు సరిపడే ఆర్టిస్టు ఎవరిని అనుకున్నారు..?’’ ‘‘ఎస్వీరంగారావు… నా కోరిక తీర్చకుండానే వెళ్లిపోయారు ఆయన…’’ వంశీ అప్పుడు చూశాడు కొమ్మూరి చేతులకు ఆరేసి వేళ్లుండటాన్ని… పెన్ను పట్టుకుంటే పట్టు ఉండదు కదా, మరి ఎలా రాస్తారు..? మరో ప్రశ్న… టేపులో రికార్డు చేస్తాను, దాన్ని వింటూ నా భార్య శ్యామలాదేవి స్క్రిప్టు రాసేది… అవునూ, మీ ఫోటో పబ్లిష్ చేయడానికి ఎందుకు ఇష్టపడరు..? ‘‘ఏదైనా గొప్ప నవల రాసినప్పుడు వేసుకోవచ్చు అనుకున్నాను, ఏదీ, ఇంతవరకూ గొప్పది ఏమీ రాయలేదు కదా…’’ అని నవ్వేశాడాయన…
‘‘మీ సర్ నేమ్ కొమ్మూరి గదా…. మరి K బదులు C రాస్తారెందుకూ?” “ఆవుని కౌ అంటారు గదా ఇంగ్లీషులో దాని స్పెల్లింగ్ చెప్పు?” అడిగాడు ఆయన… ‘‘సిగరెట్లు బాగా కాల్చెయ్యడం వల్ల, ఊపిరి సరిగ్గా పీల్చుకోలేని అవస్థ ఇప్పుడు… నాకిష్టమైన వాకింగ్ కూడా చెయ్యలేకపోతున్నాను… నాలుగు అడుగులేస్తే ఆయాసం. ఫస్ట్ ఫ్లోర్ వరకూ పర్లేదుగానీ తర్వాత ఫ్లోరైతే ఇంక మెట్లెక్కలేక ఆయాసపడ్తున్నాను’’ అంటూ నవ్వాడు మళ్లీ… సంభాషణ ముగిసింది… తరువాత ఆ సినిమా కథకు ఆయన సహకరించాడా..? ఏమైంది..? ఏమో… వంశీ ఇవన్నీ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు గానీ, తరువాత ఏమైందో రాయలేదు మరి…!!
Share this Article