ఆమధ్య మనం ఓ ముచ్చట చెప్పుకున్నాం… ఎంతటి థండర్ స్ట్రయిక్ సినిమాలైనా సరే, టీవీ ప్రసారంలో బోల్తా కొడుతున్నయ్… చేతులు ఎత్తేస్తున్నయ్… అవీ మామూలుగా కాదు, టీవీ సర్కిళ్లు- ఫిలిమ్ సర్కిళ్లు విస్తుపోతున్నయ్… ఈ పరిణామం రాబోయే రోజుల్లో టీవీ ప్రసార హక్కుల రేట్లను దారుణంగా ప్రభాావితం చేయబోతోంది…
మీకు గుర్తుంది కదా… ఆర్ఆర్ఆర్ రేటింగ్స్ సాధనలో ఫెయిలైందని రాసుకున్నాం… తరువాత కేజీఎఫ్-2 రేటింగ్స్ అయితే మరీ ఘోరం… ఇప్పుడు తాజాగా కమల్‌హాసన్ బ్లాక్ బస్టర్ సినిమా విక్రమ్ కూడా ఘోరంగా ఫెయిలైంది టీవీ రేటింగ్స్ విషయంలో…! నిజానికి ఈ సంవత్సరం పాన్ ఇండియా స్థాయిలో థండర్ స్ట్రయిక్స్ ఈ మూడు సినిమాలే… ఏక్‌సేఏక్ వసూళ్లు సాధించాయి… ఓటీటీ, డిజిటల్, టీవీ రైట్స్ కూడా పెద్ద మొత్తాలకు అమ్ముడుబోయాయి… తీరా చూస్తే మూడూ టీవీల్లో అట్టర్ ఫ్లాపులే…
కొంతమేరకు ఆర్ఆర్ఆర్ నయం (19.22 రేటింగ్స్)… కేజీఎఫ్-2 అయితే 6.53 రేటింగ్స్… హైదరాబాద్ బార్క్ కేటగిరీ… ఇదే ఇంతగా ఆశ్చర్యపరిచిందీ అనుకుంటే, ఇప్పుడు విక్రమ్ ఇంకా ఘోరంగా 3.86 రేటింగ్స్ సాధించింది… నిజానికి మామూలు పరిస్థితుల్లో ఆ సినిమా టీం మొత్తం సిగ్గుపడాల్సిన ఫెయిల్యూర్… నిజానికి కేజీఎఫ్ జీతెలుగు, కానీ ఇది మాటీవీ… కాస్త బెటర్ రేటింగ్స్ వచ్చి ఉండాలి… కానీ ఢమాల్… అయితే ఈ ఫలితం ఎక్స్‌పెక్ట్ చేసిందే… అదే మనం కేజీఎఫ్ రేటింగ్స్ గురించి రాసినప్పుడు చెప్పుకున్నది… అదే జరిగింది… కానీ ఎందుకిలా..?
Ads
రెండు మూడు ప్రధాన కారణాలున్నయ్… 1) జనం టీవీల ముందు కదలకుండా కూర్చుని సినిమాలు చూసే అలవాటు నుంచి దూరం అవుతున్నారు… అది ఎంత మంచి సినిమా అయినా సరే… ఎందుకంటే..? అదే సినిమా సంబంధిత ఓటీటీల్లో ఉంటుంది… తాపీగా టైం దొరికినప్పుడు అందులో చూసేస్తున్నారు… ఉదాహరణకు మాటీవీలో వేసే సినిమా హాట‌్‌స్టార్‌లో ఉంటుంది కదా… మరిక టీవీ ఎదుట కట్టేసినట్టు కూర్చోవడం దేనికి..?
2) ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది… ఏది థియేటర్ సినిమా..? ఏది టీవీ సినిమా..? అదరగొట్టే గ్రాఫిక్స్, కన్నులపండుగ సీన్లు, ఉరకలెత్తించే యాక్షన్లు, దడదడలాడే బీజీఎం గట్రా ఉంటే థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ కోరుకుంటున్నారు… లేదంటే ఓటీటీ… అవి వీలుకానివాళ్లే టీవీక్షణం… ఆర్ఆర్ఆర్, విక్రమ్, కేజీఎఫ్ థియేటర్లలో చూసే సినిమాలు… చూసేశారు… థియేటర్ ఇంట్రస్టు లేనివాళ్లు ఓటీటీల్లో చూశారు… ఇక టీవీల్లో చూసేదెవరు..?
3) విక్రమ్ సినిమా గానీ, కేజీఎఫ్ గానీ… డిష్యూం డిష్యూం, కాల్పులు, సీరియస్ సీన్లు, రక్తాలు, విధ్వంసం తప్ప ఏమున్నాయి ఆ సినిమాల్లో… టీవీల ఎదుట కూర్చుని ఎంజాయ్ చేసేంత వినోదం లేదు… కామెడీ లేదు, రొమాన్స్ లేదు, ఇతరత్రా ఏ ఎంటర్‌టెయిన్‌మెంటు లేదు… మరీ విక్రమ్ సినిమాలోనైతే ఎవడు ఎవడిని కాలుస్తున్నాడో, ఎవడి పాత్ర ఏమిటో… ఎవడు అండర్ కవరో, ఎవడు విలనో అర్థం కానంతగా హింస… ఓటీటీలోనే కాసేపు చూసి మూసేసిన ప్రేక్షకుల సంఖ్య లక్షల్లో ఉంటుంది… ఇక టీవీల్లో ఫ్యామిలీస్ ఏం చూస్తాయి..?
4) నిజంగా అది కమల్ హాసన్ సినిమాయా..? 67 ఏళ్ల వయస్సులో ఈ సాదాసీదా యాక్షన్ సినిమాలు అవసరమా తనకు..? ఒకప్పుడు ప్రయోగాలకు పేరొందిన కమల్ ఈ పిచ్చి కథకు ఎలా అంగీకరించాడో అర్థం కాదు… పైగా విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, మధ్యలో సూర్య… ఇందరు అవసరమా ఈ సినిమా కథకు..?
ఈమధ్య ప్రతి సినిమా మాఫియా మీదే… అందుకే హిందీ ప్రేక్షకులకు ఈ సినిమాలు నచ్చుతున్నాయేమో… కానీ సౌత్ ప్రేక్షకులు ఎప్పుడూ చూసేవే… అందుకే ఆయా నిర్మాతలు చెప్పుకునే కలెక్షన్ల ఫిగర్స్ మీద కూడా పరిశ్రమలోనే బోలెడు సందేహాలున్నయ్… ఇప్పుడు బ్రహ్మాస్త్ర కలెక్షన్ల మీద ఉన్నట్టుగా…!! టీవీ జనం తిరస్కరిస్తున్నారూ అంటే… ఇకపై టీవీ ప్రసార హక్కుల దందా మీద బాగా ప్రభావం ఉండబోతోంది అని లెక్క… ఈ పెద్ద సినిమాలే తన్నేస్తే, ఇక చిన్న సినిమాల పరిస్థితేమిటి..? ఇదొక సంధి దశ…!!
Share this Article