పాముల్లోనా విషముంది…
పువ్వులోన విషముంది…
పూలను తల్లో పెడతారే!
పామును చూస్తే కొడతారే!
…. హఠాత్తుగా చదివితే కవిత్వమో, పైత్యమో అర్థం గాక.., అరె, ఇది రాసింది ఎవడుర భయ్ అని ఆ మనిషి కోసం అర్జెంటుగా వెతకాలనిపిస్తదా లేదా..? పాముల్లోనా విషముంటది, పువ్వులోన విషముంది అట… పూలను తల్లో పెడతారు, పామును చూస్తే కొడతారేమిటోయ్ అని గట్టిగా నిలదీస్తున్నాడు ఈ కవి…
ఫాఫం, చంద్రబోస్… గతంలో ఏం రాశాడో, ఇప్పుడెందుకు ఇలా తయారయ్యాడో మనం జుత్తు పీక్కోనవసరం లేదు… తనెప్పుడూ అంతే… ఏం రాస్తాడో తనకే తెలియదు… క్లిక్కయితే తన ఘనత… తను రాసిన ఈ పాట కూడా అలాగే అనిపించడం లేదా..? అసలు స్ట్రెయిట్ గీతాలే గమ్మత్ ఉంటయ్… ఇక అనువాద గీతాలు..? ఇదుగో ఇలాగే ఉంటయ్… ఏవో ట్యూన్లలో నాలుగు తెలుగు పదాలను ఇరికిస్తే, ఆ వాయిద్యాల మోతలో ఈ వాక్యాలు వినేవాడు ఎవడు..? అర్థాలు వెతికేవాడు ఎవడు..? సబ్ కుచ్ చల్తా… కనీసం మనకు కూడు పెడుతున్న భాషకు, పాటకు మర్యాద, గౌరవం ఇవ్వాలి కదా అంటారా..? భలేవారే, సినిమా ఇండస్ట్రీలో అలా ఆలోచిస్తే ఒక్కరోజు కూడా ఎవరూ ఒక్కపాట కూడా రాయలేడు…
Ads
పువ్వులు అనగానే పరిమళం గుర్తుకురావాలి, మకరందం గుర్తుకురావాలి… పువ్వు అనేదే పుప్పొడిని మోసుకొచ్చే జీవులను ఆకర్షించే ఒక సౌందర్యం… సృష్టికార్యానికి ముందుగానే ముస్తాబయ్యే ఏర్పాటు పూలసొగసు… మరి ఈయనేమిటి, పువ్వుల్లోనా విషముంది అంటాడు…? పామును, పువ్వును పోలుస్తాడేమిటి..? రెండూ విషపూరితాలే అంటాడేమిటి..? కొంపదీసి కవిత్వంలో ఎవరికీ అర్థంగానంత మార్మిక ఎత్తులకు ఎదిగిపోయాడా చంద్రబోస్..? అరె, చెప్పనేలేదు కదూ… సినిమా పేరు ‘నేనే వస్తున్నా’…
సోకాల్డ్ భారీ పాన్ ఇండియా సినిమా ‘పొన్నయిన్ సెల్వన్’కు ఒకరోజు ముందే రిలీజవుతున్నాడు ధనుష్ ఈ సినిమాతో… తమిళ హీరోలందరి సినిమాల్ని తెలుగు ప్రేక్షకుల మీద కూడా రుద్దడం ఆనవాయితీ కదా… సో, చకచకా డబ్బింగ్ చేసిపారేసి, మన మీదకు వదులుతున్నారు… అదుగో ఆ సినిమాలోనిదే ఈ పాట… ‘నానే వరువెన్’ (Naane Varuven Movie) అనేది ఒరిజినల్ తమిళ సినిమా…. దీనికి సెల్వ రాఘవన్ దర్శకత్వం… సంగీత దర్శకత్వం యువన్ శంకర్ రాజా… ఇద్దరికీ తెలుగు రాదు… ఇంకేముంది..? గీత రచయిత ఏది రాస్తే అదే తెలుగు…
‘ఒకే ఒక ఊరిలోనా…
రాజులు ఏమో ఇద్దరంటా!
ఒక్కడేమో మంచోడంట…
ఇంకోడేమో చెడ్డోడంట!
చిక్కని చీకటి లేకుంటే…
చంద్రుని వెలుగే తెలియదులే!
రక్కసుడు ఒక్కడు లేకుంటే…
దేవుని విలువే తెలియదులే!
బాగుంది, చిన్నపిల్లలకు నీతికథ చెబుతున్నట్టుగా… మొదట్లో రెండుమూడు వాక్యాలు సరళంగా… పర్లేదు… చీకటి లేకపోతే చంద్రుడి విలువ ఏం తెలుస్తుంది..? రాక్షసుడు లేకపోతే దేవుడి విలువ ఎలా తెలిసేది..? అంటున్నాడు… పర్లేదు… ఎటొచ్చీ… ఆ తరువాతే చంద్రబోస్ ఎటెటో వెళ్లిపోయాడు… అంతేలే, తమిళం నుంచి తెలుగుకు దాదాపు ప్రతి పాటా ఇదే రీతి… పైగా చంద్రబోస్… ఇంకేముంది..? ఇదే గతి…
మనిషిలో మృగమే దాగుంది…
మృగములో మానవత ఉంటుంది!’
మనిషిలో మృగమే దాగుంది… నిజమే… మనిషే ఒక మృగం అనుకుందాం… మళ్లీ దానిలో మానవత దాగి ఉండటమేంటి..? మనకు మనమే సమాధానం చెప్పుకోవాలి ఇక… ఆ కథానాయకుడి తత్వాన్ని చెబుతున్నాడేమో అని..! హీరోలో మృగం ఉంది, కానీ దాంట్లో మానవత ఉందీ అని…! ఇదెక్కడి పైత్యంరా బాబూ అనిపిస్తోందా..? అనువాద భూతాల్ని ఆదరిస్తున్నాం కదా… అరవ జనానికి అలా అలుసైపోయాం… ఇదీ అంతే… అనుభవిద్దాం… ఆస్వాదిద్దాం…!! యూట్యూబ్‌లో సరిగమ కంపెనీవాడు ఈ వీడియో పెట్టాక 35 వేల మంది దేకారు ఈ వీడియోను… చంద్రబోస్ రచనకు జనం ఆదరణ ఇదన్నమాట…!! (ఈ కథనం రాసే సమయానికి)
Share this Article