చందమామ మోము, చారడేసి కళ్లు, దొండపండు పెదవి, పండునిమ్మ పసిమి, కడలి అలల కురులు, కానరాని నడుము… అని ఆత్రేయ కల్యాణి రాగాన్ని ఓ కన్నెపడుచుగా ఇలాగే కలగంటాడు ఏదో సినిమాలో…! ప్చ్, కష్టమే… ఇదీ అందం అని నిర్ధారించే కొలతలేముంటయ్..? చూసే కళ్లను బట్టి కదా సొగసు..! కావ్యం రాసేవాడి కలల సుందరిని బట్టి కావ్యనాయిక లక్షణాలుంటయ్…
మన నిర్మాతలకు, మన దర్శకులకు, మన వీరోలకు పర్‌ఫెక్ట్ కావ్యనాయికలు మాత్రం దొరకడం లేదు… అన్వేషిస్తూనే ఉన్నారు… ఫాఫం, కొన్నిరోజులు పండునిమ్మ పసిమి పేరిట భ్రమపడి, బొంబాయి భామల్ని ఎత్తుకొచ్చి, అడిగినంతా ఇచ్చి, రంగు తప్ప ఇంకేమీ లేదని తేల్చేసుకుని, మళ్లీ మొహం చూసేవాళ్లు కాదు… పైగా చందమామ మోములూ కావు, చారడేసి కళ్లూ ఉండవు… ఇప్పుడు కడలి అలల కురులెవరు మెయింటెయిన్ చేస్తున్నారు, సో, అవీ లేవు… జీరో సైజు ట్రెండ్ కాబట్టి ‘కానరాని నడుము’ అనే క్వాలిటీ మాత్రం కాస్త దొరకబుల్…
తెలుగు, కన్నడ మొహాలు మనవాళ్లకు పెద్దగా ఆనవు కాబట్టి… ప్రేక్షకులకు కొత్త కొత్త అందాలు చూపిద్దామని తమిళం, మలయాళం నుంచి కొన్నాళ్లు పట్టుకొచ్చారు… అవీ మొహం మొత్తాయి… (మొహాలు మొత్తాయి అనొచ్చా..?) మొన్నామధ్య కాయదు లోహర్ అనే అస్సామీ సొగసును శ్రీవిష్ణు కొత్తగా ఎంచుకున్నాడు… అది మన ఈశాన్య సౌందర్యం… ఐనా సరిపోవడం లేదు… ఇంకా కొత్త మొహాలు కావాలి… ఎలా..?
Ads
కృష్ణా వ్రిందా విహారి సినిమా కోసం నాగశౌర్య ఏకంగా న్యూజిలాండ్ నుంచి సింగర్ షెర్లీని తీసుకొచ్చాడు… అఫ్‌కోర్స్, ఆమె పెరిగింది అక్కడైనా… పుట్టుక మన భారతమే… ఇప్పుడు ధనుష్ ఓ హైబ్రీడ్ విదేశీ పిల్లను మనకు పరిచయం చేస్తున్నాడు… నేనే వస్తున్నా అని ఓ సినిమా వస్తోంది కదా… అందులో ఇందుజ రవిచంద్రన్ అనే హీరోయిన్‌తోపాటు ఈమె కూడా ఉంది… పేరు తెలుసా..? Elisabet Avramidou Granlund … చదవడం కష్టమైపోతోంది కదా… సింపుల్‌గా ఎల్లి ఎవ్రామ్ అని పిలుస్తున్నారు…
గ్రీకు తండ్రి, స్వీడిష్ తల్లి… 2008లోనే ఓ స్వీడిష్ సినిమా చేసింది… తరువాత 2013 ప్రాంతంలోనే ముంబై వచ్చింది… అప్పటి నుంచీ తిప్పలు పడుతూనే ఉంది… రెండుమూడు హిందీ సినిమాలు చేసింది… మస్తు బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది… ప్చ్, పెద్దగా రిజల్ట్ లేదు, తరువాత అందరూ అతిథి పాత్రల్ని చేయించేవాళ్లు…
ఎస్, మన తెలుగులోనూ అలాగే ఓసారి కనిపించింది… నాపేరు సూర్య అని అప్పట్లో ఓ సినిమా వచ్చింది కదా… బన్నీ హీరో… అందులో ఇరగ ఇరగ అంటూ ఓ మసాలా పాట ఉంటుంది… హీరోయిన్ కూడా ఉంది… అందులో ఈ ఎల్లి (తెలుగీకరిస్తే ఎల్లవ్వ…) కూడా ఉందట… గుర్తించడమే కష్టం… మొత్తానికి 2020, 2021లలో ఓ తమిళ సినిమా, ఓ కన్నడ సినిమా చేసింది… పెద్దగా ఎదుగూ బొదుగూ లేని కెరీర్…
కానీ ధనుష్‌కు నచ్చింది… ఇంకేం..? పక్కన హీరోయిన్ అయిపోయింది… నేనే వస్తున్నా అని ధనుష్ చెబుతుంటే… నేనూ వస్తున్నా అంటోందీమె…!! ఈమె గురించి ఇంత పెద్ద కథ అవసరమా అంటారా..? షెర్లీ, ఎల్లీ… ఇంకా విదేశీ, స్వదేశీ హైబ్రీడ్ మొహాలు రాబోతున్నయ్… మన వీరోల టేస్టు మారుతోంది… మరి చెప్పుకోకపోతే ఎలా..?!
Share this Article