నిజానికి కాంగ్రెస్ ముక్తభారత్ అనే టార్గెట్ దిశలో మోడీ, అమిత్ షా చేస్తున్నదెంత..? పిసరంత..! కానీ బీజేపీ లక్ష్యసాధన దిశలో కాంగ్రెసే ఎక్కువ కష్టపడుతోంది… ఒక్కముక్కలో చెప్పాలంటే కాంగ్రెస్ హరాకిరీ చేసుకుంటోంది… రాజస్థాన్ రాజకీయాలు కాంగ్రెస్ దురవస్థను స్పష్టంగా కళ్లముందు ఉంచుతున్నయ్…
సిద్ధూను పైకి లేపీ లేపీ… పంజాబ్లో కాంగ్రెస్ తనే తిరిగి ఇప్పట్లో లేవనంతగా కూరుకుపోయింది… సిద్ధూ జైలుపాలు, ఆ మాజీ సీఎం బీజేపీ పాలు… పంజాబ్ ఖలిస్థానీ శక్తులపాలు… బుజ్జగింపులు, కొనుగోళ్లు, ప్రలోభాలు, బెదిరింపులు, తొక్కివేతలు, కత్తిరింపుల రాజకీయంలో ఒకప్పుడు కాంగ్రెస్ ఫేమస్… ఇప్పుడవేమీ చేతగాక కర్నాటకలో అధికారాన్ని కోల్పోయింది… సీనియర్లే శాపాలని ఏడుస్తూనే, కొత్తతరాన్ని ఎంకరేజ్ చేయలేక, సీనియర్లను వదులుకోలేక మధ్యప్రదేశ్లో అధికారాన్ని వదులుకుంది… జ్యోతిరాదిత్య పార్టీనే విడిచిపెట్టేశాడు…
అస్సాంలో కూడా పతనం స్వయంకృతమే… ఇప్పుడు రాజస్థాన్… చత్తీస్గఢ్లో కూడా లోలోపల లుకలుకలు రాజుకుంటున్నయ్… ఇప్పటికే వేరే నాయకుడికి సీఎం పోస్టు ఇవ్వాలి, జరగలేదు… దేశంలో కాంగ్రెస్ స్వయంగా అధికారంలో ఉన్నదే రెండు రాష్ట్రాల్లో… అవీ సుస్థిరంగా లేవు… ఇప్పుడు చెప్పండి మోడీ, షా ఘనత ఏమైనా ఉందా..? కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకుంటూ బీజేపీకి బలాన్ని సమకూర్చి పెడుతున్నదా..?
Ads
ఎవరు ఔనన్నా, కాదన్నా… ఇప్పటికీ కాంగ్రెస్కు బలం, బలహీనత నెహ్రూ కుటుంబమే… అదే హైకమాండ్… నెహ్రూ, ఇందిర, రాజీవ్, సోనియా ఏది చెబితే అదే ఫైనల్… ఆ భయమే కాస్తోకూస్తో క్రమశిక్షణకు ఆధారం… అసలే కాంగ్రెస్ నాయకులు, వాళ్లను కట్టడిలో ఉంచగలిగినంతసేపే కాంగ్రెస్ మనుగడ… ఇప్పుడు అదే ప్రమాదంలో పడింది…
ఇన్నాళ్లూ కాంగ్రెస్ కన్నెర్ర చేస్తే, నాయకులకు వేరే దిక్కు లేకుండా పోయేది… మమత, జగన్ వంటి ఒకరిద్దరే సొంత పార్టీలు పెట్టుకుని సక్సెస్ అయ్యారు… కానీ సొంత దుకాణాలు అంత సులభం కాదు, అందుకని హైకమాండ్ చెప్పినట్టు వినేవాళ్లు… కానీ ఇప్పుడు అలా కాదు… హైకమాండ్ ఏం చేయగలదు..? ధిక్కరించి చూపిస్తాం, ఏం చేస్తుందో చేయనీ, సొంతంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చేంత సీన్ ఎలాగూ లేదు… మేం లేకపోతే హైకమాండ్ లేదు, ఏ కమాండూ లేదు అనే ధోరణి నాయకుల్లో పెరిగిపోయింది… గెహ్లాట్ రాజకీయం చెబుతున్న నిజం అదే…
92 మంది ఎమ్మెల్యేలు హైకమాండ్ సూచనల్ని, ఆలోచనల్ని తుంగలో తొక్కేస్తే… హైకమాండ్ ఏం చేయగలుగుతోంది… ఎవరినీ కత్తిరించే సీన్ లేదు, చివరకు ఇద్దరో ముగ్గురో ఎమ్మెల్యేలను బకరాల్ని చేసి, తూతూమంత్రంగా సమస్యను చక్కదిద్ది… గెహ్లాట్ ఎదుట హైకమాండే సాగిలబడిన దృశ్యం కనిపిస్తోంది… ఇది రాబోయే రోజుల్లో మరిన్ని అనర్థాలకు సూచిక… ఏ భయం, ఏ క్రమశిక్షణ కాంగ్రెస్ను ఇన్నాళ్లు నిలిపి ఉంచిందో అదే ఇప్పుడు కనిపించకుండా పోతోంది…
భారత్ జోడోయాత్రతో ఒరిగేదేం ఉంటుంది అనే చర్చ మొదలైంది ఇప్పుడు… నిజానికి రాహుల్కు ఏమాత్రం రాజకీయ జ్ఞానం ఉన్నా సరే, జోడో యాత్ర తలపెట్టకపోయేవాడు… ప్రతి రాష్ట్రంలో మూడునాలుగు రోజులు అడ్డా వేసి, పార్టీ అంతర్గత సమస్యల్ని సమీక్షించి, దిద్దుబాట్లు తలపెట్టి, ఎక్కడికక్కడ లూప్ హోల్స్ మూసేస్తూ, చికిత్స ప్రయత్నం జరగాల్సి ఉంది… రాష్ట్రాలవారీగా బీజేపీని కౌంటర్ చేయగల భిన్నమైన ఎత్తుగడల్ని ఆలోచించాల్సి ఉంది…
ప్రాంతీయ, స్వార్థ, అవినీతి శక్తులు బలపడితే అది దేశానికే అరిష్టం… నిష్ఠురంగా ఉన్నా అదే నిజం… అదేసమయంలో బీజేపీకి సరైన ప్రతిపక్షం లేకపోయినా దేశానికే నష్టం… ఆ దిశలో కాంగ్రెస్ లేదు… కారకుడు రాహుల్, కారణం రాహుల్ అసమర్థత… నాకు నాయకత్వం వద్దు అంటాడు, కానీ వదలడు, తనే యాత్ర చేస్తాడు, తనే హైకమాండ్లా నిర్ణయాలు తీసేసుకుంటాడు…రుద్దుతాడు…
ప్రియాంకను కూడా రానివ్వడు.., ఆమె నాయకత్వ లక్షణాలూ అంతంతమాత్రమే అని యూపీ ఎన్నికలు స్పష్టంగా తేల్చేశాయి… రాహుల్ మరోవైపు సీనియర్లను పార్టీకి శాపాలుగా చూస్తాడు, కానీ కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయలేడు… హఠాత్తుగా కొన్నాళ్లు మాయమైపోతాడు, దేశంలోనే ఉండడు… అంతా అయోమయం, గందరగోళం… స్థూలంగా చెప్పాలంటే నెహ్రూ కుటుంబం సమర్థ పెత్తనం లేకపోతే పార్టీ ఇచ్చుకుపోతుంది… కానీ ఆ కుటుంబ వారసుడు రాహుల్లో లోపించిందే ఆ సమర్థ నాయకత్వం… మరిక కాంగ్రెస్కు దిక్కు..?!
Share this Article