రెండున్నరేళ్ల క్రితం ఆయన ప్రియసతి విజయనిర్మల వెళ్లిపోయింది… మొన్నటి జనవరిలో పెద్ద కొడుకు రమేశ్ బాబు వెళ్లిపోయాడు… ఇప్పుడు సంప్రదాయసతి ఇందిర కూడా ఆయన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది… ఎనభయ్యేళ్ల వయస్సులో హీరో కృష్ణ చుట్టూ మరింత ఒంటరితనం ఇప్పుడు… కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉంటున్నా సరే, ఇన్నాళ్లూ ఆమె ఉనికి కృష్ణను మానసికంగా స్థిమితంగా ఉంచేది, ఇప్పుడు ఆమె కూడా కృష్ణకు వీడ్కోలు చెప్పి వెళ్లిపోయింది…
ఇందిరకు చిన్న వయస్సులోనే కృష్ణతో పెళ్లిచేశారు… సొంత మామకూతురే… పెళ్లయిన నాలుగేళ్లకే విజయనిర్మల మాయలో పడి, కృష్ణ ఆమెను పెళ్లిచేసుకున్నాడు… ఆమెకు అప్పటికే పెళ్లయి, ఒక కొడుకు కూడా… ఐనాసరే, ఇందిర మౌనంగానే భరించింది… అదేకాదు, కృష్ణతో ఎప్పటిలాగే వ్యవహరించింది… అయిదుగురు పిల్లలు… పాత సంబంధంతో పుట్టిన నరేష్ తప్ప, కృష్ణతో మాత్రం విజయనిర్మలకు పిల్లలెవరూ కలగలేదు… ఆమే వద్దని అనుకుందో, దేవుడే ఇవ్వలేదో తెలియదు…
కృష్ణకు పెద్ద భార్యగా కష్టనష్టాల్లో, గెలుపోటముల్లో, సమస్యల్లో, సంతోషాల్లో ఓ సంప్రదాయిక సతిగా గుంభనంగానే ఉండిపోయింది… విజయనిర్మల పట్ల మనసులో ఏ భావన ఉన్నా సరే, ద్వేషించలేదు, దూషించలేదు, బయటపడి రచ్చ కూడా చేయలేదు… ప్రయోజనం లేదని అనుకుందా..? బావ మీద ప్రేమ నోరుమూసిందా తెలియదు… అంతేకాదు, తన పిల్లలు అప్పుడప్పుడూ విజయనిర్మల ఇంటికి వెళ్లి రావడాన్ని కూడా ఆమె వ్యతిరేకించలేదు… అడ్డుపడలేదు… కూతురు మంజుల పెళ్లి సమయంలో కూడా విజయనిర్మలకే ఎక్కువ బాధ్యతలు ఇచ్చింది ఇందిర… ఆ విజయనిర్మల మరణానంతరం ఇక కృష్ణ, ఇందిరలు ఈ వృద్ధాప్యంలో ఒకరికొకరుగా మిగిలిపోయారు…
Ads
ఎక్కువగా ఆమె వివరాలేమీ బయటికి వచ్చేవి కావు… ఆమెపై తల్లి ప్రభావం కాస్త ఎక్కువ… అసలే అనారోగ్యం, ఈమధ్య కొడుకు మరణంతో ఆమె బాగా కుంగిపోయింది… పైగా వయోభారం సరేసరి… ఆమె వయస్సు 70 ఏళ్లు… ఇవన్నీ ఆమెను కుంగదీసినట్టున్నాయి… ఈరోజు ఆమె తన నివాసంలోనే కన్నుమూసింది…
ఆమెకు అయిదుగురు పిల్లలు… రమేశ్ బాబు ఈ సంవత్సరం మొదట్లో అనారోగ్య కారణాలతో మరణించాడు… మరో కొడుకు మహేశ్ బాబు… ఆడపిల్లలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని… ఒక అల్లుడు గల్లా జయదేవ్… ప్రముఖ ఇండస్ట్రియలిస్టు, పొలిటికల్ ఫ్యామిలీ… మరో అల్లుడు ఇండస్ట్రీలోనే హీరోగా ఉన్నాడు… ఆమె జీవితం మనకు చెప్పేదేమిటి..? ‘‘అడ్డస్ట్మెంట్’’… పరిస్థితులతో, మనుషులతో, కాలంతో, విధితో… వచ్చింది స్వీకరించింది… అంతే…
నిజానికి అందరూ హీరో మహేశ్ బాబుకు మాతృవియోగం అని రాస్తున్నారు గానీ… హీరో కృష్ణకు సతీవియోగం అనేదే వార్త… ఈ వయస్సులో ఆయనకు ఇందిర మరణం ఓ దెబ్బే… తన జీవితాంతమూ ఏ పరిస్థితుల్లోనైనా సరే, తన వెనుక నిశ్శబ్దంగా నిలబడిన నీడ ఆమె… ఆ నీడ కూడా నిష్క్రమించింది… అసలే చిన్న భార్య, పెద్ద కొడుకు మరణాలతో మానసికంగా కుంగిన కృష్ణకు పెద్దభార్య ఇందిర హఠాన్మరణం దుర్భరమే..!!
Share this Article