न मत्रं नो यन्त्रं तदपि च न जाने स्तुतिमहो
न चाह्वानं ध्यानं तदपि च न जाने स्तुतिकथाः ।
न जाने मुद्रास्ते तदपि च न जाने विलपनं
परं जाने मातस्त्वदनुसरणं क्लेशहरणम्
(అంటే, రఫ్‌గా… నాకు మంత్రం తెలియదు, నాకు యంత్రం కూడా తెలియదు… నిన్నెలా పిలవాలో తెలియదు… నిన్నెలా పొగడాలో కూడా తెలియదు… నాకు భంగిమలు తెలియవు, విలపనం తెలియదు… కానీ తల్లీ, నిన్నే అనుసరించి నా బాధల్ని తొలగించుకోవడం మాత్రం తెలుసు… దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం ఇది… )
ఇందులో ఎన్ని ‘న’లు ఉన్నాయో చదివారుగా… ప్రతి దానికీ ‘లేకపోవడం’ అనే అర్థం… న భూతో న భవిష్యత్తు అనే పదాలయితే అందరికీ తెలిసినవే కదా… భూతకాలం అంటే గతం లేనిదే భవిష్యత్తు లేదు… ఇలా ఎన్నెన్నో ఉదాహరణలు దొరుకుతయ్… న అక్షరమే నకారాత్మకం… ఇవన్నీ ప్రఖ్యాత యాంకరిణి, ప్రముఖ నటి, మేడం శ్రీమతి అనసూయ భరధ్వాజ్ గారికి తెలియాలని ఏమీ లేదు… అప్పుడెప్పుడో ఏదో సందర్భంలో తనది బ్రాహ్మణ జన్మ అని చెప్పినట్టు గుర్తు… సో వాట్..? ఐనా తెలియాలని ఏముంది..?
Ads
ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఆమె నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ‘నవస్త్ర’ అనే ఓ ప్రోగ్రాం చేస్తోంది… తన చానెల్ కోసమే… ఫస్ట్ ఎపిసోడ్‌లో చెబుతోంది ఇలా… ‘‘గతంలో సరదాగా చేశాం, బాగా రెస్పాన్స్ వచ్చింది, మళ్లీ చేయవచ్చుగా అని అడుగుతున్నారు… అందుకే మళ్లీ చేస్తున్నా…’’ అంటోంది… నవరాత్రి ఉత్సవాలు కదా… తొమ్మిది రోజులూ రోజుకొక డ్రెస్ ఎంపిక చేసి, ధరించి, ఏవో మేకప్పులు, డ్రెస్సులు, ఇతరత్రా ముచ్చట్లు చెబుతుంది… అంతే… నవ అంటే తొమ్మిది, వస్త్ర అంటే బట్టలు… సో, నవ ప్లస్ వస్త్ర… నవస్త్ర… ఆమెకు తెలిసింది అంతే… కాదంటే తంటాలే… ఈసారి ఏజ్ షేమింగ్ పదంలాగే లాంగ్వేజీ షేమింగ్ అనే కొత్త పదం కనిపెట్టి మరీ రచ్చ చేస్తుందేమో…
లక్షల మంది సోషల్ మీడియా ఫాలోయర్స్ ఉన్న ఆమెకు సంబంధించి ఏ వీడియో ఐనా సరే లక్షల్లో చూస్తారు నెటిజనం… ఆమె గ్లామర్ అలాంటిది… కానీ ఈ ఫస్ట్ ఎపిసోడ్‌కు రెండు రోజుల్లో వచ్చిన వ్యూస్ 80 వేలు (ఈ కథనం రాసే సమయానికి…) అంటే నేనేది వదిలినా జనం చూస్తారు అనే భ్రమలు ఏమైనా ఉంటే, ప్రేక్షకులు పాదఘట్టం తరహాలో భగ్నం చేశారనే అనుకోవచ్చునన్నమాట… నిజానికి ఒక పదాన్ని జనంలోకి వదిలేముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి… ఆ సోయి లేకపోవడమే ఇది…
డౌటొచ్చి… న వస్త్ర అంటే అర్థమేమిటి గూగులమ్మా అని హిందీలో అడిగితే… బట్టల్లేకపోవడం అని అర్థం కనిపించింది… అన్ని భాషలకూ తల్లి వంటి సంస్కృతంలో అడిగినా అదే జవాబు వచ్చింది… అసలు నవస్త్ర అనే పదానికి అర్థమేమిటో ప్రఖ్యాత యువ యాంకరిణి, ప్రముఖ యువ నటి, మేడం శ్రీమతి అనసూయ భరధ్వాజ్ గారికి తెలిసినట్టు లేదు… బట్టల మీద స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తూ, బట్టల్లేకపోవడం అనే అర్థమొచ్చే పదాన్ని టైటిల్‌గా పెట్టుకుందన్నమాట… వావ్…
నిజానికి నవాస్త్ర అని గనుక పెట్టి ఉంటే కాస్త నయంగా ఉండేది… నవ అంటే తొమ్మిది, నవ అంటే కొత్త, అస్త్ర అంటే వదిలే ప్రోగ్రామ్ అయి ఉండేది… న వాస్త్ర అంటే వేరే దురర్థమో, అనర్థమో, అపార్థమో కూడా ఉండేది కాదు… ఇన్నాళ్లూ మహాభారతం ఎప్పుడు చదివినా వివస్త్ర, ఏకవస్త్ర పదాలు కనిపించేవి… వివస్త్రను చేయడం అంటే బట్టల్ని తొలగించడం… ఏకవస్త్ర అంటే రుతుస్రావ కాలంలో ఒకే వస్త్రాన్ని ధరించి ఉండేవాళ్లు అప్పట్లో… అందుకని ఏకవస్త్ర అనేవాళ్లు… మరి ఈ నవస్త్ర హేమిటో… అది యూట్యూబ్ కదా, పైగా ప్రఖ్యాత యువ యాంకరిణి, ప్రముఖ యువ నటి, మేడం శ్రీమతి అనసూయ భరధ్వాజ్ గారి ప్రోగ్రాం కదా… సబ్ కుచ్ చల్తా…
ఫస్ట్ ఎపిసోడ్ ఆరంభంలోనే ఓ పొట్టి నిక్కరు, ఓ లూజ్ టాప్‌తో దర్శనిచ్చింది ఆమె… ఇలాంటి పొట్టి బట్టధారణను ఏ ‘వస్త్ర’ అంటారో తెలియదు గానీ… అన్నట్టు, ఈ నవరాత్రి ఉత్సవాలు సరే, దాండియాలు సరే, కొత్త బట్టలు సరే, ఈ ముచ్చట్లు సరే గానీ… తెలంగాణవ్యాప్తంగా మహిళలు ఈ తొమ్మిది రోజులూ బతుకమ్మ పండుగ చేసుకుంటారు… ఏమైనా ఐడియా ఉందా తల్లీ నీకు..? అది తెలంగాణ సాంస్కృతిక సూచిక… కొత్త బట్టలు, కొత్త నగలే కాదు, ఈ పండుగలో బతుకు బాధల కలబోత కూడా ఉంటుంది… ఐనా మేడమ్ శ్రీమతి అనసూయ భరధ్వాజ్ గారూ… మీకు తెలిసి ఉంటుందని అనుకోవడమే మా ‘నజ్ఞాన’..!!
Share this Article