ఫాఫం నాగార్జున… తనకు కూడా బిగ్‌బాస్ మీద ఇంట్రస్టు కొడిగట్టినట్టుంది… మరేం చేస్తాడు..? పరమ పేలవమైన ఆటతీరు కనబరిచే కంటెస్టెంట్లు… బిగ్‌బాస్ టీం మొద్దు నిద్ర… అసలు బిగ్‌బాస్ షోలో వీకెండ్స్ షోలే అట్రాక్షన్… కానీ ఈరోజు ఏం జరిగింది..? నాగార్జునకు చిరాకు ఎక్కువైనట్టుంది… మామూలుగా గంటన్నర ఉండే షోను పావుగంట ముందే ముగించి, దండం పెట్టేశాడు… ఈ నిర్లిప్తత హైకోర్టులో కేసు పడినందుకు కాదు, కోర్టు కొన్ని పరుషమైన వ్యాఖ్యలు చేసినందుకు కాదు, అసలు ఆట తీరే ఈసారి దారుణంగా తయారైంది…
ఎంత ఘోరం అంటే… ఒక ఆట అప్పగిస్తే కంటెస్టెంట్లకు ఎవరికీ ఆ ఆట ఎలా ఆడాలో అర్థం కాలేదు… గంటంబావు వీకెండ్ షోలో ఒక్క హోటల్ టాస్క్ మీద గంటసేపు క్లాస్ పీకాల్సి వచ్చింది నాగార్జునకు… అదీ ఈసారి కంటెస్టెంట్ల ఆటతీరు… నిజానికి ఒక్క గీతు మాత్రమే కాస్త బెటర్ పర్‌ఫామెన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది… ఆమె లేకపోతే ఈసారి సీజన్ శుద్ధ దండుగ…
వీకెండ్ షో ఎంత పేలవంగా నడిచిందీ అంటే… కాదు, ఎంత చెత్తాగా సాగిందీ అంటే… గోల్ గప్పా, పానీపూరీ ఎపిసోడ్… ఇక్కడ చంటి గురించి చెప్పుకోవాలి… అసలే చెత్త ఆట… ఏ యాక్టివిటీ ఉండదు… కామెడీ లేదు… చివరకు బిగ్‌బాస్ టీం సీక్రెట్ టాస్క్ అప్పగిస్తే అదీ చేయలేదు, చేయాలనే మినిమం ఆసక్తిని కూడా కనబర్చలేదు… అసలు హౌజులోకి ఎందుకొచ్చాడో తెలియదు… ఇంకా ఘోరం ఏమిటంటే..? బిగ్‌బాస్ టీం పెట్టిన టాక్సిక్, సోమరిపోతు ఎట్సెట్రా కేటగిరీలో ట్రాష్…
Ads
చంటి కసిగా గీతకు అడ్డగోలుగా ఉప్పు పెట్టి పానీ పూరీ ఇస్తే, ఆమె చాలాసేపు తల్లడిల్లిపోయింది… వాష్ బేసిన్ దగ్గరకు పరుగెత్తిపోయి, చాలాసేపు నీళ్లు తాగుతూ అవస్థపడింది… ఇక్కడ బిగ్‌బాస్ టీం ఎంత దరిద్రంగా ప్లాన్ చేసిందో, చంటి అంతకుమించి దరిద్రాన్ని కనబరిచాడు… సీజన్ మొత్తానికి కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొనకుండా నిషేధానికి గురయ్యాడు…
అసలు ఆ టాస్కుల్లోనే కాదు, చంటి హౌజులో ఉండటమే వేస్ట్ అన్నట్టుగా మారింది… అదే జబర్దస్త్ నుంచి వచ్చిన ఫైమా గొప్పగా ఆడకపోయినా కాస్త బెటరే… వీకెండ్ షో ఎంత వీక్ అంటే… రేవంత్‌కు సీమంతం అని గీతూ ప్రపోజ్ చేసింది… కాబోయే తల్లికి సరే, తండ్రికి సీమంతం దేనికి అనే ప్రశ్నకు బాలాదిత్య చాలా మెచ్యూర్డ్, కన్విన్సింగ్ సమాధానం ఇచ్చాడు… తీరా చూస్తే అదేమీ షోలో నిర్వహించలేదు…
పదే పదే ఆరోహి, ఆర్జే సూర్య నడుమ ఏదో లవ్ ముదిరిపోయినట్టుగా నాగార్జునతో ఫోటోలు చూపించి, పదే పదే అనిపించి, ఏదో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది బిగ్‌బాస్ టీం… కానీ ఆరోహికి, సూర్యకు నచ్చలేదు… బిగ్‌బాస్ టీంతో ఏదో గొడవ జరిగినట్టుంది… చివరకు ఆ టీం తలొంచుకుని, మరో కోణంలో వాళ్లిద్దరి నడుమ ఏ ట్రాక్ లేనట్టు చెప్పుకోవాల్సి వచ్చింది… ఎలా అంటే నందుకు బుజ్జమ్మ అని ఆల్రెడీ బయట ఓ సన్నిహితురాలు ఉన్నట్టు, తనకు నందు అని మరో కేరక్టర్‌తో లవ్ ఉన్నట్టు అదే ఆరోహితో చెప్పించారు…
ఇంకొక లవ్ ట్రాక్ శ్రీసత్య, అర్జున్ నడుమ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏదో పిచ్చి ప్రయత్నం చేస్తున్నా సరే… శ్రీసత్యతో అదంత వీజీ కాదు, సో, అదీ వర్కవుట్ కావడం లేదు… వెరసి ఈసారి చప్పగా మారిపోయింది షో… అసలు ఇది కాదు చెప్పుకోవాల్సింది… ప్రేక్షకులు ఈసారి బిగ్‌బాస్ షో చూడటానికి ఇష్టపడటం లేదు…
గత వారం బార్క్ రేటింగ్స్ చూస్తే మరింతగా ప్రేక్షకాదరణ దిగజారిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది… మరీ చిల్లర, సాదాసీదా రియాలిటీ షోలు కూడా ఇంత దరిద్రంగా రేటింగ్స్ సాధించడం లేదు… సండే వీకెండ్ షో మరీ 4.42 రేటింగ్స్ సాధించగా, శనివారం షో 4.36 రేటింగ్స్… ఇక వీక్ డేస్‌లో చూస్తే… మంగళవారం 2.38, సోమవారం 2.33, బుధవారం 2.22, గురువారం 2.06, శుక్రవారం 2.02 రేటింగ్స్… కనిపిస్తోంది కదా బిగ్‌బాస్ ఈసారి సీజన్ ఎంత ఘోరంగా సాగుతున్నదో… ఈ రేటింగ్సే చెబుతున్నాయి కదా షో ఎంత నాసిరకంగా నడుస్తున్నదో…!!
Share this Article