బతుకమ్మను పేర్చే శిబ్బిలు మాత్రమే కాదు… కీలకంగా భావించే తంగేడు దొరుకుత లేదు… గునుగు పూవు బంగారం అయిపోయింది… గడ్డిపూవుకు రంగులు అద్దడం, అందంగా పేర్చడం, పరులకంటే పెద్ద బతుకమ్మ కావాలని పోటీలుపడటం గతం… వీలుంటే ఓ కాగితపు బతుకమ్మ కొనడం, లేదంటే మార్కెట్‌లో దొరికే బంతిపూలతో మమ అనిపించడం…
కొత్త తరానికి పెద్దగా ఈ పండుగ మీదే పెద్దగా ఇంట్రస్టు లేదు… చివరిరోజు సద్దుల బతుకమ్మకు మాత్రం కాస్త హడావుడి కనిపిస్తోంది… తెలంగాణ వచ్చాక బతుకమ్మ మీద వివక్ష, ఇతర ప్రాంతీయుల వెక్కిరింపులు తగ్గాయి, అది పక్కా నిజం… సో, బతుకమ్మ పేర్చడం, ఆడటం, నిమజ్జనం చేయడం మాటెలా ఉన్నా… పండుగ కదా, తిండి గురించి మాట్లాడుకుందాం…
సద్దుల బతుకమ్మ పేరులోనే ఉంది ఆహారవిశేషం… అంటే రకరకాల సద్దులు… అవి ఏ సద్దులు..? ఎన్ని సద్దులు..? అని ఎవరూ చెప్పరు… ఎవరిష్టం వాళ్లది… ఎవరి ఓపిక వాళ్లది… ఇన్నిరకాలు అని నిర్దేశించబడి ఉండదు… కాకపోతే ఎక్కువ వెరయిటీలు చేసుకుంటే అదొక ఆనందం… సంక్రాంతి రోజున రకరకాల ముద్దలు చేయడమే ఈరోజుల్లో ఎవరికీ చేతకావడం లేదు… పల్లిలు, పుట్నాలు, నువ్వులు, పేలాల ముద్దలు… గతంలో ఇవి ఎక్కువ సంఖ్యలో చేసుకుని, రోజుల తరబడీ చిరుతిళ్లుగా తినేవాళ్లు… ఇప్పుడంతగా సకినాలు చేసుకోవడం లేదు… ముద్దల మాటే మరిచిపోయారు చాలామంది…
Ads
దొరికితే మామిడికాయ గుజ్జుతో చేసుకునే మామిడి సద్దిని మించింది లేదు… కానీ ఇప్పుడు దొరకదు… సాధ్యం కాదు, ఒరుగును గుజ్జు చేసి, సద్ది చేసుకుంటే బాగుండదు, ఆ రుచే రాదు… నిజానికి సద్దుల్లో, అనగా పులిహోరల్లో పులుపు ప్రధానంగా… కానీ బతుకమ్మ సద్దుల్లో ఆ సూత్రమేమీ పెద్దగా పట్టింపుకు రాదు… రకరకాల ఫ్లేవర్లు ముఖ్యం… సద్ది అంటే మళ్లీ అది తినేటప్పుడు ఆధరువు ఏమీ అవసరం లేకుండా ఉండాలి… నేరుగా కడుపులోకి చేరవేయడమే…
అందరూ సాధారణంగా చేసేది చింతపండు సద్ది… దీన్నే పులుసు సద్ది అంటారు… తేలిక… పనిలోపనిగా చింతపండుతో కాస్త ఎక్కువ పులుసు చేసిపెట్టుకుంటే, మిగతా రోజుల్లో కూడా ఎప్పుడంటే అప్పుడు పులిహోర చేసేసుకోవచ్చు… నువ్వుల సద్ది, కొబ్బరి సద్ది, పుట్నాల సద్ది కూడా చాలా మంది చేసుకుంటారు… ఎలాగూ ఈరోజుల్లో ఇళ్లల్లో నిమ్మరసం తీసిపెట్టుకుంటున్నారు… సో, నిమ్మ పులిహోర, అనగా నిమ్మ సద్దిని జాబితాలో యాడ్ చేసుకోవచ్చు… రుచికి రుచి, శ్రేష్టమైన సీ విటమిన్ కూడా…
ఈమధ్య కొందరు వెరయిటీగా మెంతి సద్ది, కరివేపాకు సద్ది, కొత్తిమీర సద్ది చేస్తున్నారు… అబ్బే, అవి మాకెందుకు అంటారా..? గుడ్… పెరుగు సద్ది, అనగా దధ్యోదనం, అనగా కర్డ్ రైస్ మాత్రం బాగా చేసుకొండి… రుచికిరుచి కూడా… కొందరు పాతతరం వాళ్లు ఉన్న ఇళ్లల్లో కాస్త జాగ్రత్తగా గసగసాల సద్ది చేస్తారు… పెరుగు సద్దికి ముందు ఇది తిన్నాక ఇక కాసేపు నిద్ర తప్పనిసరి… గసగసాల కడుపులోకి వెళ్తే అంతే కదా మరి… ఇప్పుడు చాలా కిచెన్లలో గసగసాలే కనిపించడం లేదు… గతంలో అరిశెల మీద కూడా గసగసాల్నే అద్దేవాళ్లు… ఇప్పుడు వాటిని నువ్వులు రీప్లేస్ చేశాయి…
ఈ సద్దులతోపాటు మల్లీద తెలుసు కదా… వరిపిండి రొట్టె (ఒట్టి రొట్టె) ఎలాగూ చేస్తారు… వేడిగా ఉన్నప్పుడే ముక్కలు చేసి, చక్కెర కలిపి, ముద్దలు కట్టడమే… మల్లీద లేకుండా సద్దుల బతుకమ్మ లేదు… చాలా చోట్ల సద్దుల బతుకమ్మ నిమజ్జనం సమయంలో ఇదే ఒకరికొకరు పంచుకుంటారు… పలుచోట్ల నాలుగైదు రకాల సత్తుపిండిని నైవేద్యంగా పరిగణిస్తారు…
రోజంతా ఈ బతుకమ్మ ఏర్పాట్లతోనే అలిసిపోయారా..? సద్దుల బతుకమ్మను పంపించేసి వచ్చాక, కాస్త గసగసాల సద్దిని ఎక్కువగా తీసుకుని, మిగిలిన మల్లీదను ఖతం చేసేసి నడుం వాల్చండి… సుఖనిద్ర ఖాయం…!! మళ్లీ దసరాకు హంగామా వేరు కదా… దానికి ఓపిక కావాలి కదా మరి..!! అసలే దసరా రోజు జమ్మి పెట్టి, పలకరించడానికి ఇంటికి వచ్చీపోయే అతిథులు ఎక్కువ… ఏమైనా ముక్క, సుక్క మర్యాద చేయకపోతే ఎలా మరి…!!
Share this Article