ఏళ్ల తరబడీ… తెలుగు సినిమా పాటలో, ఆటలో, కథలో, కథనంలో, ఆత్మలో… అన్నింటా ఆంధ్రా ఆధిపత్యమే… తెలంగాణ మీద వెక్కిరింతలు..! ఇవి ఆంధ్రా సినిమాలు తప్ప మన సినిమాలు కావులే అనే ఓ నిర్లిప్తత తెలంగాణ ప్రేక్షకుల్లో ఉండేది… వేరే దిక్కులేక ఆ సినిమాలే చూస్తూ, అదే మహద్భాగ్యం అనుకునేవాడు… ఇండస్ట్రీలోని చాలామంది తెలంగాణవాళ్లు కూడా తమ ప్రాంతీయతను చెప్పుకునేవాళ్లు కాదు… తరువాత ఒక్కసారిగా తెలంగాణ పాట, మాట, ఆట, పాత్రకు క్రేజ్ ఎక్కువైంది…
సుద్దాల, చంద్రబోస్ తదితరుల్లో తెలంగాణతనం చాన్నాళ్ల క్రితమే సచ్చిపోయింది… కొత్త జానపద కళాకారులను వెతికారు… సారంగదరియా వంటి పాత పాపులర్ గీతాలను హైజాక్ చేశారు… డైలాగ్ రచయితలు, లిరిసిస్టులు కూడా ‘‘ప్రతి వాక్యం చివర పెట్టిండు, పోయిండు అని రాస్తే చాలు, గట్ల, గిట్ల, గిసుంటి అని మొదలుపెడితే చాలు’’ అనే భ్రమల్లోనే ఉండిపోయి అత్యంత కృతకమైన తెలంగాణ భాషను రుద్దడం స్టార్ట్ చేశారు… ఇది మరీ ద్రోహం…
మరీ మొన్న ఏదో పాటలో చంద్రబోస్ పువ్వులోన విషముంటది అనే ఓ వెర్రితనాన్ని చూపించాడు… ఇంకా తన నుంచి ఆశించడానికి ఏముంది..? ఈనేపథ్యంలో ప్రిజుడీస్‌గా ఓరకమైన తేలికభావంతో వినడం స్టార్ట్ చేసిన ఓ పాట భలే కనెక్టయింది… అందులో తెలంగాణతనం ఉంది… తెలంగాణ ఆత్మ ఉంది… అచ్చమైన తెలంగాణ పదాలు పడ్డయ్… బాంచెత్ అనే పదం పదే పదే వాడటం నచ్చలేదు… అలాగే దమ్మడ దమ్మడ డప్పు కొడుతూ పోయాడు తప్ప సంగీత దర్శకుడు కాస్త మంచి జోరుగా ఉంటే ట్యూన్ కట్టి ఉంటే… ఈ పాట ఎక్కడికో పోయి ఉండేదేమో… అంటే, ఇప్పుడు హిట్ కాదని కాదు అర్థం…
Ads
నానిని ఒక విషయంలో మెచ్చుకోవాలి… ఏదైనా స్పెసిఫిక్ ఏరియాకు సంబంధించిన పాత్ర వేస్తే… ఆ మాండలికాన్ని ప్రాక్టీస్ చేస్తాడు… దసరా సినిమా కూడా అంతే… రస్టిక్ రఫ్ లుక్‌తో కనిపిస్తూ, సిల్క్ స్మిత పేరున్న బారు దగ్గర గంతులేస్తున్నాడు… ఆ సందర్భంగా ఈ పాట… కొన్ని పదాలు బాగా పడ్డయ్… ఉదాహరణకు ‘‘ఉంటే వైకుంఠం, లేకుంటే ఊకుంటం’’… ఎస్, సగటు తెలంగాణవాసి అట్లనే ఉంటడు… ఉంటే దసరా, లేకపోతే శివరాత్రి… మరీ అవసరమైతే గుంజుకుంటం, తింటం, పంటం… అంటే తింటాం, పడుకుంటాం అని….
బద్దలు బాషింగాలు అయితయ్… ఇదీ కాస్త ఎక్కువగా వినిపించేదే… చీరి చింతకు కడతం తరహాలో… పవ్వగొట్టు, బోటి కూర దానంచుకు పెట్టు… హహహ… బోటి కూర తెలంగాణ డిష్… దాన్ని అంచుకు పెట్టుకోవడం, అంటే నంజుకు తినడం అల్టిమేట్ ఎక్స్‌ప్రెషన్… సిల్కు గజ్జల గుర్రం అట, బ్యాండ్ కొడితే వాడకట్టు మొత్తం లేచి ఊగాలట… ఓచోట కంట్రోల్ బియ్యం, నల్లీబొక్కలు అంటాడు రచయిత… ఎన్నాళ్లయిందో ఈ పదాలు విని… రేషన్ బియ్యాన్ని కంట్రోల్ బియ్యం అంటాం… మందు పాటలు బొచ్చెడు విన్నాం… ఇది బొగ్గుబతుకుల 90 పాట… డిఫరెంట్ పాట…
ఈ హుషారైన పాటలోకి హఠాత్తుగా కనకవ్వ వచ్చేసి… చిత్తూ చిత్తూల బొమ్మ అని ఓ బతుకమ్మ పాటను అందుకుంటుంది… బాగుంది… నల్లీ బొక్కల్ చూస్తే ఉషారు, ఏం తింటవ్‌ర ఉప్పులేని పప్పుశారు… గోశిగొంగడి మా కట్టుబొట్టు… ఇవన్నీ ఓ నిఖార్సయిన తెలంగాణ పల్లె పదాలు… తెలంగాణ ఆహారం, తెలంగాణ ఆహార్యం సరిగ్గా ప్రదర్శించబడనిదే అది తెలంగాణ పాట ఎలా అవుతుంది..? కాదు… సో, ఈ పాట నాని వైవిధ్యత ప్రేమకు ఒక ఉదాహరణ… కమర్షియల్ గా ఇది నానికి ఓ హిట్ గీతాన్ని కూడా ఇచ్చినట్టే…!!
Share this Article