నవ్వొచ్చింది… బాహుబలి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోదరుడు ఎస్ఎస్ కాంచి శివశ్రీ చేసిన ట్వీట్ అది… (అఫిషియల్ ట్విట్టర్ ఖాతా అన్నట్టుగా ధ్రువీకరణ లేదు…) అందులో ఏమంటాడంటే..? 1) పౌరాణికం తీస్తే తెలుగోడే తీయాలి… ఇదీ ట్వీట్… అంటే ఆదిపురుష్ మీద సెటైర్, ఒపీనియన్ అన్నమాట… తెలుగువాడు అంత గొప్పగా తీశాడా..? ఎవరు సూత్రీకరించారు..? ఏళ్ల క్రితం నార్త్ ఇండస్ట్రీ టీవీలో రామాయణం, మహాభారతం ప్రసారం చేస్తే కోట్ల మంది టీవీలకు అతుక్కుపోయారు… అంత దరిద్రంగా ఏమీలేవు ఆ సీరియల్స్…
నిజానికి తెలుగువాళ్లే పౌరాణికాల్ని పలు అంశాల్లో భ్రష్టుపట్టించలేదా..? అందరూ తెగమెచ్చేసుకునే సీనియర్ ఎన్టీయర్ విలన్ పాత్రల కేరక్టరైజేషనే మార్చేశాడు కదా… ఆహారం, ఆహార్యం కూడా సరిగ్గా ఉండేవి కావు… ఆయనకు కర్ణుడు, దుర్యోధనుడు, కీచకుడు, రావణుడు ఎట్సెట్రా ఎవరైనా సరే హీరోలే… అదేదో సినిమాలో ‘‘చిత్రం భళారే విచిత్రం’’ అంటూ ఓ రొమాంటిక్ సాంగ్ కూడా పెట్టాడు దుర్యోధనుడికి… అప్పుడు కూడా అయిదున్నర కిలోల కిరీటం, ఓ క్వింటాల్ బరువున్న ఆభరణాలు ఉంటాయి ఆమెతో పాడేస్తుంటే… అంతెందుకు, బాపు బాలయ్యతో తీసిన శ్రీరామరాజ్యంలో పూసిన నీలిరంగు కళ్లను బెదరగొట్టేసింది… ఇలా బోలెడు…
Ads
అసలు ఆ చర్చలోకి వెళ్లకుండా తమాయించుకుంటే… ఎస్, ఆదిపురుష్ టీజర్ చెత్తా… అందులో డౌట్ లేదు, కానీ ఆ మాట అనేది రాజమౌళి కుటుంబమా..? దానికి నైతిక అర్హత ఉందా వీళ్లకు..? అదెలాగో తరువాత చెప్పుకుందాం… 2) మరో ట్వీట్ ఏమిటంటే..? ‘‘భశుం’’… ఇంత కంగాళీ సినిమా సినిమా నా జన్మలో చూడలేదు… అప్పుడెప్పుడో చదివిన బాపూ గారి కార్టూన్’’ ఇదీ ట్వీట్… ఇది పొన్నియిన్ సెల్వన్ గురించి… ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ నాన్-తమిళ ప్రేక్షకులకు ఎక్కకపోవచ్చుగాక, జుత్తు పీక్కుంటున్నారు కావచ్చు… కానీ అది తమిళులు బ్రహ్మాండంగా ఓన్ చేసుకుంటున్నారు… మణిరత్నానికి జేజేలు కొడుతున్నారు… ఎనలేని పేరొచ్చి పడింది…
నిజానికి మణిరత్నం ప్రభ వెలిగిపోతున్న రోజుల్లో రాజమౌళి నిక్కర్లు వేసుకుని తిరుగుతున్నాడేమో… ఇదే కాంచి పుట్టాడో లేదో… మొత్తం ఫ్యామిలీ ప్యాకేజీ కింద అందరూ జమచేరి, వందల కోట్ల బడ్జెట్ చేసి, ఇష్టారాజ్యంగా కథల్ని వక్రీకరించి, ప్రేక్షకులపై వదిలే రాజమౌళి కుటుంబం కూడా మణిరత్నాన్ని విమర్శించడం నవ్వొస్తోంది… ఓ సగటు ప్రేక్షకుడికి ఆ హక్కుంది… కానీ రాజమౌళి కుటుంబానికి లేదు… ఎందుకంటే..? ఆ మూడో ట్వీట్ కూడా చదవండి…
3) పొరపాటున నా కొలీగ్ ఒకాయన నిన్న ‘పన్నీర్ సెల్వం’ చూశా అన్నారు… పక్కనే ఉన్న తమిళ కొలీగ్ 5వ అంతస్తు నుంచి దూకే ప్రయత్నం చేశారు…’’… ఇదీ వెటకారపు ట్వీట్… ఇదే రాజమౌళి తీసిన ప్రతి సినిమాలోని ప్రతి హై సీన్ ఏదో ఓ పరాయి సినిమా నుంచి కాపీ కొట్టిందే… సోషల్ మీడియా మిత్రులు పక్కా ఆధారాలతో సహా బయటపెట్టి ఛీత్కరించారు…
అదేదో విజయశాంతి సినిమాలోని ఓ సీన్‌ను విక్రమార్కుడు సినిమాలో యథాతథంగా పెట్టడానికి రాజమౌళికి డ్యాష్ డ్యాష్ లేదేమో గానీ, సినిమా విమర్శకులు కబడ్డీ ఆడేశారు సోషల్ మీడియాలో… మొన్నటికి మొన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇద్దరు చరిత్ర పురుషుల కథల్ని వక్రీకరించి, ఎనలేని ద్రోహం చేశారు… చివరకు ఈ కుటుంబం కూడా మణిరత్నాన్ని విమర్శిస్తోంది… ఐరనీ అంటే ఇదే… అప్పట్లో ఇదే రాజమౌళి మహాభారతం నా కలల ప్రాజెక్టు అన్నాడు… తను తీసినా ఇదుగో ఈ ఆదిపురుష్ తరహాయే… ఎందుకంటే, తను కూడా గ్రాఫిక్ పిచ్చోడే కదా…!!
Share this Article