హేమిటేమిటి..? హీరోయిన్ లేకుండా చిరంజీవి సినిమాయా..? హవ్వ… మతి ఉందా..? వయస్సు సహకరించకపోయినా షూలేస్ కట్టుకుంటున్నట్టు… చొక్కాపై దుమ్ముదులుపుతున్నట్టు… చొక్కా అంచు దులుపుతున్నట్టు… ఏదోలా స్టెప్పులు వేయించాలి, హీరోయిన్ తన పక్కనే గంతులేయాలి… లేకపోతే ఎవడు చూస్తాడు..? ఇదుగో ఈ భయమే ఏళ్లుగా చిరంజీవిలోని అసలు నటుడిని కోల్డ్ స్టోరేజీలో ఉంచేసింది… ఉత్త స్టీరియోఫోనిక్, రొటీన్ ఇమేజ్ ఫార్ములా చట్రంలో గిరగిరా తిప్పింది… తనను ప్రయోగాలకు దూరం చేసింది… తను ప్రయోగాలు చేయలేడు… అది ఎప్పుడో ఒడిశిపోయిన కథ…
చిరంజీవి అంటే స్టెప్పులు ఉండాలి… ఫైట్లు ఉండాలి… బిల్డప్పులు ఉండాలి… ఎలివేషన్లు ఉండాలి… పగలు, ప్రతీకారాలు ఉండాలి… సగటు మాస్ హీరోకు తాత ఆయన… కానీ తను హక్కులు కొన్న లూసిఫర్‌లో హీరో మోహన్‌లాల్‌కు కూడా హీరోయిన్ ఉండదు… కథ అంతా సీరియస్ నోట్… ఫైట్లతో కాదు, కంటిచూపుతో శాసిస్తాడు… బిల్డప్పులు, ఎలివేషన్ల రొటీన్ ట్రాష్ లేని ప్రయోగాలకు మమ్ముట్టి, మోహన్‌లాల్ ఎప్పుడూ రెడీ… గతకాలంలో కమల్‌హాసన్ కూడా…
మరేం చేద్దాం..? ఫైట్లు పెట్టేద్దాం అనుకున్నారు… హీరోయిన్ వద్దనుకున్నారు… కానీ స్టెప్పులు..? ఏవో మూడు నాలుగు విచిత్రమైన స్టెప్పులు వేయించారు, అదీ సల్మాన్ ఖాన్ పక్కన… ఫాఫం చిరంజీవి… స్టెప్పుల్లేని సినిమాను ఎవడు చూస్తాడనే భయం కొద్దీ ఏవేవో అదనపు ఆకర్షణల్ని పెట్టడానికి, నింపడానికి ప్రయత్నించారు… కథలో మార్పులు, ఎలివేషన్లు, బిల్డప్పులు వేరే మ్యాటర్… ఇది తారాగణం గురించి…
Ads
ప్రధానంగా చిరంజీవికి ఎదురుగా దీటైన విలన్ ఎవరు..? ఏవేవో పేర్లు ఆలోచించీ చించీ సత్యదేవ్‌ను ఎంచుకున్నారు… మంచి నిర్ణయం… గొప్పగా చేయకపోవచ్చుగాక… కానీ తనకు చేతనైనంత మ్యాగ్జిమమ్ ఇచ్చాడు… చిరంజీవికి ఎదురుగా ఈమాత్రం చేయగలగడం గ్రేటే… మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, సత్యదేవ్‌కు మూణ్నాలుగు మంచి పాత్రలు పడితే తను బలంగా పాతుకుపోతాడు అని… ఆ మూణ్నాలుగులో ఇదొకటి…
మరో మంచి నిర్ణయం నయనతార ఎంపిక… ఆమె అందం చందం పక్కన పెట్టండి… ఆమె సీనియారిటీ ఆమె నటనలో ఓ రాజసాన్ని, గాంభీర్యాన్ని తీసుకురావడమే కాదు, నటనలో పరిణతి కనిపిస్తోంది… నిజానికి ఇలాంటి పాత్రలకు రమ్యకృష్ణ బెటర్ అనే ఓ పిచ్చి భ్రమ పెంచేశారు గానీ నయనతార ఏమాత్రం తీసిపోదు… గాడ్ ఫాదర్‌లో చిరంజీవిని వదిలేసి పరిశీలిస్తే సత్యదేవ్, నయనతార ఒకరకంగా సినిమాను శాసించారు…
హిందీ మార్కెట్ కోసమో, లేక ఈమధ్య చిరంజీవికి ఖాన్‌ల కలవరింతలు ఎక్కువయ్యాయి కాబట్టి తీసుకున్నాడో గానీ… సల్మాన్ ఖాన్ ఎంపిక ఓ శుద్ధ దండుగ యవ్వారం… తనను తీసుకోవడంతో తన కోసం ఓ రెండు స్టెప్పులు, పిచ్చి ఫైట్లు, బిల్డప్పులతో సినిమా చివరి అరగంట పరమ రొటీన్ మాస్ సినిమా అయిపోయింది… మరీ మోటార్ సైకిల్ నుంచి చిన్నపాటి మిసైళ్లు కూడా ప్రయోగిస్తాడు సల్మాన్… అదేలెండి, తెలుగు ప్రేక్షకులపైకే… పోనీ, ఆ పాత్రకేమైనా ప్రాధాన్యం ఉందా అంటే… ఏమీ లేదు… షఫీకి కూడా…
పాపులారిటీ ఉండి, సినిమాకు అదనపు ఆకర్షణగా ఉంటారని అనుకున్న ప్రతి ఒక్కరినీ తెచ్చి, సినిమాాలో పెట్టేశారు… హీరోయిన్ లేని లోటును ఈ భారీ తారాగణంతో నింపాలనుకోవడం ఓ విచిత్రమైన ఆలోచన… సినిమాలో పూరి జగన్నాథ్ మరో దండుగమారి ఎంపిక… ఎందుకు తీసుకున్నారో చిరంజీవికే ఎరుక… ఈమధ్య సముద్రఖని రెగ్యులర్‌గా తెలుగు సినిమాల్లో కనిపిస్తున్నాడు… పర్లేదు…
మురళీ శర్మను చూసీ చూసీ మొనాటనీ వచ్చేసింది జనానికి… ఐనా తన డిమాండ్లన్నీ తీరుస్తూ తననే తీసుకుంటున్నారు… రుద్దుతున్నారు ప్రేక్షకులపై… తనకు నటన రాదని కాదు… వైవిధ్యం ఏది..? పోనీ, ఇదే సినిమాలో తన బదులు రావు రమేష్‌ను తీసుకుని ఉంటే ఇంకా అదిరిపోయేది… సునీల్ కమెడియన్ కమ్ హీరో కమ్ కేరక్టర్ ఆర్టిస్టు… ఈ సినిమాలో అత్యంత సూక్ష్మ వేషం ఎందుకు అంగీకరించాడో తనకే తెలియాలి… ఫాఫం సునీల్ అనిపించింది… పుష్ప సినిమాలోకన్నా ఘోరం…
ఎప్పుడో మనం మరిచిపోయిన ఓ కేరక్టర్ మళ్లీ కనిపించింది… సిరివెన్నెల సినిమా సర్వదమన్ బెనర్జీ గుర్తున్నాడు కదా… తనను కూడా తీసుకొచ్చారు… ఇంపార్టెంట్ రోల్ ఏమీ కాదు, కానీ నేను మళ్లీ ఆటకు రెడీ అని చెప్పడానికి యూజ్‌ఫుల్… బిగ్‌బాస్‌లో వెలగడానికి విఫలప్రయత్నం చేసిన దివి వాదత్యాను తీసుకున్నారు… అప్పుడెప్పుడో చిరంజీవి హామీ ఇచ్చాడుట… ఉందీ అంటే ఉంది… ఇంక్ బిగ్‌బాస్ బామ్మ గంగవ్వను కూడా పట్టుకొచ్చి ఏకంగా చిరంజీవికి అవ్వను చేశారు… అదనంగా ఆంటీ ఉంది… ఉందంటే ఉంది… అంతే… అంకుల్ బ్రహ్మాజీ కూడా ఉన్నాడు…
వీళ్లే కాదండోయ్… తాన్యా రవిచంద్రన్ అని మరోనటి కూడా ఉంది… ప్రభుదేవా ఓ పాటలో కనిపిస్తాడు… ఓ ఐటమ్ సాంగులో వరీనా హుస్సేన్ అనే నటి కనిపిస్తుంది… సరే, ఈమె సల్మాన్ ఖాన్ ఆబ్లిగేషన్ అయి ఉంటుంది… అమాయకంగా వీళ్లందరూ ఏం చేశారు అనడక్కండి… సినిమాలో ఉన్నారు… ప్చ్, రామ్‌చరణ్ ఎట్సెట్రా మెగా హీరోలను కూడా అక్కడక్కడా చూపిస్తే బాగుండేది… చిరంజీవికి ఆలోచన రానట్టుంది… మరిచిపోయాను, ఈమధ్య చాన్నాళ్లుగా కనిపించని సాయాజీ షిండే కూడా కనిపించాడు…
ఇంకా ఉంది… దారి తప్పిన థమన్ ఏవేవో కాపీ ట్యూన్లు ఇచ్చాడు… అనంత శ్రీరామ్ ఏవో పిచ్చిరాతలు గెలికి ఇచ్చాడు… చివరకు లాభం లేదని రామజోగయ్యశాస్త్రిని తీసుకొచ్చారు… ఆయన తెలుగో కాదో తెలియని భాషలో ఇంకేదో రాసిచ్చాడు… ఫాఫం, థమన్ ఏం చేస్తాడు..? తను కూడా చిరంజీవిలాగే ఆలోచించి, బోలెడు మందిని తీసుకొచ్చి పాటల్లో ఇరికించాడు… శ్రేయో ఘోషాల్‌ను పట్టుకొచ్చాడు… శ్రీకృష్ణ పృథ్విచంద్ర నజభజజజర అని ఊగిపోగా… దామిని భాటియా, శ్రీరామచంద్ర ఇంకేదో గుర్తులేని పాటలో పాడారు…
ఇక ఒక పాటలో నాసామిరంగా… దాదాపు 20 మంది… అనుదీప్ దేవ్, ఆదిత్య అయ్యంగార్, రఘురామ్, భాస్కరుని సాయిచరణ్, అర్జున్ విజయ్, రితేష్, సత్సంగి చైతు, భరత్, అరుణ్ కౌండిన్య, శ్రీకృష్ణ, అద్వితీయ, శృతిక, ప్రణతి, ప్రత్యూష, రచిత, వైష్ణవి, హారిక నారాయణ్, శృతిరంజని, సాహితి… ఎహె, కోరస్ సింగర్స్ కాదు… అందరూ పాడారు… తీరా చూస్తే ఆ పాట పరమఫ్లాప్…!!
Share this Article