మనకు కమల్ హాసన్‌కు ఉన్నంత జ్ఞానం ఉండకపోవచ్చుగాక… కానీ మన చిన్న బుర్రకు కూడా కొన్ని సందేహాలంటూ ఏడుస్తయ్ కదా… మరి చెప్పుకోవాలి కదా… అసలే గత ఎన్నికల్లో కర్రు కాల్చి వాతలు పెట్టారు తనకు… అది తన జ్ఞానానికి ప్రజల కానుక అని అనలేం… ఎందుకంటే… మేధావులను ఈ దుష్ట సమాజం ఎప్పుడు సరిగ్గా గౌరవించింది గనుక..! అప్పట్లో ఎక్కడో మాట్లాడుతూ నేను క్రిస్టియానిటీ తరఫున వర్క్ చేస్తున్నాను అన్నాడట… ఓ వీడియో వైరల్ అవుతుంది… ఫేకో, రియలో తెలియదు… కానీ…
ఎహె, ఒకటే మొత్తుకోకండి, అసలు చోళుల కాలంలో హిందూ అనే పదం లేదు, మతం లేదు… శైవం, వైష్ణవం, జైనిజం (జైనిజం అన్నాడా, శాక్తేయం అన్నాడా..?) మాత్రమే ఉండేవనీ, బ్రిటిషోళ్లు అందరినీ హిందువులు అని పిలవడం ప్రారంభించారని కమల్ ఉవాచ… ఆ పేరు తప్పా ఒప్పా వదిలేయండి… అందరినీ హిందువులు అని పిలుస్తుంటే, మరి అందరిలో ఒకరైన చోళులు హిందువులు గాకుండా ఎలా పోయారు..? పోనీ, మరి ఏ పేరుతో పిలవాలి..?
బీజేపీ నాయకుడొకాయన చెబుతున్నాడు… చోళులు రెండు మసీదులను, ఒక చర్చిని కూడా కట్టించారు అని… అంటే అప్పటికి క్రిస్టియానిటీ, ఇస్లాం కూడా దేశంలోకి ప్రవేశించినట్టేనా..? మరి కమల్ ఇలా చెబుతాడేంటి..? ఇక కొందరైతే తమిళులు అసలు హిందువులే కారు అనే హ్యాష్‌ట్యాగ్‌తో రచ్చకు దిగారు… ట్విట్లరే కదా, ఎవడు ఏదైనా రాసుకోవచ్చు… ప్రచారం చేయవచ్చు… హిందువులు కారు సరే… ఎవరు మరి..? జైనులా..? క్రిస్టియన్లా..? ముస్లింలా..? కాదట, శైవులట… శైవులంటే హిందువులు కాదా..? మరి తమిళులు హిందువులు కారనే వాదన ఏమిటి..?
Ads
తమిళనాడులో హిందూ అనే పదం వినిపిస్తే చాలు, దాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్, అగ్రవర్ణ ఆధిపత్య సూచికగా, ఆ వర్ణాల వివక్షకు ప్రతీకగా పరిగణిస్తారు చాలామంది… తప్పులేదు, పాత చేదు అనుభవాల నుంచి పుట్టుకొచ్చిన అసహనం, ఆగ్రహం… అయితే వెట్రిమారన్ అనే దర్శకుడు కూడా పొన్నియిన్ సెల్వన్ సినిమా రిలీజ్ కాగానే… ‘వాటీజ్ దిస్..? మన మూలాల్ని మన నుంచి దూరం చేస్తున్నారు… మతం పేరుతో సంస్కృతిని కాషాయీకరిస్తున్నారు… రాజరాజచోళుడిని పదే పదే హిందూ అని ప్రస్తావిస్తూ చరిత్రను వక్రీకరించొద్దు… సినిమా అనేది బలమైన మాధ్యమం, దీని తాలూకు రాజకీయ కోణాల్ని అర్థం చేసుకోవాలని అన్నాడు…
కమల్ హాసన్ దానికి మద్దతునిచ్చాడు… అంటే కమల్ దృష్టిలో కూడా ఈ పొన్నియిన్ సెల్వన్ రాజకీయ కోణంలో హిందూ మత ప్రచారం కోసం ఉద్దేశించిన సినిమా అనేనా అర్థం..? తమిళనాట హిందూ పదప్రచారం చేసుకునే ఏకైక పార్టీ బీజేపీ… అంటే ఇది బీజేపీ సినిమా అని పరోక్షంగా ముద్ర వేస్తున్నాడా..? నిజంగా మణిరత్నానికి ఆ కాషాయ ముద్ర ఉందా..? మరెందుకు ఇలా హఠాత్తుగా బురదజల్లే ప్రయత్నం..?
ఈ వివాదం మీద తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యలు ఎక్కడా కనిపించలేదు ఎందుకో మరి…! పైన కనిపించిన అద్భుత నిర్మాణం బృహదీశ్వరాలయం… దాని విశేషాల జోలికి ఇక్కడ పోవడం లేదు గానీ… గుడి నిర్మాణమే ఓ అబ్బురం… చోళులు కట్టించిందే… చాలా గుళ్లు కట్టించారు… వాళ్లు హిందువులు కారా..? ఇవి హిందూ గుళ్లు కావా..? పోనీ, శైవానికీ, హైందవానికీ అసలు సంబంధమే లేదా..? ఇప్పుడు సమస్య బ్రిటిషోడు మనల్ని హిందువులు అని పేరుపెట్టడంతో వచ్చిందా..?
లేక రేప్పొద్దున ఎప్పుడో ఈ వివాదం వస్తుందని ఊహించి, కమల్ హాసన్ వంటి గొప్ప మనుషులు ప్రశ్నిస్తారని ఊహించి, ఆ రాజకుమారి కుందవి ముందుగానే క్లారిటీ ఇస్తూ శాసనాలు వేయించకపోవడం వల్ల వచ్చిందా..? ఎప్పుడో పుట్టబోయే బీజేపీకి, నడుస్తున్న తమ చరిత్రకు సంబంధం లేదనీ వివరణ ఇవ్వకపోవడం కరెక్టేనా..? కమలవిజ్ఞులు అపార్థం చేసుకోవద్దని అడుగుతూ శాసనాలు వేయిస్తే ఏం పోయేది..?! అవునూ… మణిరత్నం సినిమాకు బీజేపీ క్యాంపు డబ్బులిచ్చిందా..? తను కాషాయం అంగీ తొడుక్కున్నాడా..? ప్చ్… ఇంతకీ తెలుగు ప్రజలు హైందవులేనా..? ఇంకెవడూ స్టార్ట్ చేయలేదా ఈ రచ్చను..?! కమల్‌కు కాస్త అటూఇటూ దీటైన నటుడు ఒకయన ఉన్నాడు… పిచ్చి వ్యాఖ్యలకు, అన్నింట్లోనూ వేలుపెట్టడానికి ప్రసిద్ధుడు… ఏమయ్యా, ఇంకాా తెల్లవారలేదా..? !
Share this Article