నువ్వు ఏమైనా రాసుకో, ఏ దందానైనా చేసుకో…. నేను ఏమైనా చేసుకుంటా… నా జోలికి నువ్వు రాకు… నీ జోలికి నేను రాను… వంటి ‘‘పెద్ద మనుషుల అలిఖిత ఒప్పందం’’ వంటిది అమలయ్యేది గతంలో…! కానీ ఇప్పుడు పత్రికలే పార్టీలు, నాయకుల ప్రధాన కార్యాచరణ కేంద్రాలు… దుష్ప్రచార వేదికలు… ప్రతి పత్రిక రంగు పూసుకున్నాక ఇక ఆ ఒప్పందాలు, మర్యాదలు ఏముంటయ్… ఒకరిపైనొకరు దొరికినంత బురదను, దుమ్మును పోసేయడమే…
ఎవడూ అతీతుడు కాడు… అయితే ఒక పత్రిక పేరును ఓ నెగెటివ్ వార్తలోకి తీసుకొచ్చినప్పుడు ఆ పత్రిక స్థాయి ఏమిటి..? అసలు మనం స్పందించాలా అనేది కూడా చూడాలి… అలా అనుకునే సాక్షి, ఈనాడు, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి తమలోతాము ఎంత తన్నుకున్నా… ఆంధ్రప్రభ వంటి చిన్న పత్రికల జోలికి వెళ్లేవి కావు… స్టేటస్ సమస్య… పైగా ఆంధ్రప్రభ ఓనర్ జనసేన పార్టీ… అందులో ఉన్నాడో లేదో తెలియదు…
యాడ్స్ కావాలి, రెవిన్యూ కావాలి… అటు జగన్‌కూ, ఇటు కేసీయార్‌కు డప్పు వీరలెవల్లో కొడుతూ ఉంటుంది… సరే, ఎవరి తిప్పలు వాళ్లవి… అయితే కొన్నిసార్లు నమస్తే తెలంగాణ కూడా సిగ్గుపడేది ఆంధ్రప్రభ కవరేజీ చూసి…! ‘‘కేసీయార్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు… ఐక్యరాజ్యసమితి భేటీ వాయిదా… అన్ని దేశాల భద్రత సలహాదార్ల అర్జెంటు భేటీ… పుతిన్, జిన్‌పింగ్, బైడన్ తదితరులు వర్చువల్ రియాలిటీలో సంప్రదింపులు… విచ్ఛిన్నం కాబోతున్న నాటో…’’ ఇలా రాసేయమంటే రాసేస్తుంది…
Ads
ఎందుకింత అతి అని ఆలోచిస్తే ఓపట్టాన అర్థమయ్యేది కాదు… యాడ్స్ కోసమా అంటే… కేసీయార్ చల్లనిచూపు ఉండాలే గానీ ప్రజాపక్షం వంటి సూక్ష్మ పత్రికకు కూడా పెద్దపత్రికగా గుర్తింపు, యాడ్స్ స్టార్ట్… కానీ ఇప్పుడు కాస్త క్లారిటీ వస్తోంది… ఆంధ్రప్రభకు ఓ ఇంగ్లిష్ చానెల్ ఉంది… దానిపేరు ఇండియా అహెడ్… ఇప్పుడు ఢిల్లీ మద్యం స్కాం దానికి చుట్టుకుంది… ఆ చానెల్ పెట్టుబడులు ఆ స్కాం నిందితుల నుంచి ప్రవహించినట్టు ఈడీ వర్గాలు సందేహిస్తున్నాయి… ఈ బంధుత్వమేనా టీఆర్ఎస్ డప్పుకు కారణం..?!
నిన్న ఆంధప్రభలో, ఓనర్ ముత్తా గోపాలకృష్ణ ఇంట్లో ఈడీ తనిఖీలు సాగాయి… ఇంపార్టెంట్ వార్తే… నిజానికి తనిఖీలు సాగినంత మాత్రాన ముత్తా గోపాలకృష్ణ నిందితుడనే నిర్ధారణ కాదు… తనిఖీలు వేరు, కేసులు వేరు… ఐనా ఇలాంటి కేసులు ఎప్పుడూ కొసెళ్లవు… కానీ ఈరోజుకు అది వార్తే… ఒక్క ఆంధ్రజ్యోతి మాత్రమే పేరుతోసహా వార్త పబ్లిష్ చేసింది… ఈనాడు ఎలాగూ నప్పతట్ల యవ్వారం కదా… ఒక పత్రిక, ఒక చానెల్ అని రాసింది… ఇక్కడ కూడా భయమా, మర్యాదా, గౌరవమా… సేమ్, సాక్షి… ఈనాడు ఎలా వాతలు పెట్టుకుంటే అది అలాగే పెట్టుకుంటుంది… అదొక నెత్తిమాశిన ఎడిటోరియల్ ధోరణి…
నమస్తే తెలంగాణ ఎలాగూ రాయదు… ఇక మిగిలినవన్నీ సూక్ష్మ పత్రికలే… ఒక వ్యక్తి, ఒక పత్రిక, ఒక పార్టీ, ఒక నాయకుడు, ఒక నిందితుడు వంటి భాషాజాలాన్ని ఆంధ్రజ్యోతి వేగంగా వదిలించుకుంటోంది… వీలైతే తెలిసిన పేర్లను రాసేయడమే… లీగల్ ఇష్యూస్ వస్తే పోరాడతామనే ధైర్యం ఉంటే అది సరైన ధోరణే… ఒక నాయకుడు ఇంకో నాయకుడితో ఒక ప్రాంతంలో కలిశాడని ఒక నాయకుడు చెప్పాడు వంటి శైలిని ఎవడూ ఇష్టపడటం లేదు ఇప్పుడు… అందరూ నిన్న గరికపాటికీ, రాధాకృష్ణకూ ముడిపెట్టి నానా రచ్చ చేశారు సోషల్ మీడియాలో… ఆ వివాదం మీద మాత్రం ఆంధ్రజ్యోతి ఎందుకోగానీ ఫాలోఅప్ కావాలనే వదిలేసినట్టుంది… అలాగే ఓ లేడీ జర్నలిస్టుకు నమస్తే తెలంగాణ బహిరంగంగా క్షమాపణ చెప్పడం కూడా విడిచిపెట్టినట్టుంది…!!
Share this Article