మీరు ఎంతగా సెక్యులరిస్టులమని చెప్పుకొన్నా.. ఒక్క ముస్లిమైనా మీకు ఓటేస్తాడా? దేవుడిని నమ్మనివాళ్లను ఓన్ చేసుకుంటారా? అని అడిగాడు ఆంధ్రజ్యోతి ఆర్కే…. మాకు ఇప్పుడు ఆ సమస్యే లేదు. జనం ఎక్కడ ఉంటే అక్కడికి వెళుతున్నాం. దేవుడిని వ్యతిరేకించాలని చెప్పడం లేదు. మూఢ నమ్మకాలను మాత్రమే వద్దంటున్నాం అన్నాడు తెలంగాణ సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు…. శబరిమలలో రుతుస్రావ మహిళల్ని ప్రజల నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టడం పిచ్చి చర్య అని కేరళ సీపీఐ అధికారికంగా ఖండించింది…
నమ్మేశారా..? ఎట్టకేలకు ఈ విదేశీభావజాల దాసులు ఈ దేశ ప్రజల నమ్మకాలకు, మనోభావాలకు విలువనిస్తారని నమ్మేశారా..? నెవ్వర్… ఆర్కే నమ్ముతాడేమో… ఇంకెవడూ నమ్మడు, నమ్మడు కాబట్టే ఈ దుస్థితి… వాళ్ల పంచన వీళ్ల పంచన బతుకుతూ ఒకటీరెండు ముష్టి పడేస్తే, ఆయా ప్రధాన పార్టీల వెనుక జెండాలు మోస్తూ బతకడం… హార్ష్‌గా ఉన్నా ఇదే నిజం… వీళ్లలో ఎవరికీ హిందుత్వకూ హిందూయిజానికి తేడా తెలియదు… నోటికొచ్చింది మాట్లాడటమే…
మోడీని తిడతావా, తిట్టు… అనాసిన్ ట్యాబ్లెట్ దగ్గర్నుంచి గ్యాస్ బండ వరకు ఇప్పుడు అన్ని ధరలూ భగ్గుమంటున్నయ్… సగటు మనిషి గుండెలాగే… ధరలనే కోణంలో ఇంత చేతకాని, జనం అంటే ఏమాత్రం కన్సర్న్ లేని ప్రధాని ఇప్పటివరకూ రాలేదు… ఇలాంటివి వదిలేసి, వీళ్లకు ఆకూపోక తెలియని హిందూ అంశాలను వెక్కిరిస్తున్నారు… నిన్న మగ్దూం భవన్‌లో ఓ సదస్సు… సోకాల్డ్ మేధావులుగా మీడియా ముద్రలేసి, పెద్దల్ని చేసిన, కొన్ని బుర్రలుంటాయి కదా, వాళ్లను పిలిచారు… వాళ్లు ఇష్టమొచ్చింది మాట్లాడారు… చప్పట్లు కొట్టారు… వాళ్లేం మాట్లాడారో పత్రికల్లో చదివి జనం ‘ఇక వీళ్లు మారరురా’ అని ఛీత్కరించేశారు…
Ads
బీజేపీని విమర్శించు… సరైనచోట తగలాలి… మోడీ కిక్కుమనకుండా దిద్దుబాటుకు దిగాలి… అది చేతకాదు వీళ్లకు… బొడ్రాయి, బతుకమ్మ పండుగల పేరిట ఆదిపత్య మతభావజాలాన్ని ఊరూరా తీసుకెళ్లే ప్రయత్నాలు సాగుతున్నాయట… ఆయన ఏ పార్టీ సానుభూతిపరుడో తెలియదు… కానీ తనకు బొడ్రాయి అంటే అక్షరమ్ముక్క కూడా తెలియదని మనకు అర్థమైంది… అది ఊరి పండుగ… అనేక తరాలుగా చేసుకునే పండుగ… గ్రామ నిర్మాణ సమయంలో వేసిన మొదటి రాయి బొడ్రాయి… దాన్నే శక్తిగా పూజిస్తారు ప్రజలు… ఇందులో సోకాల్డ్ మేధావికి ఆధిపత్య మతభావజాలం ఏం కనిపించిందో… నిజానికి దీన్ని బలంగా సెలబ్రేట్ చేసుకునేది బహుజనమే…
బతుకమ్మ గురించి మాట్లాడే నైతికార్హత ఈ మేధావులకు అస్సలు లేదు… ఆంధ్రా సంస్కృతి సహా రకరకాల విదేశీ సంస్కృతులు దాడులు చేసి, బతుకమ్మను వెకిలి చేసి, కనుమరుగు చేయబోతే… కాపాడుకున్నది బహుజన మహిళ… అది వాళ్ల బతుకులతో పెనవేసుకున్న పండుగ… ఇందులో ఆధిపత్య మతభావజాలం అని ఎవడికీ సమజ్ కాని సోది పడికట్టు పదాలు దేనికి..? మార్క్సిజాన్ని మించిన సత్యసిద్ధాంతం లేదని గోరటి వెంకన్న అన్నాడట…. మరి మొన్నమొన్నటిదాకా దబ్బనం పార్టీగా మార్స్సిస్టులను, ఇతర లెఫ్ట్ పార్టీలను పది ఆమడల దూరం ఉంచిన టీఆర్ఎస్ చంకలో ఎందుకు చేరినట్టు తమరు..? ఎందుకంత ముద్దొచ్చింది… పదవి ఇస్తున్నందుకా..?
ఎవరికీ అర్థం కాని అత్యంతాతి సంక్లిష్ట భాషలో ఏదేదో మాట్లాడే ఆ ఎడిటర్‌ను వదిలేద్దాం కాసేపు… కార్పొరేట్ వ్యతిరేకంగా ఒక్క వార్త రాదని ప్రజాపక్షం ఎడిటర్ శ్రీనివాసరెడ్డి అంటున్నాడు… మొన్ననే కదా కార్పరేటు తరహా అధికార పార్టీకి తోకగా చేరి, పెద్ద పత్రికగా ముద్రేయించుకుని, యాడ్స్ తీసుకుంటున్నవాళ్లు కూడా యాంటీ- కార్పొరేట్ నీతులు మాట్లాడితే విచిత్రంగా ఉంది…
ప్రజలను దోపిడీ చేసే సంస్కృతిని బీజేపీ తీసుకొస్తోందని గద్దర్ అన్నాడట… ఎటెటో కొట్టుకుపోతున్న శిథిల యుద్ధనౌక గద్దర్ కూడా మాట్లాడేవాడయ్యాడు… ముందుగా నీవల్ల అడవుల్లో ఆరిపోయిన వేలాది మంది అమరులకు క్షమాపణ చెప్పి ఏమైనా మాట్లాడు… తరువాత కేఏపాల్‌తో చేరి ఏ ప్రచార సభలు పెట్టుకుంటావో, నీ మాటలు ఎవడు వింటాడో నీ ఇష్టం…!! ఇదే గద్దర్ జేఎన్ఎం పెత్తనం వెలగబెడుతున్నప్పుడు, అప్పటి పీపుల్స్ వార్ ఇదే సీపీఐ కేడర్‌ను ఊళ్లల్లో ఎలా చితకబాదేవాళ్లో, ఎన్ని కుటుంబాలు ఊళ్లిడిచిపోయాయో నీకేమైనా ఐడియా ఉందా కూనంనేనీ…!? ఉండే ఉండదు, ఉంటే సీపీఐలో ఎలా ఉండేవాడివి..?!
ప్రజాపోరాటాలతో బీజేపీ వ్యతిరేక కూటమి సాధ్యమట…. భలే చెప్పావు కామ్రేడ్, కాస్త ఆ గులాబీ జెండా దింపి మళ్లీ ఒకసారి చెప్పు..!
Share this Article