డియర్, కంపెనీ వాళ్లు ఫోన్ చేశారు… ఈరోజే ‘డెలివరీ’ ఇచ్చేస్తారట… ఆల్‌రెడీ ఫ్యాక్టరీలో డెలివరీ అయిపోయిందట… ఇంటికి వెళ్దామా..? నేను షూటింగ్ ఆపేసి బయల్దేరాను…. ఖరీదెక్కువ కదా, పనివాళ్లకు, వాచ్‌మెన్‌కు, సెక్యూరిటీ గార్డులకు ఇవ్వరట… నీకో గుడ్ న్యూస్, మనం ఒక్కటే కదా ఆర్డరిచ్చింది, ఒకటి బోనస్ ఇస్తున్నారు…
వావ్… వన్ ప్లస్ వన్… కానీ నేనేమో ఇక్కడ షూటింగులో బిజీ డియర్.., సరే, ఓ గంటాగి బ్రేక్ తీసుకుని వస్తా, మళ్లీ అరగంటలో సరి చూసుకుని, మళ్లీ షూటింగుకు రావాలి… సరోగసీ మాత్రమే కాదు, మూడునాలుగు నెలలు ఆ పిల్లల బాగోగులు కూడా చూసుకోవాలని ముందే ఒప్పందంలో మాట్లాడుకున్నాం, మళ్లీ పేచీ పెడుతుందేమో, గట్టిగా మాట్లాడాలి… అసలే ఈ ఫర్టిలిటీ దుకాణాల్ని, ఫ్యాక్టరీలను నమ్మలేం….
……. నో, నో, నయనతార, విఘ్నేశ్ శివన్ నడుమ సంభాషణ కాదోయ్ ఇది… కానీ అచ్చంగా అదే పరిస్థితి… జస్ట్, అలా ఆర్డర్ ఇచ్చారు, ఇలా ఆ ఫర్టిలిటీ దుకాణం వాడు నిర్ణీత టైమ్ కాగానే డెలివరీ ఇచ్చాడు… డబ్బు బాస్, డబ్బు… తమరి బొంద, ఇంకా ఏ కాలంలో ఉన్నారు తమరు..? గర్భ నిర్ధారణ, సీమంతం, వేవిళ్లు, బిడ్డ కడుపులో తన్నడం, కడుపులో బిడ్డతో ముచ్చట్లు, తీరా టైమ్‌కు ప్రాణాలకే రిస్క్ వంటి ప్రసవం… ఎన్ని దశలు..? సంబరాలు, ఆందోళన, భయం, ఆతృత…
Ads
అసలే మన దేశంలో బాలింత మరణాలు ఎక్కువ… నవజాత శిశుమరణాలు ఎక్కువ… మంత్రసానుల తప్పేమీ లేదు… వాళ్లకు తెలిసిందే అది… మన వైద్య సౌకర్యాల వ్యాప్తి మీద మన ప్రభువులకు ఎన్నడైనా సోయి ఏడిస్తే కదా… బిడ్డ అడ్డం తిరిగితే చావో బతుకో ఎవడూ చెప్పలేడు… బొడ్డు తాడు తెంపేసి, ముడేస్తే సరి… ఇక చావు, బతుకు దైవాధీనం… ఆ దశ దాటి ఇప్పుడు టైమ్ చూసుకుని సిజేరియన్లు చేయించుకునే దశకొచ్చాం… పురుటి నొప్పులు పడేంత ఓపిక, ఎదురుచూపులు నాన్సెన్స్… ఆ టైమ్ రాగానే కడుపు కోయాలి… కుట్టేయాలి… ఇప్పుడు ప్రసవం అంటే లక్షలు…
ఆ దశ నుంచి మరింత ముందుకొచ్చాం… అలా ఫర్టిలిటీ ఫ్యాక్టరీకి ఆర్డర్ ఇస్తే… ఇదుగో ఈ నయనతార, విఘ్నేశ్ దంపతులకు సరుకు డెలివరీ చేసినట్టే చేస్తారు… సరుకు డెలివరీ సమయంలో చూసుకోవడమే… ఫోటోలు దిగి, సోషల్ మీడియాలో పెట్టేసుకోవడమే… అంతా ఆయాలు చూస్తారు… చంటిపిల్లల పోషణకు ఆయాలు,.. కనీసం పాలు ఇచ్చే పని కూడా ఉండని, అవకాశం ఉండని కొత్తతరం అమ్మలు… ఫిగర్‌కు ఢోకా లేదు… షూటింగ్ షెడ్యూళ్లకు బ్రేక్ లేదు…
సృష్టిలో ప్రతి జీవి సహజపద్ధతిలో ప్రత్యుత్పత్తిని కాంక్షిస్తుంది… అది జీవలక్షణం… మనిషి తప్ప..!! ఇక రాబోయే రోజుల్లో అద్దె కడుపులు కూడా ఉండవు… ఆ చిక్కులు పెరుగుతాయి… అందుకని లేబరేటరీలోనే టెస్ట్ ట్యూబ్‌లో అండం, వీర్యం కలయిక… అనగా సృష్టికార్యం… తరువాత కొన్నాళ్లకు ఇంక్యుయేషన్ యంత్రాల్లో పెట్టేయడమే… అవయవాలు సరిగ్గా పెరుగుతున్నాయా లేదా చూసుకోవాలి అంతే… డబ్బు మేక్స్ ఎనీ థింగ్… నిజానికి ఇప్పటికే సరోగసీ మీద బోలెడు షరతులు, రూల్స్ ఉన్నాయి… కానీ ఎవడు పాటిస్తాడు..?
నా అండం, ఎవడో వీర్యదాత… సింగిల్ మదర్…. నా వీర్యం, ఎవత్తో అండదాత… సింగిల్ ఫాదర్… ఈ టైపు పేరెంటం పెరగబోతున్నది… (నాట్ పేరంటం)… ఇంకా ముందుకు వెళ్తే… ముందుగానే జెనెటికల్ కేరక్టర్స్, జన్యు అమరికలు చూసుకుని, కోరుకున్న కలర్, దేహ లక్షణాలున్న పిల్లల్ని ‘డిజైనర్ బేబీ’లు రాబోతున్నారు… అది మరీ అడ్వాన్స్‌డ్… ఖర్చు ఎక్కువ… కానీ ముందే చెప్పుకున్నాం కదా… అమ్మతనపు ప్రతి దశను అనుభవించడం ఏమీ ఉండదు… జస్ట్, ఆర్డర్ ఇచ్చామా..? సరుకు ఇంటికొచ్చిందా..? అంతే…
సందర్భరహితమో, సహితమో తెలియదు గానీ… నయనతార తన పిల్లలకు ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టుకుంది… అంటే ప్రాణం, ప్రపంచం అన్నట్టుగా ఏవో శుభ అర్థాలొస్తాయి… ఇంకా నయం, హిందువులు-భారతీయుల ఊచకోతలకు ప్రసిద్ధులైన జెహంగీర్, తైమూర్ పేర్లు పెట్టుకున్న కరీనాకన్నా నయమే…. పెళ్లికి ముందే ఈ ‘‘దంపతులు’’ సరోగసీ సంతానానికి ఆర్డర్ ఇచ్చారు, పెళ్లి తరువాత ఇప్పుడు డెలివరీ తీసుకున్నారు… ఎస్, ఈతరం పేరెంట్స్…
కడుపు చూపించుకుంటూ ఫోటోలు దిగడం, వీడియోలు ఇన్‌స్టాలో పెట్టడం అనే ధోరణి కనిపిస్తోంది ఈమధ్య… ఆ అందరి నడుమ ఆలియా భట్ కాస్త ప్రత్యేకంగా ఉంది… కడుపుతోనే ఆమె తమ సినిమా ప్రమోషన్లకు దేశమంతా తిరిగింది భర్తతో కలిసి… మాతృత్వపు ప్రతి దశను అపురూపంగా అనుభవిస్తున్నాను అంటోంది… ఈ పిల్లకు బుర్ర తక్కువ అంటుంటారు గానీ, నిజంగా ఓ ఫీల్ ఉన్న కేరక్టర్… నిజంగా ఆమెకు ఏం తక్కువని..? నయనతారలాగా ఆర్డర్ ఇచ్చి, సరుకు డెలివరీ చేసుకోలేదా..? ఆమె అత్త నీతూసింగ్ కూడా ఆలియా అడుగులకు ఆమోదం చెప్పేదే….
Share this Article