పార్ధసారధి పోట్లూరి ………. సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు మళ్ళీ ఆకాశానికి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ! అక్టోబర్, 17, 2022 సాయంత్రం ,ఉక్రెయిన్ పోర్ట్ సిటీ మికొలైవ్ [Mykolaiv] దగ్గర ఉన్న పొద్దుతిరుగుడు నూనెని నిల్వ ఉంచిన పెద్ద టాంక్ మీద రష్యా దాడి చేసింది! ఈ పోర్ట్ సిటీ మికొలైవ్ నుండి విదేశాలకి సన్ ఫ్లవర్ ఆయిల్ ని ఎగుమతి చేస్తుంది. దాని కోసం ఆయిల్ ని నిల్వ చేసి ఉంచడానికి పెద్ద పెద్ద టాంక్ లని కట్టింది ఉక్రెయిన్. ఆదివారం రాత్రి ఈ పొద్దుతిరుగుడు నూనెని నిల్వ ఉంచిన టాంక్ ల మీద కామికాజ్ డ్రోన్ లతో రష్యా దాడి చేసి వాటిని నాశనం చేసింది. దాడి తరువాత సన్ఫ్లవర్ ఆయిల్ ఉన్న టాంకులకి నిప్పు అంటుకొని అవి మండుతున్నాయి.
ఎగుమతి చేయడానికి నిల్వ ఉంచిన స్టాక్ అంతా నాశనం అయిపోవడం వలన ప్రస్తుతానికి ఎగుమతులు నిలిచిపోయినట్లే ! దీని ప్రభావం అటు యూరోపు తో పాటు ఎక్కువగా దిగుమతి చేసుకునే మన దేశం మీద కూడా ఆ ప్రభావం పడపోతున్నది ! అంటే మళ్ళీ లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ధర మరో 50 రూపాయలు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. మన దేశం ఉక్రెయిన్ నుండి సన్ఫ్లవర్ ఆయిల్ ని ముడి రూపంలో దిగుమతి చేసుకొని ఇక్కడ దానిని ప్రాసెస్ చేసి పాకింగ్ చేసి అమ్ముతున్నది. కాబట్టి మళ్ళీ కొత్త టాంకులు నిర్మించే వరకు ఉక్రెయిన్ నుండి మన దేశానికి సన్ఫ్లవర్ ఆయిల్ రాదు !
ఉక్రెయిన్ మళ్ళీ కొత్త ఆయిల్ టాంకులని నిర్మించినా మళ్ళీ వాటిని రష్యా ధ్వంసం చేయదు అన్న గ్యారంటీ లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు నూనె ధరలు దిగివచ్చే అవకాశాలు ఉండవు. రష్యా తో పాటు ఉక్రెయిన్ లు కలిసి ప్రపంచవ్యాప్తంగా సన్ ఫ్లవర్ ఆయిల్ ని ఎగుమతి చేస్తున్నాయి. దాదాపుగా 70% సన్ఫ్లవర్ ఆయిల్ రష్యా మరియు ఉక్రెయిన్ ల నుండే ఎగుమతి అవుతున్నది. తాజా దాడుల వల్ల కనీసం 25% కొరత ఏర్పడబోతున్నది ప్రపంచవ్యాప్తం గా !
Ads
గత ఫిబ్రవరి నెలలో రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టగానే అప్పటికే పొద్దుతిరుగుడు పంట చేతికొచ్చే సమయం అవడం, యుద్ధ వాతావరణం వలన గింజల్ని సేకరించి, వాటి నుండి నూనె తీసే సమయం లేకపోవడం తో నేరుగా పొద్దు తిరుగుడు గింజల్నే ఎగుమతి చేస్తూ వచ్చింది ఉక్రెయిన్ ! దాంతో ప్రపంచవ్యాప్తంగా పామ్ ఆయిల్ కి డిమాండ్ పెరగడంతో దాని ధరలకి కూడా రెక్కలు వచ్చాయి. రెండు నెలల క్రితం రష్యా ఉక్రెయిన్ రేవుల మీద దాడిచేయబోమని, వాళ్ళు ఎగుమతి చేసుకోవచ్చని హామీ ఇచ్చింది. దాని ఫలితమే ఉక్రెయిన్ రెండు నెలలుగా సన్ ఫ్లవర్ ఆయిల్ ని తిరిగి పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసి, ఎగుమతులు చేయడం మొదలుపెట్టడం తో ప్రపంచ దేశాలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి.
గత పది రోజుల క్రితం ఉక్రెయిన్ సైన్యం రష్యా మెయిన్ లాండ్ తో క్రిమియా ద్వీప కల్పాన్ని కలిపే కేర్చ్ బ్రిడ్జ్ ని కూల్చివేయడంతో మళ్ళీ తీవ్రంగా దాడులు చేయసాగింది. మధ్యలో మూడు రోజులు విరామం ఇచ్చింది. నిన్నటి నుండి కామికాజ్ డ్రోన్ల ద్వారా తిరిగి దాడులు ఉధృతం చేసింది రష్యా !
ఇరాన్ షెహాద్ కామికాజ్ డ్రోన్లు !
మూడు నెలల క్రితమే రష్యా ఇరాన్ నుండి షెహద్ కామికాజ్ డ్రోన్లని కొన్నది భారీ సంఖ్యలో ! వాటిని ఇప్పుడు ఉక్రెయిన్ మీద ప్రయోగిస్తున్నది రష్యా! తన దగ్గర ఉన్న క్రూయిజ్ మిసైళ్ళ సంఖ్య తగ్గిపోవడంతో రష్యా ఇరాన్ కి చెందిన షెహాద్ కామికాజ్ డ్రోన్ల లని కొన్నది ! అవి బాగానే పనిచేస్తున్నాయి !
కామికాజ్ డ్రోన్లు అంటే ఏమిటీ ?
కామికాజ్ అనే పదం జపాన్ దేశానిది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ దేశం బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ దేశాల యుద్ధ నౌకలని ఆత్మాహుతి విమానాల ద్వారా ధ్వంసం చేసేది. వాటినే కామికాజ్ విమానాలు అని పిలిచేవారు. కామికాజ్ అంటే ఆత్మాహుతి అని అర్ధం ! రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ తన ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే పైలట్ల లలో ఎవరయితే స్వచ్ఛందంగా మరణించడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా తయారు చేసిన విమానాల మీద శిక్షణ ఇచ్చి, వాటిని శత్రు దేశాల యుద్ధ నౌకల మీద ప్రయోగించేది.
జపాన్ కామికాజ్ విమానాలలో పైలట్ వెనుక భాగం మొత్తం అంటే కాక్ పిట్ వెనుక భాగం మొత్తం పేలుడు పదార్ధాలతో నింపి ఉంచేది. పైలట్ నేరుగా యుద్ధ నౌకల మీదకి వెళ్ళి విమానాన్ని కూల్చేవాడు, దాంతో యుద్ధ నౌకలు ఆ బాంబు పేలుడు కి ధ్వంసం అయ్యేవి. అమెరికా లోని పేరల్ హార్బర్ మీద జపాన్ దాడి చేసింది చాలావరకు ఈ కామికాజ్ విమానాల ద్వారానే ! జపాన్ కామికాజ్ విమానాలంటే బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, సోవియట్ దేశాలు భయపడేవీ ఎందుకంటే వాటిని కూల్చినా లేక కూల్చక పోయినా అవి పడేది యుద్ధ నౌకల మీదే కాబట్టి !పైలట్ లు ఎటూ చావుకి తెగించి మరీ వెళ్ళేవాళ్ళు !
టెర్రర్ గ్రూపులు ఈ కామికాజ్ విమానాల నుండే స్ఫూర్తిని పొంది మానవబాంబులని ప్రయోగించడం మొదలుపెట్టాయి. ఇప్పుడు డ్రోన్లు ప్రత్యేకంగా పేలుడు పదార్ధాలతో వెళ్ళి నేరుగా టార్గెట్ ల మీద పడి వాటిని ధ్వంసం చేస్తున్నాయి. ఉక్రెయిన్ కి అమెరికా స్విచ్ బ్లేడ్ [Switch Bled] అనే కామికాజ్ డ్రోన్లను ఇచ్చింది రష్యా మీద ప్రయోగించడానికి! ఇప్పుడు రష్యా వంతు వచ్చింది !
ఇరాన్ నుండి కామికాజ్ డ్రోన్ లని రష్యా కొంటున్నట్లు మూడు నెలల క్రితమే వార్తలు వచ్చాయి అయితే ఇరాన్ నుండి కొన్న డ్రోన్ లని కొద్దిగా మార్చి, మరికొంత మెరుగయిన పేలుడు పదార్ధాలని అమర్చి అలాగే షెహాద్ పేరుని కూడా మార్చి ప్రస్తుతం ఉక్రెయిన్ మీద ప్రయోగిస్తున్నది. పుతిన్ ఇరాన్ డ్రోన్ల పని తీరు మీద సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. రష్యాకు స్వంతంగా డ్రోన్లు తయారుచేసుకున్న కామికాజ్ డ్రోన్లు లేవు, దాంతో చాలా చవుకగా దొరికే ఇరాన్ డ్రోన్ల ని కొని, వాటిని మోడిఫై చేసి ప్రయోగిస్తున్నది !
ఆశ్చర్యపరిచే విషయం… ఇరాన్ డ్రోన్ల లలో అమెరికా కి చెందిన ఎలెక్ట్రానిక్ చిప్స్ వాడారు. ఇరాన్ మీద ఆంక్షలు ఉన్నా వీటిని ఎవరు ఇరాన్ కి సప్లై చేశారు ? రష్యా ప్రయోగించిన ఇరాన్ కామికాజ్ డ్రోన్ల ని ఉక్రెయిన్ అధికారులు పరిశీలించగా వాటిలో అమెరికన్ తయారీ చిప్స్ ఉన్నట్లు గుర్తించారు…..
Share this Article