పార్ధసారధి పోట్లూరి …………. సౌదీ అరేబియా అమెరికా, యూరోపుల నుండి దూరంగా జరుగుతున్నదా ? జరుగుతున్న పరిణామాలని పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తుంది ! అక్టోబర్ 2, 2022 న అమెరికాలో స్థిరపడ్డ సౌదీ జాతీయుడు అయిన సాద్ ఇబ్రాహీం అల్మాది [Saad Ibrahim Almadi] కి 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది సౌదీ అరేబియా ! సాద్ ఇబ్రాహీం అల్మాది వయస్సు 72 ఏళ్లు. జైలు శిక్ష పూర్తయిన తరువాత మరో 16 ఏళ్ల పాటు దేశం వదిలి విదేశాలకి ప్రయాణం చేయడం మీద నిషేధం కూడా విధించింది కోర్టు.
సౌదీ జాతీయుడు అయిన సాద్ ఇబ్రాహీం అల్మాది అమెరికాలోని ఫ్లోరిడాలో నివాసం ఉంటున్నాడు తన కుమారుడు అయిన ఇబ్రాహీంతో కలిసి… సాద్ ఇబ్రాహీం అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నాడు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో తన బంధువులని కలవడానికి సౌదీ వచ్చాడు సాద్ ఇబ్రాహీం అల్మాది. వచ్చీ రాగానే సౌదీ పోలీసులు సాద్ ఇబ్రాహీం అల్మాదిని అరెస్ట్ చేశారు. అప్పటి నుండి ఈ సంవత్సరం అక్టోబర్ 2 వరకు జైళ్లోనే ఉన్నాడు. అక్టోబర్ 2 న సౌదీ కోర్టు అతనికి 16 ఏళ్ల జైలుశిక్ష వేస్తున్నట్లు ప్రకటించింది.
*****************
Ads
ఇంతకీ సాద్ ఇబ్రాహీం అల్మాది చేసిన నేరం ఏమిటి ? సౌదీ రాజుకి వ్యతిరేకంగా ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశాడని అభియోగం మోపారు. సౌదీ చట్టాల ప్రకారం సౌదీ రాజు ని విమర్శించడం నేరం అవుతుంది ! సాద్ ఇబ్రాహీం అల్మాది సౌదీ రాజుకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఏమిటి ?
2018 లో సౌదీ కి చెందిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి టర్కీలోని సౌదీ రాయబార కార్యాలయంలో హత్యకి గురయ్యాడు. జమాల్ ఖషోగ్గీ అమెరికన్ పత్రిక అయిన వాషింగ్టన్ పోస్ట్ కి రిపోర్టర్. సౌదీ అరేబియాలో జరుగుతున్న అక్రమాలు అంటూ వరుసగా వాషింగ్టన్ పోస్ట్ లో వ్యాసాలు వ్రాశాడు జమాల్ ఖషోగ్గి. దాంతో ఆగ్రహించిన సౌదీ రాజు జమాల్ ఖషోగ్గీ ని చంపమని ఆదేశాలు ఇచ్చాడు. కానీ విషయం తెలుసుకున్న జమాల్ ఖషోగ్గి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నించగా సౌదీ ప్రభుత్వం టర్కీ వెళ్ళడానికి మాత్రమే అనుమతి ఇచ్చింది అప్పట్లో. అయితే టర్కీ రాజధాని ఇస్తాంబుల్ కి వెళ్ళి అక్కడ నుండి అమెరికా వెళ్ళడానికి నిర్ణయించుకొని ఇస్తాంబుల్ వెళ్ళాడు ఖషోగ్గి !
కానీ అమెరికా వెళ్లాలంటే సౌదీ అరేబియా రాయబార కార్యాలయం నుండి స్టాంపింగ్ చేయించుకోవాల్సి ఉంది. దాంతో సౌదీ రాయబార కార్యాలయానికి వెళుతుండగా కొంతమంది ఖషోగ్గి మీద దాడిచేయడానికి ప్రయత్నించడంతో టర్కీ పోలీసుల సహాయం కోరాడు ఖషోగ్గీ… కానీ ఖషోగ్గి ని చంపడానికి వచ్చిన వాళ్ళు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా వెంబడించారు. దాంతో ఖషోగ్గీ దగ్గరలో ఉన్న సౌదీ రాయబార కార్యాలయంలో వెళ్ళాడు. అలాగే అతనిని వెంబడిస్తున్న వారు కూడా సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్లారు. చాలా రోజుల వరకు జమాల్ ఖషోగ్గి శవం కూడా దొరకలేదు . నాలుగు నెలల తరువాత ఖషోగ్గివి అని అనుమానిస్తున్న కొన్ని అవయవాలు సౌదీ రాయబార కార్యాలయ గార్డెన్ లో దొరికాయి. ఏ రాయబార కార్యాలయంలోకి అయినా పోలీసులకి అనుమతి ఉండదు అదే ఏ దేశం అయినా. విచారణ కోసం టర్కీ పోలీసులు సౌదీ రాయబార కార్యాలయంలోని CC కేమేరా దృశ్యాలని కావాలని అడిగినా సదరు రాయబార కార్యాలయ సిబ్బంది తిరస్కరించారు.
***************
జమాల్ ఖషోగ్గి హత్య మీద అప్పట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించాడు కానీ వ్యవహారం పెద్దది కాబట్టి ఆ తరువాత ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉన్నాడు ట్రంప్ ! జమాల్ ఖషోగ్గి హత్య విషయం మీద సాద్ ఇబ్రాహీం అల్మాది ట్విట్టర్ లో వ్యాఖ్య చేశాడు. అది సౌదీ అధికారులు గుర్తు పెట్టుకున్నారు అధికారికంగా కేసు కూడా పెట్టారు కానీ సాద్ ఇబ్రాహీం అల్మాది అమెరికన్ పౌరుడు కాబట్టి అతను సౌదీ ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూశారు రాగానే అభియోగాలు మోపి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
అయితే సాద్ ఇబ్రాహీం అల్మాది విషయంలో సౌదీ రాజు సీరియస్ గా ఉన్నది కేవలం తమ జాతీయుడు తనని విమర్శించాడు అని కాదు కారణం వేరే ఉంది! అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేయగానే అప్పటి వరకు రహస్య ఫైల్స్ లో ఉన్న జమాల్ ఖషోగ్గి హత్య తాలూకు సమాచారాన్ని డీ క్లాసిఫైడ్ చేసి బహిరంగంగానే సౌదీ రాజుని విమర్శించాడు జో బిడెన్ ! జో బిడెన్ అక్కడితో ఆగితే పోయేది కానీ యెమెన్ దేశంలో తిరుగుబాటు దారులని పాశవికంగా చంపించిన విషయాన్ని సిఐఏ నుండి తీసుకొని దానిని కూడా బహిర్గతం చేశాడు. అది అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. సౌదీ రాజు జో బిడెన్ ఆరోపణల మీద ఎలాంటి ప్రతి వ్యాఖ్య చేయడం కానీ లేదా ఇతరత్రా స్పందించడం కానీ చేయలేదు.
*****************
గత జులై నెలలో జో బిడెన్ అధికారికంగా సౌదీ అరేబియా పర్యటనకి వచ్చాడు. అంతకు ముందు సౌదీ పర్యటనకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ కి రెడ్ కార్పెట్ స్వాగతం ఇచ్చాడు సౌదీ రాజు అంతే కాదు తానే స్వయంగా ఎయిర్ పోర్ట్ కి వెళ్ళి స్వాగతం చెప్పాడు. కానీ జో బిడెన్ పర్యటనకి వచ్చినప్పుడు సాధారణ మునిసిపల్ కార్పొరేషన్ అధికారి చేత స్వాగతమ్ చెప్పించాడు సౌదీ రాజు అలాగే సైనిక వందనం స్కిప్ చేశాడు. రెడ్ కార్పెట్ లేదు. తన రాజ సౌధం దగ్గర మాత్రమే జో బిడెన్ కి స్వాగతం పలికాడు సౌదీ రాజు. అమెరికా అధ్యక్షులలో ఎవరికీ ఇలాంటి ఘోర అవమానం జరగలేదు గత 70 ఏళ్లలో !
*************
అమెరికా అధ్యక్షుడిగా సౌదీ పర్యటనకి వచ్చిన జో బిడెన్ తన పని ఏమిటో చూసుకొని వెళ్లిపోవాలి కదా ? అలా చేయలేదు. నేరుగా సౌదీ రాజుతో జమాల్ ఖషోగ్గి హత్య విషయాన్ని ప్రస్తావించాడు. ఇది ప్రోటోకాల్ కి విరుద్ధం ! కానీ సౌదీ రాజు నవ్వుతూనే జో బిడెన్ చేసిన అభియోగాన్ని తిరస్కరించాడు తప్పితే జవాబు చెప్పలేదు.
*************
జులై నెలలో జో బిడెన్ సౌదీ పర్యటనకి వచ్చింది కేవలం క్రూడ్ ఆయిల్ ధరని తగ్గించమని, అదే సమయంలో క్రూడ్ ఉత్పత్తిని పెంచమని అడగడానికి వచ్చాడు. అప్పటికే రష్యా ఉక్రెయిన్ తో యుద్ధంలో తలమునకలుగా ఉంది అన్న సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం ! జో బిడెన్ అమెరికా తిరిగి వెళ్ళగానే వైట్ హౌస్ వర్గాలు సౌదీ రాజు క్రూడ్ ధరని తగ్గిస్తాడని ఆశించారు కానీ అలాంటిది ఏదీ జరగలేదు. క్రూడ్ ఉత్పత్తిని పెంచి సరఫరా మెరుగుపరుస్తాడని ఎదురు చూశారు కానీ సౌదీ రాజు అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు !
****************
సెప్టెంబర్ నెలలో పుతిన్ పూర్తిగా నాచురల్ గ్యాస్ సరఫరా నిలిపివేశాడు యూరోపుకి. అక్టోబర్ 3 న సౌదీ రాజు క్రూడ్ ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు ప్రకటించాడు అలాగే ఒపెక్ దేశాలు కూడా క్రూడ్ ఉత్పత్తిని తగ్గించాలని కోరాడు ! ఒక పక్క నాచురల్ గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్న యూరోపు దేశాలు సౌదీ రాజు ప్రకటనతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. కానీ సౌదీ రాజు ఆసియా దేశాలకి సప్లై చేసే క్రూడ్ ఆయిల్ లో ఎలాంటి అడ్డంకులు ఉండబోవు అని హామీ ఇచ్చాడు ! అంటే తన గురి యూరోపుతో పాటు అమెరికా మీద ఉన్నదనే సంకేతాలని ఇచ్చాడు పరోక్షంగా !
తాజాగా టెక్నికల్ గా అమెరికా పౌరుడు అయిన సాద్ ఇబ్రాహీం అల్మాది కి 16 ఏళ్ల జైలు శిక్ష వేశాడు సౌదీ రాజు ! గత డిసెంబర్ నెల నుండి అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ PRO అయిన వేదాంత్ పటేల్ సౌదీ అధికారులతో తమ పౌరుడు సాద్ ఇబ్రాహీం అల్మాది గురుంచి చర్చలు చేస్తూ వచ్చాడు కానీ సౌదీ అధికారులు వాటిని లెక్క చేయలేదు సరికదా జైలు శిక్ష వేశారు. అమెరికాకి పూచిక పుల్ల విలువ కూడా ఇవ్వటలేదు సౌదీ రాజు !
సాద్ ఇబ్రాహీం అల్మాది కి కనుక వేరే దేశం జైలు శిక్ష వేసినట్లయితే అమెరికన్ అధికారులు తీవ్ర హెచ్చరికలతో పాటు ఆర్ధిక ఆంక్షలు విధించేవాళ్ళు కానీ సౌదీ అరేబియా విషయంలో ఆ పని చేయలేరు. ఎందుకంటే సౌదీ నుండి ఆయిల్ కొనే దేశాలు 75% డాలర్ల రూపంలోనే చెల్లింపులు చేస్తాయి అదే ఆంక్షలు విధిస్తే ? డాలరు విలువ అమాంతంగా పడిపోతుంది !
గత 70 ఏళ్ల అమెరికా సౌదీ దేశాల చరిత్రలో దౌత్యపరమయిన సంబంధాలు ఇంత క్షీణ దశలోకి రావడం ఇదే ప్రధమం ! దీనికి కారణం జో బిడెన్ మరియు అతని యంత్రాంగం బాధ్యత వహించాలి ! అమెరికాని భ్రష్టు పట్టించాలనే ఏకైక ధ్యేయంతో పనిచేస్తున్నారు జో బిడెన్ అతని అధికారులు, సలహాదారులు ! ఒకవైపు పుతిన్ గ్యాస్ సప్లై ఆపేసి దెబ్బ కొడితే ఇప్పుడు సౌదీ రాజు ఏకంగా క్రూడ్ ఉత్పత్తిని తగ్గించి బారెల్ క్రూడ్ ధర మరింత పెరిగే విధంగా చేస్తూ అమెరికా, యూరోపుల ని దారుణంగా అవమానిస్తున్నాడు!
అమెరికా యూరోపు దేశాలకి దిక్కు ఇక వెనుజులా మరియు ఇరాన్ దేశాలు మాత్రమే ! ఈ రెండు దేశాల మీద అమెరికాతో పాటు యూరోపు దేశాలు ఆంక్షలు విధించాయి. ఇరాన్ మీద ఆంక్షలు తొలగిస్తే అది ఇజ్రాయెల్ కి కోపం వస్తుంది కాబట్టి మిగిలింది కమ్యూనిస్ట్ దేశం అయిన వెనిజులా మాత్రమే ! బహుశా వెనిజులా మీద ఆంక్షలు ఎత్తేసి ఆదేశానికి కావాలినవి అన్నీ సప్లై చేసి క్రూడ్ ఉత్పత్తిని పెంచి దానిని వాడుకోవడానికి ప్రయత్నిస్తుంది అమెరికా ! అమెరికా బలహీనపడుతున్నది అన్న దానికి ఇవి బలమయిన సంకేతాలు ! అమెరికాని ఎవరూ హత్య చేయక్కరలేదు జో బిడెన్ అతని సలహాదారులే హత్య చేస్తారు, ఇప్పటికే ఆ పని మొదలుపెట్టేశారు !
Share this Article