Prasen Bellamkonda……. అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్.. నిజమేనా! వెస్టిండీస్ ను చూస్తే మనసు చివుక్కుమనిపిస్తోంది.. నిజానికి ట్వంటి ట్వంటి వాళ్ళ ఓన్ సొంత కప్ ఆఫ్ టీ కదా… వాళ్లకు ఈ ఆట బాయే హాత్ క ఖేల్ కదా.. అసలు వాళ్ళు ప్రాక్టీస్ ఎలా చేస్తారో తెలుసా.. సముద్రపు ఒడ్డున అలల అంచున నిలబడి, బంతిని సముద్రంలోకి కొడతారు… అలలతో బంతి తిరిగొచ్చే వ్యవధిని బట్టి, అది వెళ్లిన దూరాన్ని కొలుస్తారు…. టీ ట్వంటికి కావల్సింది అదే కదా…
అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్.. నిజమేనా గార్డన్ గ్రీనిడ్జ్ కవర్ డ్రయివ్ వేగానికి బంతి వెళ్లే దారిలో దానికింది పచ్చి గడ్డి భగ్గున కాలిపోయేది. రాయ్ ఫెడ్రిక్స్ ఫైన్‌లెగ్ మీంచి చేసే హుక్ సౌందర్యానికి బౌలర్ కూడా ముగ్దుడయేవాడు. వివియన్ రిచర్డ్స్ మాన్లీగా కులుకుతూ స్టేడియంలోకి నడుస్తుంటే లెక్కలేనంత మంది నీనా గుప్తాలు మసాబా గుప్తాలను కలకనేవారు. మాల్కం మార్షల్ బంతి ముక్కు ముందు నుంచి జోరీగ శబ్దం చేసుకుంటూ మెరుపులా వెళ్లడం మాత్రమే చాలా మంది బ్యాట్స్‌మెన్ కు తెలుసు. యాండీ రాబర్ట్స్ వేగం బంతికీ తూటాకూ తేడా చెరిపేసేదట.
ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు.. అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్.. నిజమేనా..? ఈ మధ్య కూడా విండిస్ తక్కువేమీ తినలేదు. గేల్ కొట్టడం రాక్షసత్వానికి నకలే. బ్రావో బ్రేవోనే కదా. హోల్డర్ రికార్డ్ హోల్డరే గా. అయినా.. అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్.. నిజమేనా
Ads
ఏమైందా కసి…
క్లయివ్ లాయిడ్ చూపులకు శాంతానికి నిలువెత్తురూపంగా ఉంటాడా… అతని లోపలి స్పోర్టివ్ క్రూరత్వం ఎనభై మూడు ఫైనల్ లో ఓడిపోయిన తరవాత గానీ భళ్లున బయటపడలేదు. ఈ క్లయివ్ ఫాదర్ థెరెసా అప్పటికే రెండుసార్లు ప్రపంచ కప్పు గెలిచేసుకుని ఉన్నాడు కనుక ముచ్చటగా మూడోసారి కూడా ప్రుడెన్షియల్ ను ఎత్తేసి రిటైరైపోదామనుకున్నాడు. ఆ ఓటమి అతని లోపలి క్రీడా రాక్షసుడిని నిద్రలేపింది.
రిటైర్మెంట్ ఆలోచనను అటకెక్కించాడు. భారత్ టూర్ పెట్టుకున్నాడు. ఆరు టెస్టుల్లో మూడింట్లో ఇండియాను చావచితక్కొట్టాడు. వన్డేల్లో కూడా అదే హింస. వరల్డ్ కప్ హీరో మొహిందర్ ను దాదాపుగా ఎనిమిది సార్లు సున్నా దాటనివ్వలేదు. వాటిలో మూడో నాలుగో పెయిర్స్ ఆఫ్ స్పెక్టికల్స్.
అవమానం సహించలేక భారత క్రికెట్ మతస్థులు గవాస్కర్ మీద రాళ్ల వర్షం కురిపించినపుడు బహుశా లాయిడ్ లోలోపల కసిగా నవ్వుకునే ఉంటాడు. ఒక భారత బాట్స్మన్ అత్యధిక స్కోరు 236 ఈ సిరిస్ లోనే గవాస్కర్ చేసినా అభిమానులు క్షమించలేదు. కపిల్ ఒక ఇన్నింగ్స్ లో 9 వికెట్లు తీసిన ఫీట్ కూడా సిరీస్ ఘోర ఓటమి కింద కప్పెట్టుకుపోయింది.
ఆ విధంగా ప్రతీకారంలో పరాకాష్ట లాయిడ్. అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్.. నిజమేనా? ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు…. నిప్పులు చిమ్ముతూ నింగికి నువ్వెగిరిపోతే నిభిడాశ్చర్యంతో వీరు… నెత్తురు కక్కుతూ నేలకు నువు రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే … అనేది నిజమే కావచ్చు గానీ, నేనైతే విండీస్ నెత్తురు కక్కుతూ నేలరాలడాన్ని నిర్దాక్షిణ్యంగా మాత్రం చూడలేకపోతున్నా… సారీ కరేబియన్స్…
Share this Article