ఈనాడు రామోజీరావుకు పెద్ద దెబ్బ… ఒకరకంగా తన వెన్నువిరిగినట్టే..! తన అప్పాజీ మరణించాడు… ఆయన పేరు ‘‘పెద్ద ఎండీ’’… నిజం, నిత్యవ్యవహారంలో ఆయన హోదా అదే… రామోజీరావు ఛైర్మన్ అయితే, ఆయన ఎండీ… అది ఏ సంస్థయినా అంతే… అంటే అర్థమైందిగా రామోజీ ఆర్థిక సామ్రాజ్యంలో ఆయన కీలక పాత్ర ఏమిటో… ఆయన పేరు అట్లూరి రామ్మోహనరావు…
ఈ వార్త రాసే సమయానికి తన మరణవార్తను ఈనాడు సైట్, న్యూస్ యాప్ కూడా పబ్లిష్ చేయలేదు… లేకపోతే ఆయన వయస్సు, స్వస్థలం గట్రా వివరాలు తెలిసేవి… (ఒకటీరెండేళ్లు అటూఇటూ రామోజీరావు వయస్సు తనది కూడా…) నిజానికి బయట ప్రపంచానికి ఆయన ఎవరో తెలియదు… ఆయన తెర వెనుక రామోజీరావు… ఆయన ఫోటోలు మీకు బయట పెద్దగా దొరకవు… గతంలో ఆయన సైన్స్ మాస్టారు అంటారు…
పని రాక్షసుడు… రామోజీరావు ఎదుగుదల వెనుక ఓ బలమైన ఇరుసు ఈయన… రామోజీరావులాగే వృద్దాప్యం మీద పడింది… కానీ ఆ బుర్ర చివరి వరకూ రామోజీరావు కోసం పనిచేస్తూనే ఉంది… అనారోగ్య కారణాలు ఏమిటో సరిగ్గా తెలియవు కానీ ఎఐజీ హాస్పిటల్‌లో అత్యవసర చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం కన్నుమూశాడు…
Ads
నిజంగానే… రామోజీరావుకు కష్టంలో, సుఖంలో, వైభవంలో, ఆనందంలో… అన్నింటా వెన్నంటే ఉన్నాడు అట్లూరి… ఒక్క ముక్కలో చెప్పాలంటే రామోజీరావు తన వెన్నెముకను కోల్పోయాడు… ఇది రామోజీరావుకు పట్టలేని దుఖమే… రామోజీ గ్రూపుకు పెద్ద దెబ్బే…
ఈనాడు దగ్గర నుంచి రామోజీ ఫిలిమ్ సిటీ విస్తరణ దాకా… ప్రతి అడుగులో అట్లూరి మార్క్ ఉంది… ఆయన ఆలోచన, ఆయన శ్రమ, ఆయన ప్రయాస లేకుండా రామోజీ గ్రూపు లేదు… ఈనాడు ఆర్థిక సామ్రాజ్యంలో పెరిగిన ప్రతి రూపాయి, ప్రతి ఆస్తి వెనుక అట్లూరి ఉన్నాడు… ఈనాడుతో పరిచయం ఉన్న అందరికీ ఆయన ఎంతటి కీలకమైన మనిషో తెలుసు… బయటి జనానికి ఆయన తెలియకపోవచ్చుగాక… రామోజీ గ్రూపుల సంస్థల్లో బోలెడు మంది ఎండీలు ఉండవచ్చుగాక… కానీ ‘‘పెద్ద ఎండీ’’ ఒక్కడే… ఆ ఒక్కడూ ఇప్పుడు లేడు…
విమర్శలు, ఆరోపణలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి… కానీ రామోజీరావు వెనుక తను స్థిరంగా నిలబడిన తీరు ఆశ్చర్యం అనిపిస్తుంది… అనితరసాధ్యంగా ఓ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించడం వెనుక ఆయన పోషించిన పాత్ర అపూర్వం… తన అప్పాజీ మరణం పట్ల రామోజీరావుకు ‘ముచ్చట’ ప్రగాఢ సంతాపం… సద్గతిప్రాప్తిరస్తు…
అప్‌డేషన్ :: అట్లూరి రామ్మోహనరావుది కృష్ణా జిల్లా, పెద్ద పారుపూడి… పుట్టింది 1935… రామోజీరావు బాల్యస్నేహితుడు, క్లాస్‌మేట్… 1975 లో రామోజీరావు పిలవగానే వచ్చి ఈనాడు గ్రూపుతో జాయినయ్యాడు… ఆరోజు నుంచీ తనను అంటిపెట్టుకునే ఉన్నాడు… (వయోభారం, అనారోగ్యం కారణాలతో కొన్నిరోజుల క్రితమే అట్లూరి అధికారికంగా అన్ని హోదాల నుంచి బయటికి వచ్చేసినట్టు సమాచారం…)
Share this Article