మనవాడు… అంటే..? మన కులం వాడా..? మన రాష్ట్రం వాడా..? మన గోత్రీకుడా..? ఎవరు మనవాడు..? మనవాడు బ్రిటన్ ప్రధాని అవుతున్నాడు అని కన్‌ఫరమ్ అయ్యేసరికి ఇక అందరూ మన సహజమైన అలవాటుకొద్దీ కులగోత్రాల అన్వేషణలో పడ్డారు… అక్కడికి తనకేదే పిల్లనిస్తున్నట్టు..! తను ప్రాక్టీసింగ్ హిందూ… అంటే ఆచరణాత్మక హిందువు… చివరకు పార్లమెంటులో ప్రమాణస్వీకారం కూడా భగవద్గీత సాక్షిగా చేశాడు… అంత ఆస్తికుడు… తన రూట్స్ మరిచిపోనివాడు… పేరు రిషి సునాక్…
తల్లి, తండ్రి పేర్లు కూడా ఏమీ మారలేదు… తండ్రి పేరు యశ్‌వీర్… తల్లి పేరు ఉష… వాళ్లిద్దరూ తూర్పు ఆఫ్రికా దేశాల్లో పుట్టి బ్రిటన్ చేరుకున్నారు… ఆయన ఓ చిన్న డాక్టర్… ఆమె ఓ ఫార్మసిస్ట్… రిషి సునాక్ కూడా తన పిల్లలకు కృష్ణ, అనౌష్క అని పేర్లు పెట్టుకున్నాడు… బ్రదర్ సంజయ్ ఓ సైకాలజిస్ట్… సిస్టర్ రాఖీ స్ట్రాటజీ ప్లానింగ్ శాఖలో ఉద్యోగి… రిషి ఆహార అలవాట్ల గురించి కూడా నెటిజనులు సెర్చ్ చేస్తున్నారు… తను బీఫ్ తీసుకోడు… ఆల్కహాల్ తీసుకోడు… వారంలో ఒకటీరెండుసార్లు ఉపవాసం ఉంటాడు… వీలుకాకపోతే ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ చేస్తాడు… (నిర్ణీత గంటలపాటు ఆహారం తీసుకోకపోవడం)…
కులం అంటారా..? కొందరేమో పంజాబీ ఖత్రి (క్షత్రియ) అంటారు… మరికొందరేమో పండిట్లు అంటారు… తన భార్య అక్షత మూర్తి, వాళ్ల కుటుంబం మాత్రం బ్రాహ్మిణ్… ఇవన్నీ సరే, తన మీద వివాదాలు లేవా..? ఎందుకు లేవు…? వేరే దిక్కులేక రిషిని కుర్చీ ఎక్కిస్తున్నారు గానీ, అంత మనస్పూర్తిగా ఏమీ తనను ప్రధానిని చేయడం లేదు ఎంపీలు… అంతకుముందు రిషిని పక్కకుతోసేసి, లిజ్ ట్రస్‌ను ఎన్నుకుంటే ఆమె తుస్సు అనిపించింది… దాంతో రిషిని పిలిచి కుర్చీ ఇస్తున్నారు ఇప్పుడు…
Ads
జస్ట్, 42 ఏళ్ల వయస్సులో బ్రిటన్ ప్రధాని కావడం అరుదైన విశేషమే… అయితే 2009లో అక్షత మూర్తిని పెళ్లి చేసుకుంటే ఆమె ఇప్పటికీ ఇండియా పౌరసత్వాన్ని వదులుకోలేదు… నాన్- డొమిసైల్ హోదా పేరుతో, టాక్స్ ఎగవేత కోసమే ఆమె భారతీయ పౌరసత్వాన్ని కొనసాగిస్తున్నదని ఓ బలమైన విమర్శ… మొన్న ఈ విమర్శలు వచ్చినప్పుడు ప్రపంచదేశాల్లో ఎలా టాక్స్ కడుతున్నామో బ్రిటన్‌లోనూ అలాగే కడతానని ప్రకటించింది ఆమె…
ఒకసారి ఎప్పుడో రిషి ‘నాకున్న ఫ్రెండ్స్ అందరూ ధనికులు, అప్పర్ క్లాస్, అరిస్టోక్రాట్స్… వర్కింగ్ క్లాస్ తక్కువ’ అని వ్యాఖ్యానించాడు… అది విమర్శలకు గురైంది… ‘నా భార్య, నా పిల్లలు, నా ఆరోగ్య స్థితిగతులను బట్టి మా ఇంట్లో చాలారకాల బ్రెడ్స్ ఉంటాయి’ అని మరోచోట వ్యాఖ్య చేశాడు… అదీ విమర్శలకు గురైంది… ఉక్రెయిన్ యుద్ధం స్టార్టయ్యాక బ్రిటన్ కంపెనీలను రష్యాలో యాక్టివిటీస్ ఆపేయాలని కోరింది ప్రభుత్వం… కానీ ఇన్ఫోసిస్ ఆపలేదు… అది ఇండియన్ కంపెనీయే కానీ అందులో రిషి భార్య వాటా ఉంది కదా… అదీ విమర్శలపాలైంది…
ఆమె సంపద, రిషి సంపద కలిసి దాదాపు 750 మిలియన్ పౌండ్ల దాకా ఉంటుంది… నాలుగు ఇళ్లు… నాలుగు వాహనాలు… అందులో ఒకటి 12 ఎకరాల మ్యాన్షన్… ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ కడుతున్నాడు అక్కడ… ఆల్‌రెడీ అక్కడ ఓ లేక్‌లో బోటింగ్ ఏర్పాటు కూడా చేసుకున్నాడు… ఆడంబర జీవితాన్ని రిషి ఎప్పుడూ దాచుకునే ప్రయత్నం చేయలేదు… నారాయణమూర్తి అల్లుడికి దరిద్రమేమిటి..? తను ఉండేది కూడా నాలుగు అంతస్థులుండే అయిదు బెడ్రూముల ఇల్లు… సహజంగానే ఇవన్నీ చర్చకు వచ్చాయి… కానీ చివరకు ఆ మొగుడే దిక్కయ్యాడు ఆ దేశానికి..!!
Share this Article