Bharadwaja Rangavajhala….. డెబ్బై దశకంలో తమిళ తెరను వెలిగించిన దర్శకుల్లో మహేంద్రన్ ఒకరు. ఆయన తీసిన చాలా సినిమాలు తెలుగులో అనువాదమై అలరించాయి. ఆయన చిత్రాల్లో కథలు చాలా వాస్తవికంగా ఉంటాయి. సహజత్వం దెబ్బతినకుండా ఎంటర్ టైనింగ్ గా కథ చెప్పడం ఆయన ప్రత్యేకత.
దృశ్యం పొయిటిక్ గా ఉండేలా చూసుకునేవారు. గొప్ప భావుకుడు. ఆయన అసలు పేరు అలగ్జాండర్ . తెర పేరు మహేంద్రన్. శివాజీ తంగపతకం కథ ఆయనదే! కమర్షియల్ సినిమాని ఆర్ట్ సినిమా పద్దతిలో చూపించడం అనే గొప్ప సమన్వయాన్ని సాధించి బాపు, మణిరత్నం అనే ఇద్దరు దర్శకులకు ఆదర్శం అయ్యారాయన.
రచయితగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన మహేంద్రన్ ఆనక దర్శకుడై ముల్లుం మలరుం తీశారు. ఆ సినిమాకు ఇళయరాజా, వైద్యనాధన్ కలిసి సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగులో ముల్లు పువ్వుగా అనువాదమయ్యింది. బెజవాడ శాంతి థియేటర్ లో చూశాన్నేనా సినిమా. రాముడు రాజైనా రావణుడు రాజైనా మన కథ మారదురా అంటూ ఓ సూపర్ సాంగుంటుందా సినిమాలో. అది నాకు చాలా ఇష్టం.
Ads
అందాల మొలకా బంగారు చిలుకా అంటూ మరో గీతం వినిపిస్తుంది. ఆ తర్వాత మహేంద్రన్ తీసిన ఓ తమిళ సినిమా తెలుగులో క్రియేటివ్ కమర్షియల్స్ కె.ఎస్ రామారావు డబ్ చేసి రిలీజ్ చేశారు. ఆ సినిమా పేరు మౌనగీతం. బెజవాడ అప్సర థియేటర్ లో గజదొంగ సినిమా టైమ్ లో ఈ సినిమా ట్రైలరు వేసేవారు. మేం ఆ టేకింగుకు ఆశ్చర్యపోయేవాళ్లం.
ముఖ్యంగా పరువమా చిలిపి పరుగు తీయకూ పాట మనసులకు అలా పట్టేసుకుంది. ఆ సిన్మా చూసి పొద్దున్నే జాగింగ్ చేయడం ప్రారంభం చేసిన వాళ్ళు నాకు తెల్సు. అదే సినిమాలో మరో ప్రయోగం జరిగింది. పాపా పేరు మల్లి, నా పేరు కొత్త ఢిల్లీ అంటూ వచ్చే పాటలో ఓ పద్నాలుగేళ్ల కుర్రాడి పాట ఉంది. ఆ పాట జానకి పాడారని చెబ్తే తప్ప ఎవరూ కనిపెట్టలేరు. అచ్చు పద్నాలుగు పదిహేను సంవత్సరాల కుర్రాడి వాయిస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందా పాట.
మహేంద్రన్ కెరీర్ లో తీసింది మొత్తం 26 సినిమాలు. వాటిలో నందు ఒకటి. నందు సినిమాలో తెలుగు హీరో రాజేంద్ర ప్రసాద్ కూడా ఓ పాత్ర చేశారు. ఆ సినిమాకీ ఇళయరాజానే సంగీతం అందించారు. ఇందులో అన్ని పాటలూ ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ రాయగా ఓ పాట మాత్రం నేపధ్యగాయకుడు పి.బి.శ్రీనివాస్ రాశారు. పి.బి.ఎస్ రాశారంటేనే అందులో ఏదో ప్రత్యేకత ఉందని అర్ధమైపోతోంది కదా … అదేంటంటే అది హిందీ పాట.
తమిళ సినిమాలో హిందీ పాట అనగానే పి.బి.ఎస్ ని పిల్చేవాళ్లు అని అర్ధమైపోతుంది ఈ సినిమా చూస్తే . అంతకు ముందు బాలచందర్ తీసిన ఆకలి రాజ్యంలోనూ తూహే రాజా మైహూ రాణీ పాట పి.బి శ్రీనివాస్ తోనే రాయించుకున్నారు. కాకపొతే ఆకలి రాజ్యానికి ఎమ్మెస్వీ సంగీత దర్శకుడు. నందు కోసం పి.బి.ఎస్ రాసిన ఆ హిందీ పాటను ఇళయరాజా చాలా ప్రత్యేకంగా స్వరపరచారు.
కైసె కహూ కుచ్ కెహన సఖూ… ఇలా నడిచే ఆ గీతాన్ని భూపేందర్ , జానకి పాడారు. ఏం పాటండీ … ఏం పాట.. ఇంకా ఎన్నో మహేంద్రన్ గురించి రాయాలనుందిగానీ … ఇప్పటికైతే ఈ పాట వినిపించడమే నా లక్ష్యం. ఈ పాట లింకు ఫేసుబుక్కులో నా మిత్రులందరికీ ఇచ్చి వినిపించి ఆనందపరచాలనుకోవడంతో మొదలై ఇంత రాసేశాను. సారీ … పాట వినేయండి … https://www.youtube.com/watch?v=h8JVBMZ7_to
Share this Article