ఈరోజు వార్తల్లో ఆసక్తిగా అనిపించిందీ, జగన్‌ను చూస్తే జాలేసిందీ ఓ వార్త ఉంది… అదేమిటంటే..? రాంగోపాలవర్మ అనే ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు జగన్మోహన్‌రెడ్డి బయోపిక్ తీయబోతున్నాడట… తాడేపల్లికి వెళ్లి, జగన్‌తో భేటీ వేసి, సినిమా బడ్జెట్, కథ కమామిషూ మాట్లాడి, మీడియాకు చిక్కకుండా వెళ్లిపోయాడట… సినిమా పేరు జగన్నాథ రథచక్రాలు అట… వచ్చే ఎన్నికల్లో లబ్ది కోసం ఈ సినిమా ఉపయోగపడాలట… ఇన్ని ‘ట’లు ఎందుకంటే..? ఇవేవీ ధ్రువీకరించబడిన వార్తలు కావు కాబట్టి… ఇప్పుడప్పుడే ఎవరూ దీని మీద మాట్లాడరు కాబట్టి…
అసలు అతి పెద్ద హాశ్చర్యం ఏమిటంటే..? తన బయోపిక్ తనే సంకల్పించడం ఏమిటి..? సినిమాలు చూసి జనం వోట్లు వేస్తారని భావించడం ఏమిటి..? కొంపదీసి, ఆ సినిమాను ప్రతి ఊరిలోనూ ప్రత్యేక టెంట్లు వేసి ప్రదర్శిస్తారా ఏం..? ఇవి కాదు ఆశ్చర్యం కలిగించినవి… అప్పుడప్పుడూ జగన్ తీసుకునే నిర్ణయాలు అలాగే ఉంటాయి కానీ తన బయోపిక్ కోసం రాంగోపాలవర్మను ఎంచుకోవడం…!
వందల మంది సలహాదార్లు ఉన్నా సరే, జగన్ సాధారణంగా ఎవరు చెప్పినా వినడు, తన నిర్ణయమే ఫైనల్… మరి ఈ బయోపిక్ తీయించాలనే ఆలోచన ఎలా వచ్చింది..? వచ్చెనుపో, దాంతో ఎన్నికల లబ్ధి ఎలా కలుగును..? కలుగునుపో, వర్మతో తీయించడం ఏమిటి..? అసలు ఎవరైనా తన చుట్టూ ఉన్నవాళ్లు ధైర్యంగా జగన్‌ను కుర్చీలో కదలకుండా చేసి, వర్మ ఇటీవల కొండా మురళి మీద తీసిన బయోపిక్ చూపిస్తే బాగుండునేమో… పావుగంట చూసేసరికి కళ్లు తేలవేసి, నాలుగురోజులు లేవకపోయేవాడు…
Ads
అంతెందుకు సినిమా కంటెంట్, ప్రజెంటేషన్ ఎట్సెట్రా పక్కనపెట్టండి… వర్మ సినిమా రిలీజుకు ముందు వేసే వేషాలు చాలు, ఆ సినిమా మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడానికి..! వంచనగిరిలో మైసమ్మ అమ్మవారికి మందు తాపించి వార్తల్లోకి ఎక్కాడు వర్మ… ఇంకా అలాంటి వేషాలు బోలెడు… అసలు ఇప్పుడు వర్మలో దర్శకుడు ఎక్కడున్నాడు..? జగన్‌కు కలవచ్చిందా..? ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత నాసిరకం దర్శకుడు ఎవరయ్యా అంటే …. రాంగోపాలవర్మ… ఫాఫం జగన్…
ఆ నిర్మాతలు ఎవరో, వాళ్ల పేర్లు ఏమిటో నాకు తెలియవు గానీ…. వైఎస్ పాదయాత్ర మీద యాత్ర పేరుతో ఓ సినిమా తీశారు… మమ్ముట్టిని తీసుకొచ్చి హుందాగా నటింపజేశారు… సినిమా మొత్తం గంభీరమైన నోట్‌లో, రాజకీయంగా ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా, చూసేవాళ్లకు కూడా గౌరవం కలిగేలా తీశారు… సినిమా నాలుగురోజులు నడిచి నాలుగు డబ్బులు కూడా వచ్చినట్టున్నాయి… పైగా వాళ్లు జగన్ అభిమానగణం…
మరి వాళ్లను పక్కకు తోసేసి, ఈ వర్మ ఎలా వచ్చాడు తెర మీదకు..? వర్మకు పొలిటికల్ కమిట్‌మెంట్స్ ఏమీ ఉండవు… తనకు చంద్రబాబు అయినా ఒకటే, జగన్ అయినా ఒకటే… వీలైనంత చెత్త బయోపిక్ తీయడం, రిలీజ్ చేయడం… మరి ఏ కోణంలో వర్మ జగన్ బయోపిక్‌కు అర్హుడయ్యాడు..? సినిమా రిలీజైన తెల్లవారే జగన్‌ను తిట్టిపోసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు… ఇదంతా జగన్‌కు రాజకీయంగా ఎలా ఉపయోగపడుతుంది..? తెలుగునాట ఏక్‌సేఏక్ కొత్త క్రియేటివ్ దర్శకులొస్తున్నారు… ఒక్కడూ కనబడలేదా..? తనకు తెలియకపోతే ఎవరినైనా అడిగితే తప్పేమిటి..?!
.
వ్యూహం, శపథం పేర్లతో రెండు భాగాల రియల్ బయోపిక్ తీస్తున్నట్లు వర్మ గురువారం ట్వీట్స్ చేశాడు… :: Updation
Share this Article