జాగ్రత్తగా గమనిస్తే… చాలామంది సీనియర్ పాత్రికేయులు సైతం ‘‘నిజంగానే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనడానికి ప్రయత్నించింది, కేసీయార్ దాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాడు కానీ… ఆ ఆడియో క్లిప్పులు నిజమే… వీడియోలు కూడా బయటికొస్తాయి’’ అని నమ్ముతున్నారు… దొంగకోళ్లు పట్టుకునే బ్యాచ్‌లా కనిపిస్తున్న సదరు మధ్యవర్తులు ఎవరు అసలు..? వాళ్లు ఏది చెబితే అది అల్టిమేటా..? అసలు వాళ్ల వెనుక ఉన్నదెవరు..? వాళ్ల లక్ష్యమేమిటి..? ఎవరినిపడితే వాళ్లను ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ఎంగేజ్ చేస్తుందా..? ఇవి కదా తేలాల్సింది…
పాత్రికేయం సగటు మనిషికి భిన్నమైన కోణాల్లో ప్రశ్నలు వేసుకోవాలి… ఇక్కడ అది లోపించింది… నలుగురిని కొనేస్తే తెలంగాణ ప్రభుత్వం పడిపోతుందా..? అసలు వాళ్లకు ఆ కొనుగోళ్ల బాధ్యత ఇచ్చిందెవరు..? నిజంగా ఇవ్వబడిందా..? పార్టీలో చేరికలు వేరు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు వేరు… తేడా ఉంది… కేసీయార్ సర్కారును కూలదోయాలంటే ఎందరిని కొనాలి..? ఇప్పుడు ఆ అవసరం బీజేపీకి ఏముంది..? చివరకు భిన్నంగా ఆలోచించి, విశ్లేషిస్తాడు అనుకున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు నిజమే గానీ, చంద్రబాబు వోటుకునోటు కేసులో చేసినంత రచ్చ చేయలేకపోయాడు కేసీయార్ అని రాసుకొచ్చాడు… సాక్షిలో ఎడిటర్ మురళి రాసిన వ్యాసం రాధాకృష్ణ వ్యాసంకన్నా చాలా బెటర్… పైగా తొలిసారి జగన్ డప్పులేని ప్యూర్ ఎడిటోరియల్ వ్యాసం ఇది… ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో చాలా పాయింట్స్ టచ్ చేశాడు…
ఓ భిన్నమైన కోణంలోకి వెళ్దాం… బీజేపీ ఈ పాపకార్యంలో తమకు భాగం లేదని యాదాద్రి దగ్గర పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడితో ప్రమాణం చేయించింది… హైకోర్టు జడ్జి లేదా సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టును ఆశ్రయించింది… దీనిపై విచారణ జరపాలని ఈడీని కోరింది… దిక్కుమాలిన స్కెచ్ వేసి బీజేపీని బదనాం చేసే కుట్రకు స్క్రీన్‌ప్లే, కథ, దర్శకత్వం అన్నీ కేసీయారేనని పొలిటికల్‌గా ఎదురుదాడి చేస్తోంది… కానీ టీఆర్ఎస్..?
Ads
అక్కడ వందల కోట్ల డబ్బు అన్నారు… రూపాయి దొరకలేదు… ఆ మధ్యవర్తులెవరో రాష్ట్రంలో ఎవడికీ తెలియదు… వాళ్లు సమాచారం ఇచ్చారట, పోలీసులు వెళ్లి ఆపరేషన్ భగ్నం చేశారట… నిజానికి ఆడియోల్లోకి, వీడియోల్లోకి ఎవరినో ట్రాప్ చేయాలనే ఫామ్ హౌజు వద్ద జరిగింది… అదేమిటో తేలాల్సి ఉంది… తేలాలంటే బెటర్ మార్గం, ఉపా కేసు పెట్టి (ప్రభుత్వాన్ని కూల్చాలనే రాజద్రోహం చాలా పెద్ద నేరం కదా..) ఎమ్మెల్యేలు సహా ఆ ముగ్గురు నిందితులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవడం… అది జరుగుతుందా..?
కేసీయార్ వీడియో ఆధారాల ప్రెస్ మీట్ అన్నారు, జరగలేదు… ఢిల్లీ వెళ్లి బీజేపీ వాళ్ల బట్టలు విప్పబోతున్నాడు అని లీకులు ఇచ్చారు, జరగలేదు… ఆడియోలు కూడా అనధికారిక లీకులే… తీరా చూస్తే వాటిల్లో పెద్ద సీన్ ఏమీ లేదు… తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ మీద నిరసన ప్రదర్శనలు జరిపిన టీఆర్ఎస్ కేడర్ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది… కేటీయారే ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్ చేశాడు… జాతీయ మీడియా లైట్ తీసుకుంది… జాతీయ స్థాయిలో ఒక్క లీడర్ కూడా స్పందించలేదు… నిల్ రెస్పాన్స్… ఆడియోలను జనం నమ్మడం లేదు… సో, ఏ కోణంలో చూసినా బీజేపీని దోషిగా నిలబెట్టలేకపోయింది టీఆర్ఎస్…
బీజేపీ పెద్ద శుద్ధపూస అనేమీ కాదు… కానీ ఇక్కడ కేసు వేరుగా చూడాలి… బీజేపీ పెద్దల్ని ఎక్కడ ఫిక్స్ చేద్దామా అని కేసీయార్ చూస్తున్నాడు, ప్లాన్లు వేస్తున్నాడు… కానీ స్కెచ్, స్క్రీన్ ప్లే ఎక్కడో తేడా కొట్టింది… అసలు సినిమా ముందుంది, వీడియోలు రానున్నాయి అంటున్నారు… నిజంగా బీజేపీని బజారులో నిలబెట్టేలా అలా పక్కా ఆధారాల్ని గనుక చూపగలిగితే అది ఇంకా బెటర్… ఇష్టారాజ్యంగా ప్రజాప్రతినిధుల్ని కొని ప్రభుత్వాల్ని మార్చే బీజేపీని కాస్తయినా డిఫెన్సులో పడేయవచ్చు…
కానీ తెలంగాణలో ఈ కోణంలో మొదటి నుంచీ దోషి కేసీయారే… ఎడాపెడా విపక్ష ప్రజాప్రతినిధుల్ని ప్రలోభాలతో లాగేయడం, పార్టీలనే విలీనం చేసేసుకోవడం… అసలు ఈ నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు అలాంటివాళ్లే కదా… ఇక ఈ మొత్తం ఎపిసోడ్‌తో టీఆర్ఎస్‌కు దక్కిన పొలిటికల్ ఫాయిదా ఎంత..? అదీ అసలు ప్రశ్న..!! అసలు టీఆర్ఎస్‌లోనే అసంతృప్తి జ్వాలలున్నాయా..? ధిక్కార ధోరణులు పెరుగుతున్నాయా..? వాళ్లకు కళ్లెం వేయడంతోపాటు బీజేపీని కౌంటర్ చేసే మాస్టర్ స్కెచ్ గీయబడిందా..? కానీ సుతిలి బాంబు అనుకున్నది తోకపటాకులా తుస్సుమందా..?! కేటీయార్ చెబుతున్నట్టు… నిజంగానే ‘‘అసలు సినిమా ముందుందా..?’’ కేసీయార్ సినిమా చూపించబోతున్నాడా..?! అసలు ఢిల్లీ స్పందన ఏమిటి…? ఇన్నాళ్ల క్రియారాహిత్యం ఇకపై కూడా కొనసాగుతుందా..?
Share this Article