కేసీయార్ ఇంత చెలరేగిపోతున్నాడు, బట్టలిప్పుతున్నడు, బట్టకాల్చి మీదేస్తున్నడు, బజారుకు గుంజుతున్నడు… ఐనా ఢిల్లీ బీజేపీ నుంచి రియాక్షన్ లేదు, భయపడుతున్నరా..? ఇందిరమ్మే ఉండి ఉంటే, రెండు నిమిషాల్లో ఖతం చేసేది సర్కారును…… అని చెప్పుకుంటూ పోతున్నాడు ఓ మిత్రుడు… సరే, మనం ఇప్పుడు ఆ చర్చలోకి వెళ్లడం లేదు గానీ… బీజేపీ నిజంగా గవర్నర్లను ముందుపెట్టి, దూకుడుగా రాష్ట్ర ప్రభుత్వాల మీదకు పోతోందా..? రాజకీయ ప్రత్యర్థుల ప్రభుత్వాల్ని కుట్రలు పన్ని కూల్చేస్తోందా..?
అంత సీన్ లేదు… అదొక డిఫరెంట్ రాజకీయం… మమత, మోడీ మొన్నటిదాకా ఉప్పునిప్పు… ఇప్పుడు మమత, మోడీ భాయీబెహన్… మొన్నటిదాకా రోజుకోరకంగా పరాభవించిన తమ గవర్నర్‌ను ఉపరాష్ట్రపతిని చేసింది… పోనీ, చేయడానికి సహకరించింది… కొన్ని సానుకూలతల కోసం బీజేపీ నిరీక్షిస్తూ ఉంటుంది… అంతే… ఇంకో ఉదాహరణ చెప్పాలా..? జార్ఖండ్…
హేమంత్ సోరెన్… తనే సొంతంగా మైన్స్ కేటాయించుకున్న ఓ వివాదంలో ఎన్నికల సంఘమే తనపై అనర్హత వేటు వేయవచ్చునని గవర్నర్‌కు సూచించింది… అధికారికంగా… ఒకసారి ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని చెప్పిందంటే దానికి కొంత విలువ ఉంటుంది కదా… ఆ రిపోర్టు అందిన వెంటనే ఇక గవర్నర్ రమేష్ బయాస్ హేమంత్‌పై వేటు వేస్తాడనీ, ఇక హేమంత్ భార్య కల్పన సోరెన్ ముఖ్యమంత్రి అయినట్టేననీ, ఏమో, అలా జరగడం ఇష్టం లేకపోతే జార్ఖండ్ ముక్తిమోర్చాలోనే ముసలం పుట్టవచ్చునని ఊహాగానాలు కూడా బోలెడు వినవచ్చాయి…
Ads
హేమంత్ రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వడం వేరే సంగతి… అది తన అవసరం మేరకు, విధిలేక, పొలిటికల్ నెసెసిటీగా తీసుకున్న నిర్ణయం… ఐతే ఆ గవర్నర్ ఎన్నికల సంఘం పంపిన రిపోర్టును కత్తిలాగా చేతిలో పట్టుకుని తిరుగుతాడు తప్ప ఏమీ చేయడు… ఎందుకంటే కేంద్రం నుంచి ఏ నిర్ణయమూ లేదు… ఏం చేయాలో వాళ్లకూ తోచడం లేదు… (జేఎంఎం ఎమ్మెల్యేలను కొనేస్తే పాయె అంటారా..? అదేమైనా తెలంగాణా కాదుగా, నలుగురేసి ఎమ్మేల్యేలు గ్రూపులుగా, బ్యాచులుగా రెడీ అయిపోవడానికి…?)
ఆగస్టు 25… ఇప్పుడు అక్టోబరు 30… ఐనా గవర్నర్ నుంచి ఏ చర్యా లేదు… ప్రభుత్వం సాఫీగా సాగిపోతోంది… మొన్న ఓ ప్రైవేటు చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ గవర్నర్ ‘‘రాష్ట్రంలో అణుబాంబు ఎప్పుడైనా పేలొచ్చు, ఢిల్లీలో బాణాసంచా మీద నిషేధం ఉంది తప్ప జార్ఖండ్‌లో లేదుగా’’ అన్నాడు నవ్వుతూ… విషయం ఏమిటీ అంటే… ఆయన ఎన్నికల సంఘం నుంచి సెకండ్ ఒపీనియన్ అడిగాడట, అది రాగానే యాక్షన్ మోడ్‌లోకి దిగిపోతాడట…
నవ్వొచ్చే విషయం ఏమిటంటే… వేరే వాళ్లను ఒపీనియన్ అడిగితే అది సెకండ్ ఒపీనియన్ అందాం… ఎన్నికల సంఘాన్నే మళ్లీ రిపోర్టు అడిగితే అది సెకండ్ ఒపీనియన్ అంటామా..? ‘‘మళ్లీ చెప్పండి’’ అని అడిగినట్టు అర్థం చేసుకోవాలా..? ఇదేం ప్రొసీజర్..? ఎన్నికల సంఘం ఎలాగూ ‘‘నో, నో, మా మొదటి రిపోర్టు పక్కన పెట్టేయండి, హేమంత్‌కే మా మద్దతు’’ అనలేదు కదా… మరి ఈ సెకండ్ ఒపీనియన్ కథ ఏమిటి..?
ఎవరికీ అర్థం కానిది అదే… అసలు విషయం కూడా అదే… ప్రస్తుతానికి హేమంత్ జోలికి పోదల్చుకోలేదు… జేఎంఎంలో కుంపట్లు రగిలించదలుచుకోలేదు… అలా టైంపాస్ చేస్తోంది… అంతే… మరి తెలంగాణలో అంటారా..? ఏడాదిగా బీజేపీని రోజూ గోకుతున్నాడు కేసీయార్… నిన్నామొన్నా రక్తగాయాలయ్యేట్టు గోకాడు… ఏం చేస్తారు..? ఏం చేయగలరు..? జార్ఖండ్‌లాగే తెలంగాణ..!!
Share this Article