.
ఇందిరాగాంధీని విమర్శించడానికి వంద కారణాలు కనిపిస్తాయి… అదేసమయంలో చప్పట్లు కొట్టడానికి కూడా వేయి కారణాలు కనిపిస్తాయి… అందులో ఒకటి ప్రధానమైంది తలవంచుకోకపోవడం… ఎంతటి గడ్డు పరిస్థితినైనా ఎదుర్కునే ధీరత్వం… ఒంటరిగానే కురుక్షేత్ర యుద్ధం చేయగల సాహసం…
ఎస్, ఆ టెంపర్‌మెంట్ ఉంది కాబట్టే అప్పటి అమెరికా అధ్యక్షుడిని కూడా ఫోఫోవోయ్ అనేసింది… పగబట్టిన పాకిస్థాన్‌ను నిలువునా చీల్చింది… దేనికైనా రెడీ అని ప్రకటించి మరీ అణుపరీక్షలు చేసింది… ఆమె ఫైటర్… ఇప్పుడు పలు పార్టీల్లో ఉన్న బడా కుక్కమూతి పిందెలకు ఆమె ఫైటింగ్ టెక్నిక్స్ తెలియవు… అసలు ఇవి కావు, నిజంగా ఇందిరను మెచ్చుకోవాల్సింది ఆమె జనంలోకి వెళ్లే తీరు…
Ads
ఎమర్జెన్సీతో దేశవ్యాప్తంగా ఆమె మీద విమర్శలు… తప్పు చేశాననే ఆత్మమథనం జరిగిందో లేదో గానీ… అధికారం కోల్పోయాక ఆవరించిన అంధకారాన్ని తనే తరిమేసుకుంది… ఎవరి సాయమూ అక్కర్లేదు… జనంలోకి ఆమె వెళ్లిందో, తన బట్టలపై పడిన ఎమర్జెన్సీ బురదను జనం ప్రేమతోనే ఎలా కడుక్కుందో తెలియాలంటే, కొందరి, కొన్ని అనుభవాలు చదవాలి…
‘‘1975 ఎమర్జెన్సీ తరువాత ఎన్నికల్లో ఆమె చిత్తుచిత్తుగా ఓడిపోయింది… అతుకులబొంత సర్కారు ఏర్పడింది… సొంత పార్టీలోనూ ఆమెను అందరూ దూరం ఉంచేవాళ్లు… అతిరథమహారథులందరూ ఆమెతో మాట్లాడేవాళ్లు కాదు… చివరకు ఎమర్జెన్సీకి సమర్థించిన జలగం వెంగళరావు, బ్రహ్మానందరెడ్డిలతో సహా… కురుక్షేత్రంలో అందరినీ కోల్పోయిన సుయోధనుడిలా మిగిలింది ఆమె… దేశరాజకీయాల్లో ఆమె కథ క్లోజ్ అన్నారు అందరూ… ఆవుదూడ గుర్తును కూడా బ్రహ్మానందరెడ్డి తన దొడ్లో కట్టేసుకున్నాడు…
అప్పుడు ఇందిర కదిలింది… వెంట ఎవరూ ఉండేవారు కాదు… జస్ట్, ఆమెలోని మొండితనం, ధైర్యమే ఆమెకు తోడు… ఇంట్లో కూర్చుని, చీకటిని తిడుతూ కాలం గడపలేదు… విస్తృతంగా పర్యటనలు చేసేది… వెంట పదిమంది కూడా ఉండేవారు కాదు… ఓరోజు మంగళగిరికి వచ్చింది ఆమె… ఓ గన్‌మ్యాన్, తోడుగా స్థానికుడు గోలి వీరాంజనేయులు అనే ఓ ఛోటా లీడర్…
కొన్ని ఇళ్లల్లోకి నేరుగా వెళ్లేది… ‘‘నేను ఇందిరాగాంధీని… మిమ్మల్ని కలవడానికి వచ్చాను’’ అనేది… నాయబ్ సాబ్ గల్లీలో ఓ ముస్లిం ఇంటికి వెళ్లినప్పుడు నేనూ వెంట వెళ్లాను… ఆరు బయట నులక మంచం వేసి ఉంది… ఇందిర దానిపై కూర్చుంది… ఇంతలో ఇంట్లోవాళ్లు బయటికి వచ్చారు… ‘‘మై అందర్ ఆసక్‌తీ హూ’’ (నేను లోపలకు రావచ్చా..?) అనడిగింది… రండమ్మా, రండి అని లోపలకు తీసుకుపోయారు వాళ్లు… ‘‘తినడానికి ఏమైనా ఉందా..?’’ అందామె…
తడబడుతూనే వాళ్లు కూర సట్టి (గిన్నె) చూపించారు… చెంచాతో కాస్త కూర నోట్లో వేసుకుంది… రోజూ ఏం తింటున్నారు..? ఎలా ఉంటున్నారు..? ప్రభుత్వ సాయం, పథకాలు అందుతున్నాయా..? అనడిగింది… నాకైతే కళ్లు చెమర్చాయి… నెహ్రూ బిడ్డగా, ఈ దేశ యువరాణిలా సకలసౌఖ్యాలు అనుభవించిన ఆమె ఇలా రోడ్లెక్కిన తీరు బాధగా అనిపించినా… ఇంతగా ప్రజలతో ములాఖత్ కావడం బాగా నచ్చింది… ఆ తరువాత ఏం జరిగింది..? ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు… ఇందిర విజయేందిర అయ్యింది…
ఆ ఎన్నికల్లో తనను నమ్మినవాళ్లందరికీ టికెట్లు ఇచ్చింది… ఈ గోలి వీరాంజనేయులు కూడా ఉన్నాడు అందులో… గతంలో కౌన్సిలర్‌గా ఓడిపోయిన ఆయన ఏకంగా ఎమ్మెల్యే అయ్యాడు… తరువాత మంత్రి కూడా… ఇందిరా అంటే ఓ విశ్వాసం… తల ఎత్తుకుని, కొంగు బిగించి, ఒంటరిగానే బరిలోకి దిగే సాహసి ఆమె…
ఆమెకు వేల కోట్ల సంపాదన కక్కుర్తి లేదు… తరతరాలకూ పోగేసి పెట్టాలనే చిల్లరతనం లేదు… తప్పులు చేసింది కొన్ని, కానీ తల ఎత్తుకునే, తెలిసే చేసింది… ఎందుకంటే ఆమె ఇందిర… ఆ పదానికి ప్రత్యామ్నాయం లేదు… ఈరోజుకూ…!! ((ఎ.రజాహుస్సేన్ అనుభవాల ఆధారంగా…)) (ఈరోజు ఇందిర జయంతి)
Share this Article