ఉక్కుమహిళను నిన్న ఆమె వర్ధంతి సందర్భంగా స్మరించుకున్నాం కదా…. ఉక్కుమనిషి అయితేనేం, ఉద్వేగాలు ఉండవా..? పైగా ఓ యువరాణిలా పెరిగింది, ఆభిజాత్యం కలిగిన స్త్రీ… తనలో కనిపించిన ఓ వికృతకోణం గురించి చెప్పుకోవాలంటే…. తన మొహం మీద తనకే ఓ ఆత్మన్యూనత, మరీ ప్రత్యేకించి తన ముక్కు పొడవు మీద…! వేరే స్త్రీలతో, ప్రత్యేకించి రాజకుటుంబాల నుంచి వచ్చి, అందమైన వేషభాషలతో బతికే వారితో పోల్చుకునేది… ఈర్ష్యపడేది…
పలుసార్లు ప్లాస్టిక్ సర్జరీ గురించి ఆలోచించింది… 1967 ప్రాంతంలో కావచ్చు భువనేశ్వర్‌లో ఆమె మీద రాళ్ల దాడి జరిగింది… ముక్కుకు పెద్ద గాయం… ఆ సందర్భంగా ఇక ముక్కును చిన్నగా చేయాలని డాక్టర్లను అడిగింది… కానీ డాక్టర్లు ఎందుకో అంగీకరించలేదు… ఐనా అందమైన కశ్మీరీ నాసికకు కుదింపు దేనికి అని మందలించారు… దాంతో వెనక్కి తగ్గింది…
గాయత్రిదేవి పట్ల ఇందిర ప్రదర్శించిన కోపం, ప్రతాపానికి ఆమె అందం పట్ల ఈర్ష్యతో పాటు ఆమె అంటే బడా సంపన్నవర్గాలు పడిచచ్చిపోవడమే కారణం అంటారు… గాయత్రి ఆమె ప్రదర్శన కూడా వికృతమే… గాయత్రి ఎవరు అంటారా..? కూచ్ బెహర్ రాజకుటుంబంలో పుట్టింది… వైభోగంగా పెరిగింది…
Ads
ఇందిరాగాంధీకి, గాయత్రీదేవికి పరిచయం ఎక్కడంటే… శాంతినికేతన్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన పథ భవన స్కూల్‌లో పరిచయం… గాయత్రీదేవి మంచి అందగత్తె… అప్పట్లో వోగ్ మ్యాగజైన్ ఆమెను ప్రపంచ స్థాయి పదిమంది టాప్ అందగత్తెల్లో ఒకరిగా గుర్తించింది… అంటే యవ్వనంలో ఆమె ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు… పైగా రాజకుటుంబం కదా, అలంకరణ, ఆభరణాలు ఉండేవి… ఇందిరాగాంధీకి ఆమెను చూస్తే అదే అసూయ…
జైపూర్ రాజు మాన్‌సింగ్‌ను మూడో భార్యగా పెళ్లిచేసుకోవల్సి వచ్చింది… రాజకుటుంబమే అయినా పరదా పద్ధతికి అంగీకరించలేదు… ఎందుకోెగానీ ఇందిరాగాంధీలో గాయత్రీదేవి పట్ల ఆ అసూయ పెరుగుతూనే వచ్చింది… దానికితోడు కాస్త రాజకీయ కక్ష కూడా తోడైంది… 1962లో గాయత్రీదేవి జైపూర్ లోకసభ స్థానం నుంచి పోటీచేసింది… 2.46 లక్షల వోట్లకు గాను 1.92 లక్షల వోట్లను… అంటే 78 శాతం వోట్లను సాధించింది… అప్పట్లో అది వరల్డ్ రికార్డు మెజారిటీ… 1965లో లాల్ బహదూర్ శాస్త్రి కాంగ్రెస్‌లోకి రమ్మన్నాడు కానీ ఒక పార్టీ తరఫున గెలిచి, మరో పార్టీలోకి రావడం నైతికత కాదంటూ తిరస్కరించింది… ఆ స్వతంత్ర పార్టీయేమో కాంగ్రెస్ వ్యతిరేక జనసంఘ్‌తో బాగుండేది… ఇందిరకు అదొక కోపం…
ఆమె పోటీ చేసింది రాజగోపాలచారి స్థాపించిన స్వతంత్ర పార్టీ తరఫున… పార్లమెంటులో గాయత్రీదేవిని చూస్తేనే ఇందిరాగాంధీ సహించేది కాదు… ఓ దశలో బిచ్ అనీ, గాజుబొమ్మ అనీ కామెంట్స్ చేసిందని అప్పటి జర్నలిస్టులు చెబుతుంటారు… కాలం ఇలా సాగిపోతోంది… ఎమర్జెన్సీ వచ్చి పడింది… దేశవ్యాప్తంగా పాత్రికేయులు, విపక్షనేతలు సహా వేలాది మందిని అరెస్టు చేశారు… మీసా (Maintenance of Internal Security (MISA) Act) చట్టం పేరుతో ఎవరినైనా జైళ్లలోకి నెట్టేసేవాళ్లు…
అసూయతో కుతకుతలాడే ఇందిరాగాంధీ కన్ను గాయత్రీదేవి మీద కూడా పడింది… దొరికింది చాన్స్ అనుకుంది… జైలుపాలు చేసింది… మీసా కింద కాదు… కోఫిపోసా చట్టం కింద… (COFEPOSA…. Conservation of Foreign Exchange and Prevention of Smuggling Act)… అంటే ఏమీలేదు… ప్రకటించని బంగారం, నగదు ఉందనే సాకుతో అరెస్టు చేసి, తీహార్ జైలుకు పంపించేశారు…
జనసంఘ్‌కు ఆర్థికంగా బలమైన వెన్నుదన్నుగా ఉన్న గ్వాలియర్ రాణి విజయరాజె సింధియాను కూడా జైలుకు తరలించారు… అది ఎంతటి నోటోరియస్ జైలో తెలుసు కదా… చేపల మార్కెట్ నయం… చిల్లర దొంగలు, వ్యభిచార కేసుల్లో నిందితులతోపాటు, కక్ష సాధించదలిచిన ఇలాంటి రాజకీయ నాయకులను కూడా వాళ్లలో కలిపేశారు…
నిజానికి ఎమర్జెన్సీ విధింపు సమయంలో గాయత్రీదేవి ముంబైలో ఏదో చికిత్స తీసుకుంటోంది… అది పూర్తి కాగానే అరెస్టు చేస్తామని కూడా అధికారులు సమాచారం ఇచ్చారు… అక్కడే ఇంకేదో అనారోగ్యం సాకుతో ఉండలేదు… రాజధానికి వచ్చేసింది… తీరా చూస్తూ విపక్ష బెంచీలన్నీ ఖాళీ… ఆమెను కూడా తీసుకెళ్లి జైలులో పడేశారు…
‘‘మేం ఇద్దరం కలిసే టాయిలెట్ వాడుకునేవాళ్లం… కుళాయి ఉండదు… నీళ్లు బయటికి పోవడానికి ఓ రంధ్రం ఉంటుంది… రోజూ పారిశుద్ధ్యం వాళ్లు రెండుసార్లు నీళ్లు కొట్టి వెళ్లిపోయేవాళ్లు… ఆ తిండి సరేసరి… గాయత్రీదేవిని చూడటానికి ఎప్పుడూ ఖైదీలు ఆమె బ్యారక్ దగ్గరే తచ్చాడేవాళ్లు… అదొక నరకం’’ అని రాసుకుంది విజయరాజె తరువాత రోజుల్లో…
ఆరు నెలలు అలాగే గడిచిపోయాయి… అనారోగ్యం పాలైంది… పెరోల్ మీద విడుదల చేయడానికి కూడా బోలెడు ఆంక్షలు పెట్టారు… అవి 1977 ఎన్నికల దాకా కొనసాగాయి ఆమెపై… అంతెందుకు…? గాయత్రీదేవి మీద కోపంతోనే ఇందిర 1971లో రాజభరణాల్ని కూడా రద్దు చేసిందనే ఇప్పటికీ ఢిల్లీ సర్కిళ్లు నమ్ముతాయి… నిజానికి 1947లో ఇండియన్ యూనియన్‌లో కలవడానికి సంస్థానాధీశులు పెట్టిన షరతుల్లో రాజభరణాలు కూడా ముఖ్యమైనవే… కానీ ఇందిర ఒకే దెబ్బతో అవన్నీ రద్దు చేసి పారేసింది…
జైలు నుంచి విడుదల కాగానే, జైలు దాకా వచ్చి ఆమె సవతి భార్య కొడుకు ఇంటికి తీసుకెళ్లాడు… ‘‘ఓ గంటసేపు స్నానం చేయాలిరా అర్జెంటుగా… ఆ పప్పూ పట్నాయక్‌ను పిలువు, మంచి విస్కీ తాగాలి..’’ అని కోరిందామె…. పప్పూ పట్నాయక్ అంటే ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్… అప్పట్లో తన పరిచయాలు, తన సర్కిల్ అలాంటిది మరి… ఆమె లైఫ్ స్టయిల్ అలాంటిది… తరువాత ఆమె ఇక రాజకీయాల్లోకి రాలేదు… 2009లో అనారోగ్య సమస్యలతో మరణించింది…
Share this Article