కర్నాటక రాజ్యోత్సవ సందర్భంగా… అంటే కర్నాటక అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై దివంగత హీరో పునీత్ రాజకుమార్‌కు మరణానంతరం కర్నాటక రత్న పురస్కారాన్ని ఇచ్చాడు… పునీత్ తరఫున ఆయన భార్య అశ్విని రేవనాథ్ ఈ పురస్కారాన్ని తీసుకుంది… ఒకవైపు వర్షం కురుస్తున్నా సరే, మరోవైపు ఈ రాజ్యోత్సవ సభ అలాగే సాగిపోయింది… పునీత్ సోదరులు, ఎంపిక చేసిన పునీత్ అభిమానులు కూడా దీనికి హాజరయ్యారు…
కర్నాటకలో ఇది ప్రతిష్ఠాత్మక అవార్డు… గతంలో ఇదే పునీత్ తండ్రి రాజకుమార్‌కు కూడా ఈ పురస్కారం దక్కింది… ఇంతకుముందు సాహితీవేత్త కువెంపు, నటుడు రాజకుమార్, రాజకీయనేత నిజలింగప్ప, శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు, సంగీతకారుడు భీమ్‌సేన్ జోషి, సామాజిక సేవకుడు శివకుమార్ స్వామీజీ, విద్యావేత్త జవారె గౌడ, సోషల్ సర్వీస్ విభాగంలోనే వీరేంద్ర హెగ్గడె ఈ పురస్కారాల్ని పొందారు…
ఈ అవార్డుల ప్రదానోత్సవానికి రజినీకాంత్, జూనియర్ ఎన్టీయార్, సుధామూర్తి తదితరులు హాజరయ్యారు… నిజానికి రజినీకాంత్‌కన్నా హీరో సూర్య తదితరులు మరణించిన పునీత్‌కు బాగా దగ్గర… అలాగే తెలుగులో కూడా పునీత్‌కు సన్నిహితులైన హీరోలున్నారు… కానీ రజినీకాంత్‌ను, జూనియర్ ఎన్టీయార్‌నే ఎందుకు ముఖ్య అతిథులుగా పిలిచారు…? సింపుల్… వాళ్లను కూడా కర్నాటక రాష్ట్రం తమవాళ్లుగా ఆప్యాయంగా ఓన్ చేసుకుంటున్నది కాబట్టి… అరుదైన విశేషమే ఇది…
Ads
అవును, రజినీకాంత్ ఎలాగూ కన్నడిగుడే… బస్ కండక్టర్‌గా పనిచేస్తూ, సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చెన్నై వెళ్లి, సూపర్ స్టార్‌గా ఎదిగిన క్రమం అందరికీ తెలుసు… తను చెన్నైలోనే ఉంటున్నా సరే, తరచూ బెంగుళూరుకు వచ్చి బంధుగణంతో గడిపి వెళ్తుంటాడు… సత్సంబంధాలు మెయింటెయిన్ చేస్తుంటాడు… సో, కోలీవుడ్ నుంచి రజినీకాంత్‌ను పిలిచారు…
ఇక జూనియర్ ఎన్టీయార్… ఆయన తల్లి పేరు శాలిని… ఆమె బేసిక్‌గా కన్నడిగ… ఆమె పుట్టింది మంగళూరు నుంచి ఉడుపి మీదుగా భత్కళ్ వైపు వెళ్లే రోడ్డులో ఉండే కుందపుర అనే చిన్న పట్టణం… ప్రస్తుతం కన్నడ చిత్రసీమలో సంచలనాలు సృష్టిస్తున్న శెట్టిలందరూ అక్కడివారే… ఈమె హైదరాబాదులో మ్యూజిక్ టీచర్‌గా ఉన్నప్పుడు హరికృష్ణతో ప్రణయం, తరువాత సహజీవనం, జూనియర్ పుట్టుక, చాన్నాళ్ల తరువాత నందమూరి కుటుంబం జూనియర్‌ను తమవాడే అని అంగీకరించడం, అదంతా వేరే కథ…
మొన్న ఎక్కడో కాంతార దర్శకుడు రిషబ్ శెట్టి కూడా మాట్లాడుతూ… జూనియర్ పట్ల తనకు ప్రత్యేకాభిమానం ఉంటుందనీ, ఎందుకంటే, ఆయన తల్లి తమ ఆడబిడ్డ కావడమే అన్నాడు… ఇక్కడ కర్నాటక సీఎం, సర్కారు ధోరణి నచ్చింది ఎక్కడా అంటే… నందమూరి కుటుంబసభ్యుల్లోనే చాలామందికి జూనియర్ అంటే మంట… చాన్నాళ్లు తనను, తల్లిని నందమూరి కుటుంబం మొత్తం దూరంగానే ఉంచింది… అలాంటిది కర్నాటక ప్రభుత్వం జూనియర్ ఎన్టీయార్ ఇమేజీని గుర్తించింది, తన కన్నడ మూలాల్ని గుర్తించింది, తమవాడే అని ఆత్మీయంగా హత్తుకుంది… అదీ బాగుంది…
Share this Article