కాంతార సినిమా చూసినవాళ్లకు ఈ పాత్ర తెలుసు… ప్రత్యేకించి ఈ కళ్లు తెలుసు… అంత త్వరగా మరిచిపోరు… నిజానికి రిషబ్ శెట్టి క్లైమాక్స్ కేవలం తన వల్లనే రక్తికట్టలేదు… ఇదుగో ఇలాంటి పాత్రలెన్నో ప్రాణం పెట్టి నటించారు కాబట్టి, అన్నీ కలిసి అదిరిపోయింది.,. సినిమా చూడలేదా..? పర్లేదు, దిగువన ఓ వీడియో ఉంది చూడండి…
దైవ అనే పాత్ర… ఛాతీని ఎగరేస్తూ… అరుస్తూ… ఆ కళ్లతో నిప్పులుమిసేలా చూస్తూ… ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు… ఆయన పేరు నవీన్ బొండె… తన కళ్లు తనకు పెద్ద అస్సెట్… రిషబ్ శెట్టి తన ఫోటోల్ని, వీడియోల్ని ఎక్కడో చూశాడు అంతకుముందే… మదిలో ఉండిపోయింది… ఈ నవీన్ మొదట్లో మంగుళూరులో బస్సు కండక్టర్…(సినిమా టీం అంతా మంగుళూరు బేస్డ్)…
తరువాత నాటకాల్లో చేశాడు… సినిమాల్లో చిన్న చిన్న వేషాలే కాదు, టెక్నికల్ విభాగాల్లోనూ పనిచేసేవాడు… పొట్టతిప్పలు మరి… తరువాత తుళు సినిమాల్లో విలన్‌గా మారాడు… ఆ భాషలో వచ్చే సినిమాల రీచ్ తక్కువ, మార్కెట్, బడ్జెట్ తక్కువ… కాంతారలో ఈ వేషం గురించి ఎవరో చెబితే విన్నాడు… ఓ వీడియోను ఎవరి ద్వారానో రిషబ్ టీంకు పంపించాడు… రిషబ్ టీం రమ్మంది… ఒకే ప్రశ్న అడిగింది… ‘‘నీ యాక్టింగ్ గురించి మాకు చెప్పనక్కర్లేదు… ఈ సినిమా పాత్ర కోసం మీసాలు కట్ చేసుకోవాలి, సిద్ధమేనా..?’’
Ads
నవీన్ ఎగిరి గంతేశాడు… మీసాలు కట్… ఫలానా తేదీల్లో, ఫలానా అడవిలో షూటింగ్ అని చెప్పారు… షూటింగ్ స్టార్టయ్యాక గానీ రిషబ్ తనకు కలవలేదు… కలిశాక తను చెప్పింది ఒకటే… ‘‘వేరే సినిమాల్లో పాత్రలు, సౌండ్, లుక్ వేరు… ఇది వేరు…’’ తనకు కావల్సిందేమిటో చిన్న పిల్లాడికి చెప్పినట్టు చెప్పి మరీ ఔట్ పుట్ తీసుకునేవాడు… లెన్స్ ఏమీ వాడలేదు… సినిమాలో చూపించినవి ఒరిజినల్ కళ్లే అవి…
తను పూర్తిగా ఆ పాత్ర ప్రేమలో పడిపోయాడు… మేకప్ వేశాక ఇక కనీసం స్లిప్పర్లు కూడా వేసుకునేవాడు కాదు… ప్రతి షాట్‌కు ముందు నేలకు నమస్కరించి గానీ డైలాగ్ చెప్పేవాడు కాదు… ఇప్పుడు జీవితంలో మరుపురాని గుర్తింపును, పేరును ఎంజాయ్ చేస్తున్నాడు… నిజానికి ఒక చిన్న సినిమా అనామకంగా థియేటర్ల నుంచి వెళ్లిపోతే ఎవరికీ ఆనందం ఉండదు… ఎంత కష్టపడి చేసిన పాత్ర అయినా సరే… ఎప్పుడైతే సినిమాకు అద్బుత విజయం దక్కిందో ఇంకేముంది..? ఆనందతాండవమే… కొత్తగా చెప్పాలా..?!
(వీడియో, ఇన్‌పుట్స్ మెట్రో సాగా సౌజన్యంతో…)
Share this Article