హహహ… కేసీయార్‌కు పగ్గాలు వేయడానికి బండి సంజయ్ దూకుడు ఎంత ఉపకరిస్తుందో… తన మాటల తీరు చూస్తే బీజేపీ శ్రేణులే బెంబేలెత్తిపోతున్నయ్… తనకు కొత్త విద్యుత్తు చట్టాలు, ఆయుష్మాన్ భవ, కేంద్ర వ్యవసాయ చట్టాలు, కేసీయార్ తీరుతో తెలంగాణ జనానికి వాటిల్లే నష్టాలు, పోతిరెడ్డిపాడు పొక్కలు, మెడికల్ సీట్లు, కాలేశ్వరం కథలు గట్రా ఏమీ పట్టవు… ఊఃఁ అంటే చాలు చార్మినార్ భాగ్యలక్ష్మి… చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు… ఆ కరీంనగర్ గల్లీ పాలిటిక్సు నుంచి బయటికి వచ్చి, కాస్త రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పది మంది మెచ్చుకునేట్టు మాట్లాడవయ్యా అని ఎవరూ చెప్పలేరు… చెప్పినా వినడు…
బీజేపీలో చేరితే పుణ్యం వస్తుంది… ఎందుకీ వ్యాఖ్య..? ఎంత తప్పుడు సంకేతాలు వెళ్తాయి జనంలోకి…? అసలే కాషాయ పార్టీలో చేరిన సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి గట్రా నేతల వల్ల ఆ పార్టీ పవిత్రం అయ్యిందో, లేక వాళ్లే పవిత్రులు అయ్యారో గానీ… తప్పులు చేసినా సరే, కాషాయతీర్థం పుచ్చుకుంటే చాలు, బారా ఖూన్ మాఫ్ అన్నట్టుగా మారిందని జనమంతా నమ్ముతున్నారు ఇప్పుడు… సాక్షాత్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడే ఆ సంకేతాలు ఇస్తే పార్టీ కేడర్‌కు ఏం చెబుతున్నట్టు..?
Ads
సంఘ్ పరివార్ నుంచి ఏళ్లకేళ్లుగా పనిచేస్తూ, కష్టనష్టాల పాలవుతూ, ఈరోజుకూ మంచి చాన్సులు, గుర్తింపు లేని నాయకులు బోలెడుమంది బీజేపీలో…! వాళ్ల గురించి ఆలోచించకుండా, ఎవరైనా రండి, పవిత్రుడు కండి అనే ఈ తాజా ప్రవచనాలు, పిలుపులు ఏమిటి..? పైగా గేట్లు ఎత్తితే గులాబీ పార్టీ ఖాళీ అట, 30 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారట… 1977 నుంచీ ప్రతి రాజకీయ పార్టీ, నాయకుడు ఆడే మైండ్ గేమే ఇది… నమ్మడానికి జనం చెవుల్లో పూలు లేవు, ఇలాంటి ఉడత ఊపులతో కేసీయార్ వంటి ముదురు ఘటానికి ఝలక్కులూ ఇవ్వడం కుదరదు…
సరే, 30 మంది వస్తారు… చేర్చుకొండి, దాంతో వచ్చేదేముంది..? ఇప్పటికిప్పుడు కేసీయార్ కుర్చీ దక్కుతుందా..? ఇప్పటిదాకా పార్టీ కోసం కష్టాలు పడేవాళ్లంతా పిచ్చోళ్లా, కొత్త పవిత్రులను చేర్చుకుంటే పాతవాళ్ల గతేమిటి మరి..? కేసీయార్‌ను కుర్చీ నుంచి లాగేసి ఇప్పటికిప్పుడు బీజేపీ నాయకుడు కూర్చుంటే బాగుండు అనే భావన ఓ రాజకీయ నాయకుడిగా ఉంటే ఉండవచ్చుగాక…. కానీ దానికి అమిత్ షా ఒప్పుకోడుగా… తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రవహించే అపారధనం అవసరం బీజేపికి కూడా ఏ బెంగాల్లోనో అవసరం ఉంటుంది కదా… ఒప్పందాలు ఉంటాయి కదా… ఆ ఒప్పందాల వెనుక కేసులు, జైళ్ల బెదిరింపులు ఉంటాయి కదా… సో, గేట్లు ఎత్తుతాం, మస్తు మంది వస్తారు, కేసీయార్ పని ఖతం, మా పార్టీలో చేరితే పవిత్రులు అవుతారు వంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం, పనిచేసే పార్టీ కేడర్‌కు అరిష్టం… ఊరికే గాలిలో కత్తులు తిప్పితే యుద్ధమెలా అవుతుంది సంజయ్ భయ్యా… ప్రత్యర్థి దేహం మీద కనీసం ఒక్క చిన్న గాయమైనా చేసి చూపించు…!
Share this Article