స్పోర్ట్స్ వార్త అయినా సరే… కొందరు రిపోర్టర్ల శైలి చదువుతూ ఉంటే, ఆ ఆట మళ్లీ చూస్తున్నంత మజా ఉంటుంది… విశ్లేషణలు రాసేటప్పుడు కొందరు ఆసక్తికరమైన వివరాలను జతచేస్తారు… చిన్న వార్తలే కానీ కనెక్టవుతాయి… ప్రత్యేకించి క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి ఉన్న ఇండియాలో సైడ్ లైట్స్, హైలైట్స్ ఆసక్తిగా చదువుతారు పాఠకులు…
టీ20 వరల్డ్ కప్ కవరేజీ వార్తల్లో పెద్దగా ఆకట్టుకునే బుడ్డ వార్తలేమీ కనిపించలేదు… ఓచోట మాత్రం మన షమీ పాకిస్థానీ షోయబ్ అక్తర్‌కు ‘కర్మ అంటే ఇదే సార్’ అని ఓ రిటార్ట్ ఇచ్చిన తీరు బాగుంది… కర్మ… భలే వాడాడు ఆ పదాన్ని… సందర్భం కూడా భలే దొరికింది… కర్మ అంటే గుర్తొచ్చింది… ఈనాడులో వచ్చిన ఓ బుడ్డ వార్త ‘కర్మ’పై’ బాగుంది…
కర్మ… డెస్టినీ… టైమ్… ఏ పదమైనా చెప్పుకొండి… మనల్ని శాసిస్తూనే ఉంటుంది… ఇక ఒకడి పని అయిపోయినట్టే అనుకుంటే, కొన్నాళ్లకు తననే తీసుకొచ్చి కిరీటం పెడుతుంది… చప్పట్లు కొట్టిస్తుంది… ఇక వీడికి తిరుగులేదు అనుకున్నవాడిని హఠాత్తుగా కిందపడేసి తొక్కేస్తుంది… ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ కథా అంతే… మొన్నటి వరల్డ్ కప్ గెలుపులో తనదే కీలకపాత్ర…
Ads
పరిస్థితిని బట్టి, ఒడుపుగా ఆడుతూ, డిఫెన్స్ కూడా ఆడుతూ… ఆచితూచి షాట్స్ కొడుతూ… 52 పరుగులు చేశాడు… ఒక వికెట్ తీసుకున్నాడు అంతకుముందు… అయితే ఇదే స్టోక్స్ ఒకప్పుడు తీవ్ర నిరాశలో ఇక బాల్, బ్యాట్ మళ్లీ పట్టుకుంటాడా అనే దశను ఎదుర్కున్నాడు…
2016… టీ20 ప్రపంచకప్ ఫైనల్… 156 పరుగుల్ని చేధించాలి… 19 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 137 చేసింది వెస్టిండీస్… విజయానికి 19 పరుగులు కావాలి… టీ20లో ఒకే ఓవర్‌లో 19 పరుగులు అనేది పెద్ద కథేమీ కాదు… కానీ అంతకుముందు ఇంగ్లండ్ పొదుపైన బౌలింగ్ దృష్టిలో పెట్టుకుంటే చివరి ఓవర్‌లో వెస్టిండీస్ 19 పరుగులు చేయడం అసాధ్యం అనిపించింది… స్టోక్స్ బౌలింగ్… కానీ వెస్టిండీస్ క్రికెటర్ బ్రాత్‌వైట్ వరుసగా నాలుగు బాల్స్‌కు నాలుగు సిక్సర్లు కొట్టి విజయకేతనం ఎగరేశాడు… స్టోక్స్ కుప్పకూలాడు…
ఆ కప్‌కు సంబంధించి ఇంగ్లండ్ తనే విలన్… ఇక తన కెరీర్ ఖతం అనుకున్నారు అందరూ… ఆ తరువాత కొన్నాళ్లకు ఏదో నైట్ క్లబ్ గొడవ… మనిషి ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు… కానీ ఫీనిక్స్ పక్షి లేచి నిలిచింది… 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్… స్టోక్స్ 84 పరుగులతో నాటౌట్… కప్ కైవసంలో కీలకపాత్ర… స్టోక్స్ వెలుగులోకి వచ్చాడు… అభినందనలు… చప్పట్లు…
మళ్లీ ఇప్పుడు పొట్టి వరల్డ్ కప్… ఈ 52 పరుగులే కీలకం… కప్ ఇంగ్లండ్ చేతిలో పడింది… మళ్లీ స్టోక్స్ మీద ప్రశంసల వర్షం… ఒకప్పుడు ఛీ, థూ అని చీదరించుకున్న జనమే ఇప్పుడు ఆహాకారాలు, ఓహోకారాలు… తను ఇండియన్స్‌కు కొత్తేమీకాదు… ఐపీఎల్ ఆటగాడే… ఇక్కడ చెప్పుకోవాల్సింది… టైమ్ తనను తొక్కింది… ఆ టైమే తనను పైకి లేపింది… ఎటొచ్చీ మంచిరోజు కోసం నిరీక్షణే స్టోక్స్ చేసింది…!!
Share this Article