టాటా తలుపులు పెట్టుకోండి!
అగ్ని అవరోధిస్తుంది!……… by…. -పమిడికాల్వ మధుసూదన్
———————-
తెలుగు భాష ఎప్పటికీ చచ్చిపోదు అని నమ్మకం కలిగించడానికి అప్పుడప్పుడూ కొన్ని దృష్టాంతాలు ఎదురవుతుంటాయి. అలాంటి దృష్టాంతాల్లో కార్పొరేట్ ప్రకటనల తెలుగు అనువాదం ఒకటి. తెలుగు భాషను ఎంతగానో ప్రేమించే ఈనాడు పలక అక్షరాల మాస్ట్ హెడ్ కింద The largest circulated Telugu daily అని ఇంగ్లీషులో ఉండడంలో ఏదో జర్నలిస్టిక్ లింగ్విస్టిక్ అంతరార్థం దాగి ఉండవచ్చు! అవుటర్ రింగ్ రోడ్డకు- బాహ్యవలయ రహదారి; డివైడర్ కు- విభాగిని; ఎయిర్ హోస్టెస్ కు- గగనసఖి అని ఒక తపస్సుగా, యజ్ఞంగా, బాధ్యతగా, కర్తవ్యంగా తెలుగులో రాసే ఈనాడు- “అత్యధిక జనాదరణ కలిగిన తెలుగు దినపత్రిక” అని తెలుగులోనే రాసుకునే అవకాశం ఎందుకు లేదో! తెలుగువారి గుండె చప్పుడు కాస్తా the largest circulated Telugu daily అని ఇంగ్లీషులోకి మారడంలో మనకు తెలియని సాంకేతిక, న్యాయసంబంధ, భారతీయ న్యూస్ పేపర్ యాక్ట్ సంబంధ విషయలేమయినా దాగి ఉన్నాయేమో?
ఈరోజు ఈనాడులో మొదటి పేజీలో పావు పేజీ టాటా కంపెనీవారి ఒక రంగుల ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనను ఈనాడులో వేయించుకోవడానికి టాటా లక్షల్లో ఖర్చు పెట్టి ఉంటుంది. సహజంగా మిగతా భాషల పత్రికల్లో కూడా ఆయా భాషల్లోకి ఇలాగే అనువదించి ఇచ్చి ఉంటారు. అంటే ఒక రోజు పద్నాలుగు భాషల్లో పావు పేజీ దేశవ్యాప్తంగా ప్రకటన ఇవ్వడానికి టాటాకు హీనపక్షం కోటి లేదా కోటీ పాతిక లక్షలు ఖర్చు అవుతుంది. పెద్ద కంపెనీలకు ప్రకటనలు చేసి పెట్టడానికి, అనువదించడానికి పేరుపొందిన పెద్ద పెద్ద ఆస్థాన యాడ్ ఏజెన్సీలు ఉంటాయి. ఇందులో పనిచేసే వారందరూ భారత దేశంలో ఏ పూనా పక్కన పల్లెలోనో, బీహార్ లో ఆర్ టీ సీ బస్సు కూడా వెళ్లని ఊళ్ళోనో పుట్టి ఉంటారు. క్రియేటివ్ ఫీల్డ్ లోకి వెళ్లగానే జుట్లు పెంచుకుని, జడలు కట్టి ఇంగ్లీషులో ఆలోచిస్తూ, మొదట ఇంగ్లీషులోనే ప్రకటనలు చేసి- తప్పనిసరి పరిస్థితుల్లో తరువాత భారతీయ హిందీ, ఇతర భాషల్లోకి ఆ ప్రకటనలను అనువదిస్తారు. ఆ అనువాదం కంటే ఇనుప గుగ్గిళ్లు చాలా మృదువుగా, చాలా రుచిగా ఉంటాయి. బహుశా చాలా సందర్భాల్లో గూగుల్ లో ఇంగ్లీషు టు తెలుగు అని టైపు చేసి గుడ్డి గూగుల్ ఇస్తున్న మాటలను వాడుతున్నట్లున్నారు. లేదా ఇంగ్లీషు నుండి ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తున్నప్పుడు మక్కికి మక్కి యాంత్రిక అనువాదం చేస్తున్నట్లున్నారు.
Ads
మచ్చుకు ఈరోజు ఈనాడులో అచ్చయిన టాటా తలుపులు, కిటికీలు, ద్వారబంధాల ప్రకటన చూద్దాం.
ఈ దేశంలో పరిచయం అక్కర్లేని కంపెని టాటా. కొన్ని విలువలు, సత్సంప్రదాయాలు వారసత్వంగా అందిపుచ్చుకుని అవే విలువలతో ఇప్పటికీ కొనసాగుతున్న కంపెని. టాటా ప్రవేశ్ పేరుతో ఇంటి ద్వారాలు, తలుపులను ఆ కంపెనీ ప్రవేశ పెట్టింది. ఇంట్లోకి ప్రవేశించాలంటే ద్వారం లేదా గుమ్మంలో నుండే ప్రవేశించాలి. కాబట్టి గుమ్మాలు, తలుపులకు సంబంధించి టాటా ప్రవేశ్ అని చక్కటి పేరు పెట్టారు. ఇంగ్లీషులో ప్రకటన బహుశా చక్కటి భావంతో, సృజనాత్మక శైలితో ఉండి ఉంటుంది. తెలుగులో గుమ్మం తలకు తగులుతోంది. తల బొప్పి కడుతోంది. ఆ అనువాదం తలుపు సందుల్లో తెలుగు వేళ్లు చిక్కుకుని నలిగిపోయాయి.
“అన్నిటికీ ఏకైక పరిష్కారం” అన్నది శీర్షిక.
“టాటా ప్రవేశ్ తలుపులే – అన్నిటికీ పరిష్కారం” అని ఉండాలి. కింద ఫోటో చుసి అలా అనుకునే అవకాశం పాఠకులకు ఇచ్చినట్లున్నారు. ఆ అసలు విషయం ఉన్న లైన్ “దర్వాజాలు, తలుపులు” అన్న మాటను చిన్న ఫాంటులో కింది లైన్ గా పెట్టారు.
ఇక ఆ దర్వాజాలు మరియు కిటికీల గొప్పదనం చెబుతూ-
“అగ్ని అవరోధిస్తుంది” అని ఉంది. బహుశా ఫైర్ రెసిస్టెంట్ అన్న ఇంగ్లీషు మాటకు ఇది అనువాదం కాబోలు. మంటలను తట్టుకుని గట్టిగా నిలబడుతుంది అని నేరుగా చెప్పలేక “అగ్నిని నిరోధిస్తుంది” అని చెప్పబోయి అగ్ని అవరోధిస్తుంది అని గూగులమ్మ చెప్పినట్లు అనువధించి మన మీదికి వదిలారు. మాటలమధ్య విభక్తి ప్రత్యయాలు; మాటలముందు ఉపసర్గలు, కర్తను బట్టి క్రియాపదంలో లింగ వచన భేదాలను ఇప్పటికయితే గూగుల్ గుర్తించలేకపోతోంది. ఇక్కడ ప్రకటనలో యాంత్రిక వికటానువాదం ప్రకారం-
ఈ దర్వాజాలు, తలుపులు, కిటికీలు పెట్టుకుంటే అగ్ని దర్వాజా దగ్గర నిలుచుని వచ్చి పోయేవారిని బాజాప్తా అడ్డుకుంటుంది అని స్పష్టమయిన అర్థం. తమ తలుపులు అందుకే పెట్టుకోవాలి అన్నది టాటా వారి ఉద్దేశమయితే మనం చేయగలిగింది లేదు!
రెండో మాటలో కూడా చెద పురుగులను దరిచేరనివ్వదు అని ఉండాలి. చెద పురుగులు దరిచేరనివ్వదు అని ఉంది. ఈ మాట ప్రకారం- తలుపు దగ్గర చెద పురుగులు దడికట్టి మనల్ను దగ్గరికి రానివ్వవు అని అనుకుంటే కాదనే అధికారం ఈ అనువాదకుడికి ఉండదు!
కనువిందు చేసే రకాలు, ఉత్పత్తులు, భిన్న శ్రేణులు, రకరకాల శైలులు అని చెప్పడం చేతకాక కనువిందు చేసే రేంజ్ అని అలాగే వదిలేసి మనల్ను రక్షించారు. లేకపోతే ఏ ఫైరింగ్ రేంజ్ కయినా పనికి వచ్చే తలుపులు అని దృఢత్వానికి దురర్థం సాధించేవారు. ఫ్రీ డెలివరీ మరియు కాంటాక్ట్ లెస్ ఇన్స్టలేషన్ ను ఎందుకు తెలుగులోకి అనువదించలేదో? ఉచిత రవాణా, ఉపయోగించుకోవడానికి వీలుగా సిద్ధం చేసి బిగింపు అని చెప్పలేకపోయారా?
ప్రకటనలను ప్రచురించే పత్రికలకు ఈ తప్పులతో ఏమాత్రం సంబంధం ఉండదు కాబట్టి వారిని బాధ్యులను చేయలేం. యాడ్ ఏజెన్సీలు, అనువాదకులు, ఇలా అనువాద ఇనుప గుగ్గిళ్లను జనానికి అందచేయాలని ఆరాటపడే కంపెనీలదే ఈ తప్పు. సంస్కృతంలో అయః అంటే ఇనుము. అర్థం కానిది, అర్థం చేసుకోలేనిది “అయోమయం”. అనువాదకులు భాషలో అయోమయానికి గురై, మనకు అయోమయం పంచుతున్నారు. లేదా మనం ఐరన్ లోపంతో నీరసించి ఉన్నామనుకుని ఉద్దేశపూర్వకంగా ఇనుప గుగ్గిళ్లు తయారు చేసి అయోమయ అయః పరిపాక గుగ్గిళ్లు పంచిపెడుతున్నారు. ఒకప్పుడు- రాళ్లు తిని రాళ్లు అరిగించుకునేవారు. ఇప్పుడు అనువాద అయః పాకం తిని ఇనుమును హాయిగా అరిగించుకుంటున్నారు.
అగ్ని అడ్డుకుంటోంది!
చెద పురుగు చెయ్యి అడ్డుపెట్టి ఆపుతోంది!
టాటా తలుపులో తెలుగు అనువాదం సిగ్గుతో తలదించుకుంటోంది.
తినగ తినగ
అనువాద ఇనుము తియ్యగనుండు!
క్లైమర్:-
టాటా వారివరకు ఇలాంటి ప్రకటనలకు ఉచితంగా అనువాదం చేసి పెడతాను- వారు కోరితే! తెలుగు భాషాభిమానిగా అంతకుమించి ఏమీ చేయలేను!
తెలుగు సరిగ్గా చదవడం రాక ఆ ప్రకటన నాకు ఇలా అర్థమయ్యింది కానీ- లక్షల మంది తెలుగు ఆత్మాభిమాన పాఠకులకు ట్రూ స్పిరిట్ లో అర్థమై ఉంటుందనే అనుకుంటున్నాను!
Share this Article