నిన్న యండమూరి వీరేంద్రనాథ్ జన్మదినం అట కదా… ఈ 74 ఏళ్ల వయస్సులో కూడా ఆయన్ని ఆడిపోసుకున్నారు… క్షుద్రరచయిత అన్నారు… అలా గుర్తుచేసుకున్నారు చాలామంది సోషల్ మీడియాలో… మరీ ప్రత్యేకంగా తులసిదళం అనే నవలను ఉదాహరణగా తీసుకుని…! ఎస్, యండమూరి మీద బోలెడు విమర్శలున్నయ్… మనమూ చాలాసార్లు చెప్పుకున్నాం… వ్యక్తిత్వ వికాసం నవలల్ని కూడా రాసి, ఎడాపెడా సొమ్ము చేసుకున్న తన వ్యక్తిత్వం మీదే బొచ్చెడు ఆరోపణలు… నిందలు, మరకలు…
దాన్నలా వదిలేస్తే తులసిదళం అనే నవల మీద క్షుద్రం అనే ముద్ర వేయడం మాత్రం దుర్మార్గం… ఏది క్షుద్రం..? ఒక పూజను వైదిక పద్ధతిలో చేస్తే దక్షిణాచారం, శాస్త్రీయమే… వామాచారంలో చేస్తే క్షుద్రమా..? అదీ శాస్త్రీయమే… అఘోరాలు చేసే పూజలు ఓ పద్ధతిలో ఇముడుతాయా..? వాటిని ఏమనాలి..? సో, క్షుద్రానికి సరైన నిర్వచనం లేదు… అప్పుడెప్పుడో 1980 నాటి నవల… 42 ఏళ్ల క్రితం… అప్పట్లో అది ఆంధ్రభూమి వీక్లీలో సీరియల్‌గా వచ్చేది…
తనేమీ సమాజాన్ని ఉద్దరించే రచనలు చేస్తున్నానని చెప్పలేదు… తను కమర్షియల్ రైటర్… పాపులర్ నవలను జనంలోకి తీసుకెళ్లడమే తన లక్ష్యం… తనకు డబ్బు కావాలి… పేరు కావాలి… తన నవలలు సినిమాలుగా తీయబడాలి… తనే దర్శకుడు కావాలి… అంతేతప్ప, సాహిత్యం, ప్రమాణాలు, విలువలు అని గీతలేమీ గీసుకోలేదు… మనం చూసే కోణంలో, సాహిత్యం ఇలా ఉంటే బాగుంటుంది అని మనం భావించే ప్రమాణాల్లో అవి ఇమడవు… అలాగని వాటిని సాహితీప్రక్రియలు అని కొట్టిపారేయలేం…
Ads
ప్రపంచవ్యాప్తంగా సైన్స్ ఫిక్షన్, స్పిరిట్యుయల్ ఫిక్షన్, ప్రిడిక్షన్ ఫిక్షన్, కాన్‌స్పిరసీ థియరీస్, బ్లాక్ మ్యాజిక్కులు, క్రైమ్ ఫిక్షన్, టైమ్ జర్నీ, స్టోరీ రీటెల్లింగ్… అసలు ఎన్నిరకాల పుస్తకాలు రాలేదు..? ఆ కంటెంటుతో మనం ఏకీభవిస్తున్నామా..? లేదు కదా…! పోనీ, తులసిదళం నవలలో చెప్పిన మంత్రాలు, తంత్రాలు లేవా..? వాటి పేరుతో డబ్బు సంపాదనలు లేవా..? అప్పటికే కాదు, ఇప్పటికీ ఉన్నాయి… అవి సగటు పాఠకుడిని లేదా ప్రేక్షకుడిని ఆకట్టుకుంటయ్… అందుకేగా అఖండలు, కార్తికేయలు, కాంతారలు సక్సెస్ అవుతున్నది… వారం వారం ఓ కొత్త థ్రిల్ పాఠకుడికి అందించాలి… అందుకే ఓ క్రైమ్ సస్సెన్స్ థ్రిల్లర్ రాశాడు యండమూరి… ఆ నవలకు అంతకుమించి విశ్లేషణ అక్కర్లేదు…
అయితే అది అప్పట్లో సూపర్ హిట్… కారణం, కేవలం క్షుద్రపూజలు మాత్రమే కాదు… ఒకవైపు హిప్నాటిజం వంటి కొత్త విద్యల పరిచయం, తోడుగా మ్యాజిక్, మెడికల్ టర్మినాలజీ, మెడికల్ ట్రీట్మెంట్‌తో పాప (తులసి)కు నయం చేయించడానికి ప్రయత్నాలు సమాంతరంగా సాగుతుంటయ్… రచయిత ఏ సైడూ తీసుకోడు… పాఠకుల్ని అలాగే ఆ సస్సెన్స్‌లోనే ఉంచేస్తాడు… కథనంలో సస్పెన్స్ సరేసరి… అదొక కొత్త శైలి… కిచెన్ రచయిత్రుల ‘పడవకారు- రాజకుమారుడు’ బాపతు సోది సాహిత్య పోకడల్ని ఒక్కసారిగా బద్దలు కొట్టింది తులసిదళం…
తెలుగు నవలను, తెలుగు పాపులర్ సాహిత్యాన్ని ఇంకోవైపు మళ్లించిన నవల అది… ఊరికే కొట్టిపారేయలేం… నిజానికి అది యండమూరి సొంత రచనేమీ కాదు… ది ఎగ్జార్సిస్ట్ అనే నవలకు అనుకరణ… కాకపోతే తెలుగు వీక్లీ పాఠకులకు నచ్చే రీతిలో రాయబడిన శైలి… ఈ నవలపై విమర్శగా వేపమండలు అని ఏదో నవల వచ్చినట్టుంది… కన్నడంలో తొలుత తులసిదళ అని సినిమాగా వచ్చింది, తరువాత తెలుగులో తులసిదళం పేరుతో తీశారు… హిందీలో పూంక్ అని తీసింది ఇదే కథ కావచ్చు బహుశా… తరువాత కొన్నాళ్లకు జెమినిలో టీవీ సీరియల్… అసలు ఆ పుస్తకమే ఓ చరిత్ర… నలభయ్యేళ్ల తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే… తులసిదళాన్ని మించిన ఎన్నో రెట్ల క్షుద్రం టీవీ సీరియళ్లలో… వెబ్ సీరీస్‌ల్లో… పుస్తకాల్లో… సినిమాల్లో… మన సాహిత్యం ఏం మారింది..?!
Share this Article