రామతీర్థం రగులుతోంది…. హిందూధర్మానికో, హిందూదేవుడికో శిరోభంగం కలిగినందుకు కాదు… అసలు అదెవడికీ పట్టడం లేదు… జగన్ విసిరేసే దయాధన దృష్టులతో చల్లగా ఉన్న జాతీయ హిందూ పార్టీలు, సంస్థలతోపాటు రాష్ట్ర పార్టీలూ అంతే… కులం, దాని ఆధారంగా ఉన్న రాజకీయం… దాని ముందు రాముడు, దేముడు బలాదూర్… పాపం చేసినవారు వాళ్ల పాపాన వాళ్లే పోతారులే అంటాడు జగన్… మరి రాజధర్మం మాటేమిటి..? ఆ మాటకు తనకు అర్థం తెలియదు… బొచ్చెడు సంఘటనలు జరిగినా సరే, ఈరోజుకూ ఒక్క నిందితుడినీ బయటపెట్టలేని అసమర్థత… ఈ ఘటనలకు కారణాల్ని, కారకుల్ని చెప్పలేడు… తను ఈ రాజ్యానికి రాజట..?
జరిగింది… మరి రాజకీయంగా వాడుకోకపోతే ఎట్లా…? వెంటనే చంద్రబాబు దిగాడు రంగంలోకి… విజయవాడలో బోలెడు గుళ్లను పునాదులతో సహా పెకిలించి పారేసినవాడు ఇప్పుడు హిందూ ధర్మ రక్షణకు, అలవాటు లేని తిలకం పెట్టుకుని మరీ కదిలాడు… (ప్రస్తుతం ప్రకటనలకే పరిమితమైన వకీల్ సాబ్ అంతా సద్దుమణిగాక కదిలి వస్తాడేమో…) ఉద్రిక్తతలు ఉన్నప్పుడు, సగటు హిందూ ధర్మానుసారి ఆగ్రహంతో రగిలిపోతున్నవేళ… ఆ మంటల్లో చలికాచుకోవడానికి చంద్రబాబు బయల్దేరాడు…
Ads
చంద్రబాబు చలికాచుకుంటున్నాడూ అని తెలియగానే పోలోమంటూ విజయసాయిరెడ్డి కదిలాడు… అందరికన్నా ముందే రామతీర్థం కొండ ఎక్కుతాడట… ఎక్కి ఏం చేస్తాడు..? ఎవడి కన్నీళ్లు తుడుస్తాడు..? తనే చెప్పాడుగా.,. ఈ విగ్రహాల ధ్వంసం వెనుక చంద్రబాబు ఉన్నాడని… పార్టీ ప్రధాన కార్యదర్శి కదా… ఆధారాలు ఉండే ఉంటాయిగా… మరెందుకు చంద్రబాబుపై కేసు పెట్టలేదు… తీసుకుపోయి జైలులో ఎందుకు పారేయలేదు..? చేతకానితనమా..?
ఇక్కడ వైసీపీకి బీ-టీమ్‌గా వ్యవహరించే బీజేపీ లోకల్ టీం ఉంటుంది… చంద్రబాబును వ్యతిరేకిస్తూ ఆ మెట్ల మీద కూర్చుని నిరసనకు దిగారు… సంఘటన జరిగిన తరువాత స్పందించిన తెలివి లేదు… ఇన్ని జరుగుతున్నయ్, నువ్వూ, నీ ప్రభుత్వం ఏం చేస్తున్నారు అనడిగే తెలివి లేదు… చంద్రబాబును అడ్డుకుంటారట… దీనికితోడు అక్కడ చేరిన టీడీపీ పైత్యం… వెరసి సాయిరెడ్డి కారుపై దాడి… నిజానికి ఈ ఉద్రిక్తతలో సాయిరెడ్డి పెట్రోల్ ఎందుకు పోస్తున్నట్టు..? వైసీపీ జెండాలతో గుట్ట అధిరోహణ దేనికి..? అక్కడ ఎవడున్నాడని ఈ జెండాల ఉద్యమం..?
ఎవరినో అదుపులోకి తీసుకున్నారట… ప్రాథమికంగా తెలుగుదేశమే ఈ దుశ్చర్యలకు పాల్పడిందట… కావాలని సాక్షి టీవీలో ప్లేట్స్, స్క్రోల్స్, ధూం తడాఖా… చంద్రబాబు రాజకీయ డ్రామా అట… చంద్రబాబు రామతీర్థం పర్యటన పెట్టుకోగానే అనుమానితులు పట్టుబడ్డారా..? ఎవరిది డ్రామా..? ఎందుకు ప్రజల కళ్లకు ఈ గంతలు..? కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ ప్రయత్నించేకొద్దీ ఇంకా పెరుగుతున్న సందేహాలు… ఈలోపు రాముడు, దేవుడు జాన్తానై అన్నట్టుగా… మా పార్టీలు, మా నాయకులే అల్టిమేట్ అన్నట్టుగా… సోషల్ మీడియాలో చెలరేగుతున్న మూడు పార్టీలు…
మొత్తానికి వందల ఏళ్ల చరిత్ర ఉన్న గుడి మకిలిపడింది… రాముడి తల ఎక్కడో ఎగిరిపడింది… ఇదుగో ఇలా ఏపీ పార్టీలు ఆ మంటల్లో చలికాచుకుంటున్నయ్… రాముడా..? ఎహె, నిన్నెవడు దేకాడు ఇక్కడ..? జస్ట్, రాజకీయం… దానికి మూలమైన కులం… అంతే… నీ తల నరికిన అసలు రావణాసురుడు ఎవడో, ఎవడి చెబితే ఈ పని చేశాడో, ఏ కారణంతో చేశాడో గానీ… ఈ చిల్లర దేవుళ్ల ఆవేశకావేషాలు, వీరంగాలు గమనిస్తూ…. ఈ క్షుద్ర రాజకీయాలు గమనిస్తూ పకపకా నవ్వుతున్నాడు ఎక్కడో దాక్కుని…!! పోనీ, మీకు చేతకాకపోతే పొరుగు పోలీసులకు అప్పగించి, పక్కకు జరగండి… రెండురోజుల్లో రావణవధ జరగకపోతే అడగండి..!!
Share this Article