కొన్నిసార్లు మీడియా, సోషల్ మీడియా తీసుకునే లైన్ చికాకు తెప్పిస్తుంది… పొద్దున్నే ఓ సీనియర్ జర్నలిస్టు ఆవేదనగా రాసుకొచ్చాడు… ‘‘కృష్ణ వెంటిలేటర్ మీద ఉన్నారు అని డాక్టర్ చెబుతుంటే ఎవరో జర్నలిస్టు మాట్లాడుతున్నారా అనడిగాడు… జర్నలిస్టు అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది’’ అని..! ఇక్కడ మానవసహజమైన సున్నితత్వం కూడా లేకుండా పోతోంది… సరికదా యుక్తాయుక్త విచక్షణ రాహిత్యం సరేసరి…
చాలా పోస్టులు, వార్తలు, విశ్లేషణలు మహేశ్ బాబు కోణంలో కనిపిస్తున్నాయి… ఒకే సంవత్సరంలో అన్నను, నాన్నను, అమ్మను కోల్పోయాడు, ఈ దుఖం ఎలా భరిస్తాడో, రాకూడని కష్టం వచ్చింది అనేది సారాంశం… అవును, ఈ నెలారంభంలో అన్న రమేశ్ బాబును, మధ్యలో అమ్మ ఇందిరను, ఇప్పుడు నాన్న కృష్ణను కోల్పోయాడు… ఖచ్చితంగా తనకు అది భరించలేని దుఃఖమే…
కృష్ణ మరణం పట్ల పరామర్శకు వచ్చే ప్రముఖులు కూడా మహేశ్ బాబును ఊరడించి వెళ్తుంటారు, అదీ సహజమే… తను పాపులర్, ఇతర కృష్ణ కుటుంబసభ్యులతో పోలిస్తే తన పరిచయాలు, తన సర్కిల్ చాలా పెద్దది… పైగా ఏ పార్టీతోనూ, ఏ వర్గాలతోనూ అఫిలియేషన్ లేకుండా తన పనేదో తను చేసుకుంటూ పోతాడు… కాబట్టి తనకు సొసైటీలో వ్యతిరేకత లేదు… అయితే..?
Ads
మహేశ్ బాబుకే కాదు కదా… ఆ కుటుంబంలో ఇంకా ఉన్నారు… ఏడాది మొదట్లో మరణించిన రమేశ్ బాబు భార్య మృదులకు ఎక్కువ విషాదం నిజానికి… భర్త పోయాడు, అండగా ఉంటారనుకున్న అత్త పోయింది, ఇప్పుడు మామ కూడా దూరమయ్యాడు… ఇప్పుడు నిజంగా ఆమె ఒంటరి… పిల్లలు భారతి, జయకృష్ణ… ఇంకా సెటిలైనట్లు లేదు…
సీనియర్ నరేష్ విజయనిర్మలకు మొదటి సంబంధం ద్వారా కలిగిన కొడుకు కాబట్టి… పైగా ఇప్పుడు ఏ సంసారబంధమూ లేదు కాబట్టి, తనను వదిలేస్తే… ఒక బిడ్డ పద్మావతి భర్త గల్లా జయదేవ్… తను తెలుగునాట పేరున్న పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త… కృష్ణ వియ్యపురాలు గల్లా అరుణకుమారి మాజీ మంత్రి… జయదేవ్ కొడుకు అశోక్ గల్లా కూడా సినిమారంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు… వాళ్లకూ కృష్ణ మరణం బాధాకరమే…
మరో బిడ్డ మంజుల, అల్లుడు సంజయ్ స్వరూప్… వీళ్లిద్దరూ ఫీల్డ్‌లోనే ఉన్నారు, కానీ అంతగా పాపులర్ కాలేదు… కానీ తండ్రితో మంజులకు అటాచ్‌మెంట్ ఎక్కువ అంటారు… ఇంకో బిడ్డ ప్రియదర్శి నటుడు, నిర్మాత సుధీర్ బాబును పెళ్లి చేసుకుంది… తనూ ఫీల్డ్‌లో ఇంకా ఎదిగే స్టేజ్‌లోనే ఉన్నాడు… వాళ్లకూ కృష్ణ మరణం బాధాకరమే… అన్నింటికీ మించి కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు…
తను కృష్ణకు కెరీర్ మొదటి నుంచీ బాసటగా ఉన్నాడు… ఒక్కొక్కరే కృష్ణకు దూరమైపోతుంటే… తను ఒంటరి అయిపోతుంటే సైతం… ఆయన కుటుంబమే కృష్ణతో బాగుండేది… ఓ మానసిక భరోసాగా నిలిచింది… నిజానికి కృష్ణ మరణంతో కుంగిపోయేది ఆదిశేషగిరిరావు… అప్పట్లో మరో సోదరుడు హనుమంతరావు, ఆదిశేషగిరిరావులే పద్మాలయా నిర్మాణ, నిర్వహణ వ్యవహారాలన్నీ చూసుకునేవాళ్లు…
బాధ, దుఃఖం కుటుంబంలో అందరికీ ఉంటాయి… కృష్ణ కుటుంబాన్ని ఏదో శాపం కాటేసినట్టు వరుసగా అన్నీ విషాదాలే చోటుచేసుకుంటున్నయ్… మిగిలిన కుటుంబసభ్యులందరికీ అవి కన్నీళ్లే తెచ్చిపెడతాయి… ఎందుకో గానీ కృష్ణ మరణంపై హీరో మహేశ్ బాబు ఒంటరివాడయ్యాడు, భరించలేని దుఃఖం అనే కోణంలో ప్రజెంట్ చేయడం అంత బాగనిపించడం లేదు… ఒక ఘట్టమనేని మృదుల కన్నీళ్లు, ఒక మంజుల కన్నీళ్లు కూడా అంతే ఉప్పగా ఉంటాయి కదా…!!
Share this Article