‘‘ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చిట్ ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు… మార్గదర్శి సహా పలు చిట్ ఫండ్ కంపెనీల్లో ఈ తనిఖీలు సాగుతున్నాయి… చిట్ ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీల అక్రమాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఈ దాడులు నిర్వహిస్తోంది… ప్రధానంగా చిట్స్ ద్వారా వసూలు చేసిన డబ్బును చిట్ ఫండేతర కార్యకలాపాలకు వాడుతున్నారనేది ఈ కంపెనీలపై విమర్శ… చట్టాన్ని ఉల్లంఘించి చిట్ ఫండ్ డబ్బును వడ్డీలకు తిప్పడం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడంతోపాటు రికార్డులు, ఖాతాలు కూడా సరిగ్గా నిర్వహించడం లేదు… అనుమతుల్లేని ఫైనాన్స్ వ్యాపారాల్ని కూడా అధికారులు గుర్తించారు…’’
స్థూలంగా పైపైన చూస్తే ఇది మొత్తం చిట్ ఫండ్ అక్రమాలపై ఒక రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న తనిఖీలు, సోదాలు, దాడులు, అక్రమాల వెలికితీత వ్యవహారం అనిపిస్తుంది… కానీ ఎక్కడైనా సరే, రాజకీయాల్లో ఒక పుల్ల ఇటునుంచి అటు కదిలిందీ అంటే దాని వెనుక ఏదో ఉద్దేశం, ఏదో కథ ఉన్నట్టే లెక్క… పైగా తెలుగు రాజకీయాల్లో మరీనూ… హఠాత్తుగా జగన్ ప్రభుత్వం చిట్‌ఫండ్స్ మీద పడిందీ అంటే వెంటనే గుర్తొచ్చేది రామోజీరావు, మార్గదర్శి చిట్‌ఫండ్స్…
తనకు వ్యతిరేకంగా ఉన్న ఈనాడు ఆర్థికమూలాలు పెకిలించడానికి అప్పట్లో జగన్ తండ్రి రాజశేఖర్‌రెడ్డి సంకల్పించారు… ఉండవల్లిని ముందుపెట్టి మార్గదర్శి అక్రమాలపై న్యాయపోరాటం మొదలుపెట్టారు… శిక్షలు పడతాయా, అక్రమాలు నిరూపితమవుతాయా అనేది వేరే ఇష్యూ… రామోజీని డిస్టర్బ్ చేయడం… వెనక్కి నెట్టడం… దూకుడుగా ముందుకురాకుండా అడ్డుకోవడం… అవసరమైతే ఏ రేంజుకైనా కక్షసాధింపు ఉంటుందనే ఓ హెచ్చరిక జారీచేయడం…
Ads
తను మరణించకుండా ఉంటే కథ ఎలా ఉండేదో గానీ… ఈనాడుకు పెద్ద రిలీఫ్ దొరికింది… జగన్ కూడా తన సమస్యలతోనే సతమతం అవుతూ ఈనాడు మీద పెద్దగా ఫోకస్ చేయలేదు… తరువాత తను అధికారంలోకి వచ్చాక కూడా రామోజీరావుతో పెద్దగా వైరాన్ని మెయింటెయిన్ చేయలేదు… ఒక దశలో రామోజీరావును వెళ్లి కలిశాడు… ఈనాడు కూడా జగన్ పార్టీ మీద, జగన్ మీద సాఫ్ట్ స్టాండ్ తీసుకుంది… కానీ అది తాత్కాలికం అని అందరికీ తెలుసు…
చంద్రబాబు ప్రయోజనాలే రామోజీరావుకు అత్యంత ముఖ్యం… ఒకవైపు తెలుగుదేశం ముఖ్యుల్ని, ఆ సామాజికవర్గాన్ని జగన్ టార్గెట్ చేసి కొడుతున్నాడు… చెల్లాచెదురవుతున్న కేడర్‌ను కాపాడుకోవడం చంద్రబాబుకు ముఖ్యం ఇప్పుడు… దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కావాలి… అందుకే అవి మళ్లీ దూకుడుగా జగన్ మీద పడ్డాయి… పదే పదే తనకు ఈ మీడియా సంస్థలే ప్రత్యర్థులని చెబుతున్న జగన్ నేరుగా ఏ చర్యకూ పూనుకోలేదు… తండ్రిలాగా బ్యాట్ పట్టుకుని మీదపడలేదు… కానీ…
ఉండవల్లి విడిచిపెట్టలేదు… తన ప్రయత్నం వల్లే మార్గదర్శి కేసు సజీవంగా ఉంది… చివరకు సుప్రీంకోర్టు దాకా చేరింది… పట్టువదలని విక్రమార్కుడు ఉండవల్లి… తన ఇగో ఎక్కడో బాగా దెబ్బతింది… ఈమధ్య హడావుడిగా మార్గదర్శి కేసును విచారణకు తీసుకురావాలని ప్రయత్నాలు జరిగాయనీ, ఉండవల్లి రచ్చ వల్లే ఆగిపోయిందనీ అంటారు… ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల్ని ఇన్‌ప్లీడ్ కావాలనీ పదే పదే విజ్ఞప్తి చేశాడు ఆయన… కేసీయార్ ప్రస్తుతానికి ఈనాడు రామోజీతో బాగానే ఉన్నందున తను పట్టించుకోలేదు… రామోజీ కూడా కేసీయార్ జోలికి పోవడం లేదు… తనకు తెలుసు కదా… కేసీయార్‌కు కోపమొస్తే ఆ బ్యాటింగ్ ఎలా ఉంటుందో…
జగన్ కూడా లేటుగా కళ్లు తెరిచి, ఇన్‌ప్లీడ్ అఫిడవిట్ వేశాడు… సో, ఆ కేసు ఇప్పటికీ సజీవమే… ఇప్పుడు ఇక తొలిసారిగా జగన్ ఈనాడుపై బ్యాట్ ఝలిపిస్తున్నాడు… అబ్బే, కేవలం మార్గదర్శి కాదు, పలు చిట్ ఫండ్ కంపెనీలు అనకండి… అదంతా ఓ కవరింగ్… టార్గెట్ మార్గదర్శే… అక్రమాల్ని ఎస్టాబ్లిష్ చేసి, ఓ రిపోర్ట్ రూపొందించి పెడితే… మెడ మీద కత్తి వేలాడదీయవచ్చు… అదీ కథ… అదే ఈ దాడుల కథ… కానీ ఎప్పుడైనా జగన్ తమపైకి దాడికి వచ్చే సంగతి తెలిసిందే కాబట్టి మార్గదర్శి సంస్థ అంత తేలికగా దొరుకుతుందా..? అదీ ప్రశ్న…!!
Share this Article