న్యూస్ చానెళ్లను కాసేపు వదిలేయండి… ఆ దిక్కుమాలిన కవరేజీల తీరు, జుగుప్స రేకెత్తించే డిబేట్లు… భ్రష్టుపట్టించేశాయి పాత్రికేయాన్ని… ఐనా ఒకటీరెండు పెద్ద చానెళ్లకు తప్ప వేరే వాటికి పెద్ద రెవిన్యూ ఏమీ ఉండదు… నాయకుల కాళ్ల దగ్గర పాకడం, జోకడం… డప్పు కొట్టడం… కొందరైతే పైరవీలు, బ్లాక్‌మెయిళ్లు… అయితే మరి వినోద చానెళ్ల స్థితిగతులు ఎలా ఉన్నయ్…? మొన్నమొన్నటిదాకా బాగానే ఉండేది… మస్తు రెవిన్యూ… అన్ని భాషల చానెళ్లూ దండుకున్నయ్…
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద పొల్యూషన్ ఏమిటంటే… టీవీ సీరియళ్లు..! వాటితో చానెళ్లు డబ్బు ముద్రించుకున్నయ్ ఒక్క ముక్కలో చెప్పాలంటే… అత్యంత దరిద్రమైన క్రియేటివిటీ… రాబోయే అయిదూ పదేళ్లలో ఇంత భారీగా రెవిన్యూ పెరగబోతోందని అంచనాలు కూడా వేసుకున్నయ్… కానీ ప్రస్తుతం అంత సీన్ లేదు… ఓటీటీ దెబ్బకు టీవీలు వణికిపోతున్నయ్… ఈ దిగువ టేబుల్ చూడండి ఓసారి…
Ads
అధికారికంగానే టీవీలను వీక్షించేవారి సంఖ్యను, సమయాన్ని, రేటింగ్స్‌ను బార్క్ అనే సంస్థ ప్రతివారం విడుదల చేస్తుంటుంది… అది ఎంత అశాస్త్రీయమో, అందులో దందాలు ఏమిటో కూడా కాసేపు వదిలేస్తే… 2020 (ఆ ఏడాదిలో 39వ వారం రేటింగ్స్)తో పోలిస్తే 2022 (ఈ ఏడాది 45 వారం రేటింగ్స్) నాటికి మొత్తం రేటింగ్స్ పతనం 29 శాతం… అదీ తెలుగులోనే… వేరే భాషల్లోనూ ట్రెండ్ భిన్నంగా ఏమీ లేదు… (మధ్యలో కరోనా కాలంలో రేటింగ్స్ ఆగాయి…) ఈటీవీ, జెమిని, మాటీవీ, జీటీవీ కలిసి 29 శాతం పతనం అంటే ఒకరకంగా ప్రమాద హెచ్చరికే… ఈటీవీ 42 శాతం జీఆర్పీలు కోల్పోగా, జెమిని 46 శాతం కోల్పోయింది…
మనం ఆమధ్య తెలుగు పత్రికల కాపీలు ఎలా పడిపోయాయో చెప్పుకున్నాం… పైన ఉన్న టేబుల్ ఈనాడు 26 శాతం సర్క్యులేషన్ కోల్పోయిన తీరును చెబుతోంది… ఆంధ్రజ్యోతి కూడా అంతే… సాక్షి కాస్త తక్కువ పతనంలో ఉంది… ప్రింట్ మీడియా ఎలాంటి గడ్డు స్థితిని ఎదుర్కుంటున్నదో వినోద చానెళ్ల గతీ అంతే… ఎందుకిలా..?
సేమ్, థియేటర్లలాగే… ఓటీటీ ఎఫెక్ట్… బ్రాడ్‌బ్యాండ్ చీప్‌గా దొరుకుతోంది… ఓటీటీలో సినిమాలు, ఇతర కంటెంటు చూడటానికి కరోనాకాలంలో ప్రజలు అలవాటు పడ్డారు… అంతెందుకు..? సీరియళ్లను కూడా మహిళలు టీవీల్లో చూడటం లేదు… తమకు టైమ్ ఉన్నప్పుడు తాపీగా ట్యాబుల్లో చూస్తున్నారు… జీ5 ఓపెన్ చేస్తే జీటీవీ కార్యక్రమాలు… హాట్‌స్టార్ ఓపెన్ చేస్తే మాటీవీ… అదనంగా ఈమధ్య టీవీ వినోద చానెల్‌గా మారుతున్న ఆహా ఓటీటీ… ఇతర భాషల ప్రోగ్రామ్స్ సరేసరి…
ఎంచక్కా సబ్ టైటిల్స్… వేర్వేరు భాషల సినిమాలు, వెబ్ సీరీస్… ఒక్కసారి పైన టేబుల్ చూడండి… టీవీ ప్రోగ్రామ్స్ అన్నీ దయనీయమైన రేటింగ్స్‌తో కనిపిస్తున్నయ్… ఈటీవీలో ఆలీతో సరదాగా షోకు మరీ ఘోరంగా 1.39… ఒకప్పుడు బాలు అద్భుతంగా నిర్వహించిన పాడుతా తీయగా షోకు ఇప్పుడు రేటింగ్స్ 1.84… జీటీవీలో పాపులర్ సీరియల్ త్రినయని కూడా 7.5 దాటడం లేదు… మాటీవీలో ఒకప్పుడు వెలుగు వెలిగిన కార్తీకదీపం ఇప్పుడు 10, 11 దగ్గరే కొట్టుకుంటోంది… సో, వినోద చానెళ్లు ‘పచ్చగా’ ఏమీ లేవు… సరికదా ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నయ్…!!
Share this Article