ప్రస్తుతానికి ఎర్రచీమలు బతికిపోయాయి… మూడు నెలల వరకు ఢోకా లేదు… ఈలోపు ఏ పతంజలి రాందేవ్‌బాబా కన్నో పడితే మాత్రం… పాపం, ఒడిశాలో ఒక్క ఎర్ర చీమ కూడా మిగులుతుందో లేదో తెలియదు… ఎందుకంటారా..? ఒడిశాలో గిరిజనులు దగ్గు, జలుబు, శ్వాసకోశ ఇబ్బంది, ఫ్లూ జ్వరం వస్తే… ఆ చుట్టుపక్కల ఉండే ఎర్రచీమల్ని పట్టుకొచ్చి, పచ్చిమిరపకాయలు వేసి తమదై శైలిలో పచ్చడి చేస్తారు… మెల్లిమెల్లిగా అనారోగ్యం లక్షణాలు తగ్గిపోతయ్… అదీ అసలు విషయం…
ఎహె, ఊరుకొండి మాస్టారూ… శాస్త్రీయ పరిశోధనలకు ఇలాంటి మూలికలు, వేర్ల మందుల గురించి మీరు కూడా నమ్మేలా రాస్తే ఎలా అంటారా..? తప్పు… అడవిలో అన్నీ ఉన్నాయి… కానీ మనమే వదిలేశాం… వైరస్‌కు మందు దేశీయ వైద్యంలో ఉంది, కానీ మనం ఏనాడో ఆ పుస్తకాల్ని విడిచిపెట్టేశాం… అల్లోపతిలో మాత్రమే అంతా ఉందనే భ్రమల్లో బతికాం… బతుకుతున్నాం…
Ads
అంతెందుకు..? మన వంటింటి పోపుల పెట్టెలో రోగనిరోధకశక్తిని పెంచే సరుకులున్నాయనీ, బామ్మలు చెప్పిన వంటల్లోనే మన దేహాల్ని సురక్షితంగా ఉంచే చిట్కాలున్నాయనీ ఇన్నాళ్లు మనకు తెలిస్తే కదా, తెలుసుకుంటే కదా… ఇప్పుడు కషాయాలు, ఆవిరిపట్టుకోవడాలు అర్జెంటుగా ఆదుకుంటున్నయ్… బయటి నుంచి మందులు పనిచేయవనీ, మన దేహాన్నే మందుగా మార్చాలనీ, అంటే రోగనిరోధకశక్తిని సమకూర్చాలని గతంలో ఓ మూలికావైద్యుడో చెబితే తన్నితరిమేసేవాళ్లు…
సరే, మన ఎర్రచీమల దగ్గరకొద్దాం… ఇదేదో వర్కవుట్ అయ్యేట్టు ఉందని కార్పొరేట్ ఆయుర్వేద బేహారులు ఇప్పటికే పట్టుకోలేదు… లేకపోతే అదే గిరిజనులకు డబ్బులిచ్చి, చీమల పచ్చళ్లు పెట్టించి, డబ్బాల్లో పెట్టేసి, గుట్టలకొద్దీ కాసులు తవ్వుకునేవాళ్లు… ఎర్ర చీమల జాతి కనుమరుగైనా సరే…!
బారిపడకు చెందిన నయధర్ పథియాల్ హైకోర్టులో ఓ పిల్ వేశాడు… ఎర్ర చీమల పచ్చడి ఎంతోకాలంగా గిరిజనులను వైరస్ జ్వరాలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తోందనీ, దీనిపై పరిశోధనలు చేయించాలని కోరాడు… ఇదేదో పరిశీలించి మూడు నెలల్లో జవాబు చెప్పాలని హైకోర్టు ఆయుష్ మంత్రిత్వ శాఖను ఆదేశించింది… ఆ శాఖ సీరియస్‌గా దేన్నీ తీసుకోదు, ఆ అలవాటే లేదు దానికి… సో, ఎర్రచీమలకు ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమీ లేదు… బతికిపోయాయ్…!!
చివరగా :: ఓ సంప్రదాయ కుటుంబం… మాంసం కాదు కదా, కనీసం గుడ్డు వాసన కూడా చూడరు… ఎవడో చెప్పాడట, కోడిమాంసం తింటే కరోనా రాదు అని… వచ్చినా తట్టుకుంటాం అని… ఇంకేముంది..? రోజూ రెండు పూటలు కోడిమాంసం ఉడికించుకుని తింటున్నది ఆ ఫ్యామిలీ… భయం… అలాంటివాళ్లు చాలామంది ఉన్నారు ఇప్పుడు… ప్చ్, అలాంటి వాళ్లు ఈ ఎర్రచీమల వార్తలు చదవకపోవడమే మంచిది…!!
Share this Article