తాడో పేడో… బీజేపీ అంతగా కాన్సంట్రేట్ చేస్తోంది తెలంగాణ మీద… కేసీయార్ మీద… ఇంకా చేయబోతోంది… తప్పనిసరై కేసీయార్ కూడా బలంగా ప్రతిఘటిస్తున్నాడు… అయితే తనదైన శైలిలో, ముందస్తు దాడి వ్యూహంతో…! మొన్నటి ఎమ్మెల్యేల కొనుగోలు పథకాలు, ఆ వీడియోల విడుదల అందులో భాగమే… కాకపోతే స్కెచ్ ఎక్కడో తన తాజా అదృష్టంలాగే గాడితప్పి తుస్సుమంది… వీసమెత్తు ఇంపాక్ట్ లేదు… పైగా చివరకు హైకోర్టుకు సారీ చెప్పుకోవాల్సి వచ్చింది… బీజేపీని బజారుకు లాగి, ఇరుకునపెట్టడానికి ఇంకేదో ఆలోచిస్తూనే ఉంటాడు… సినిమా రిలీజయ్యేవరకూ తెలియదు…
కాకపోతే తన జాతీయ రాజకీయాల పీరి లేస్తలేదు, ఊదు కాల్తలేదు… ఐనాసరే, నిన్నమొన్నటిదాకా బీజేపీ హైకమాండ్ మరీ అంత సీరియస్‌గా తీసుకున్నట్టుగా కనిపించలేదు… ఏదో రాజకీయ పక్షాల నడుమ ఉంటే ఎత్తుగడలే అనుకున్నారు అందరూ… ఎప్పుడైతే ఈ వీడియో గేమ్‌కు కేసీయార్ తెరతీశాడో, సంతోష్ వంటి నేతల్నీ ‘సిట్’ పేరుతో బజారుకు లాగాలని ప్రయత్నిస్తున్నాడో ప్రధాని మోడీ సహా అందరికీ సీటు కింద మంట సెగ కాస్త గట్టిగానే తగిలినట్టుంది… మన ప్రభుత్వ ‘సిట్’ కదా… కేసీయార్ ఆలోచనలకు తగ్గట్టుగానే నోటీసులు గట్రా నడుస్తున్నయ్… (ఆ ఫోన్లలో మోడీ పేరు, ప్రస్తావన వచ్చి ఉంటే ఆయనకూ నోటీసులు వెళ్లేవేమో… విచారణకు హాజరు కాకపోతే అరెస్టు తప్పదు అంటూ…)
ఇంకోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంను బీజేపీ గట్టిగానే బిగిస్తోంది… చీకోటి వ్యవహారాన్ని కూడా…! సరే, బీజేపీకి ఏ రాష్ట్రంలోనూ కేసీయార్ వంటి థకడా లీడర్ ఎదురుకాలేదు… పైగా టీఆర్ఎస్‌లో షిండే ఎవరూ దొరకడం లేదు… తన పార్టీలో ఎవరికీ అంత సీన్ ఉంచడు కదా కేసీయార్… కాలర్ ఎగిరితే తల కట్ చేస్తాడు… మరోవైపు బీజేపీకి ఇంటర్నల్ సమస్యలు… ఎవరు కేసీయార్ కోవర్టో హైకమాండ్‌కే అంతుపట్టదు… ఇదంతా ఒక స్టోరీ…
Ads
కాంగ్రెస్ పార్టీది అదో ప్రపంచం… ఆ గ్రూపులు, ఆ తన్నులాటలు… కాంగ్రెస్‌కు వోట్లేస్తూ వచ్చినవాళ్లకు కూడా ఇక ఏవగింపు కలుగుతోంది… చంద్రబాబు వ్యూహం మేరకు చేరినా సరే, రేవంత్ కాంగ్రెస్ ఎంట్రీ తన పర్సనల్, పొలిటికల్ కెరీర్‌కు దీర్ఘకాలంలో ఏ ఫాయిదా కలిగించదు… బీజేపీయేమో తనను రానివ్వదు… (రేవంత్ రాజకీయ జీవితం కాషాయశిబిరంలోనే స్టార్టయింది)… ఎందుకంటే, తనకు సీఎం కుర్చీ హామీ ఇవ్వాలి… ఎహెఫో అంటుంది బీజేపీ… సో, ఇలా టీఆర్ఎస్ మీదకు దూకుడుగా వెళ్లే సీన్ లేదు కాంగ్రెస్‌లో… వాళ్లు తిట్టుకోవడానికే టైమ్ సరిపోవడం లేదు… పార్టీలో ఎవరు కేసీయార్ మనుషులో, ఎవరు రాహుల్ గాంధీ మనుషులో చెప్పలేని దురవస్థ…
ఇదంతా తెలంగాణ వర్తమాన రాజకీయానికి ఒకవైపు చిత్రం… విచిత్రంగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌లో జోష్ అకస్మాత్తుగా మాయమైంది… మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారు గానీ, కాస్త పేరున్న నేతలు కూడా నోరు విప్పడానికి వెనుకాడుతున్నారు… (ఏపీలో చంద్రబాబును జగన్ ఎంత తొక్కుతున్నా సరే, టీడీపీ ఎక్కడా తగ్గడం లేదు… ఢీ అంటే ఢీ అంటోంది…) చివరకు షర్మిల వంటి ప్రభావరహిత నేతలు చేసే విమర్శలకు కూడా బలంగా కౌంటర్లు ఇచ్చేవాడు కనిపించడం లేదు…
చివరకు ఆమె నేరుగా కేసీయార్ కుటుంబసభ్యుల్నే టార్గెట్ చేసి, ఆరోపణలు, పరుషవ్యాఖ్యలు సంధిస్తున్నా సరే, టీఆర్ఎస్ ప్రధాన కేడర్ నుంచి స్పందన కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది… అక్కడక్కడా ఒకరిద్దరు నేతలు స్పందిస్తున్నా పంచ్ ఉండటం లేదు… ఈ స్తబ్దతకు కారణం ఏమిటో కేసీయార్ ఆత్మమథనం చేసుకుంటున్నాడా లేదా తెలియదు గానీ… తన కూతురు కవిత మీద అర్వింద్ వంటి నేతలు నోరుపారేసుకుంటున్నా సరే… అదే రీతిలో కౌంటర్ రియాక్షన్ కనిపించడం లేదు… ఏమన్నా అంటే, ఇంటి మీద దాడికి దిగుతారు…
నాలుగు అద్దాలు పగులగొట్టి, రెండు కుండీలు విరగ్గొట్టి, చెప్పుల స్టాండ్ ఎత్తుకుపోతే బెదిరిపోతుందా బీజేపీ… పైగా ఇదంతా కవిత మీద సానుభూతి రావల్సిందిపోయి, జనంలోకి ఆమె పట్ల నెగెటివ్‌గా వెళ్లిపోతోంది… ఇంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల అధ్యక్షులు… తమ అధినేత కూతురి మీద ‘చిల్లర భాషలో’ అర్వింద్ తదితరులు జరిపే దాడికి అస్సలు పొలిటికల్ కౌంటర్, రియాక్షన్ ఏది..?
చివరకు ఆమే స్వయంగా… నిజామాబాద్‌లో చెప్పుతో కొడతాను అని ధాటిగా అర్వింద్ మీద దాడికి దిగాల్సి వచ్చింది… నిజంగానే టీఆర్ఎస్ ప్రధాన శ్రేణుల్లో ఈ స్తబ్దతకు కారణమేమిటి..? అభద్రతా..? సిట్టింగులందరికీ టికెట్లు అని చెప్పాడు కదా… ఇంకేం..? నయా తెలంగాణ జమీందార్లకు పండుగ అయి ఉండాలి కదా… ఆ ఉత్సాహమూ లేదెందుకు..? అమ్మో, వీళ్లు వదలరా మనల్ని అని జనం అనుకోవచ్చుగాక, కానీ కనీసం సిట్టింగులకైనా కేసీయార్ భరోసా జోష్ ఇచ్చి ఉండాలి కదా… అదీ కనిపించడం లేదెందుకు..?!
Share this Article