‘‘అయ్యారే, ఆ నాగవల్లి బుసలు కొట్టదేమి..? రుధిర వర్షాన్ని కురిపించదేమి..? ఏమైంది ఆ టెంపర్మెంట్..? అకస్మాత్తుగా చల్లబడిపోయిందా దేవి..?’’ ఇలాంటి డైలాగులు నాలుగు గుర్తొచ్చాయి ఈ టీజర్ చేస్తే…! ఏం టీజర్ అంటారా..? అదే గిట్టనివాళ్లు పాగల్సేన్ అంటుంటారు కదా… ఆ విష్వక్ సేన్ తనే మెగాఫోన్ పట్టుకుని, చకచకా ఓ సినిమా తీసిపారేశాడు కదా… ధమ్కీ పేరిట…
మన భోళా బాలయ్య వెళ్లి పోస్టర్ కూడా ఆవిష్కరించాడు కదా… సదరు విష్వక్సేనుడు ఆ సినిమాలో టీవీ9 దేవిని ఉద్దేశించి ఓ చిల్లర, వెగటు సీన్ పెట్టాడు… పాత వివాదం తెలుసు కదా… ఏదో సినిమాకు ఓ పిచ్చి ఫ్రాంక్ సీన్ క్రియేట్ చేయడం, తరువాత టీవీ9లో దేవి విష్వక్ వచ్చాక ఏదో చెప్పబోతే ‘గెటౌట్ ఫ్రమ్ మై స్టూడియో’ అని తర్జని చూపించడం గుర్తుంది కదా…
మరి హీరో కదా… అందులోనూ బాలయ్య వంటి సపోర్టర్లు… అందుకే అంతటి హీరో అర్జున్ను ఎహెఫోవోయ్ అని మొన్న ఏదో సినిమాకు సంబంధించి పక్కకు నెట్టేశాడు… ఫలక్నుమా దాస్ దగ్గర నుంచి ప్రతి సినిమాకు ఓ కంట్రవర్సీ… అహం… అర్జున్ వివాదం ఇప్పట్లో మరపుకురాదు… పైగా చీప్ టేస్ట్… ఎందుకంటే..?
Ads
టీవీ9 వివాదం అక్కడే సమసిపోయింది… పోవాలి… కొందరు ఆమెదే తప్పు అన్నారు, కొందరు విష్వక్దే తప్పు అన్నారు… కానీ ఫుల్ స్టాప్ పడాలి అక్కడే… కానీ దాన్ని కడుపులో అలాగే ఉంచుకుని, ఇప్పుడు తను తీస్తున్న సినిమా కాబట్టి వెగటు సీన్ పెట్టి, ఆమె పట్ల అంత చిల్లరతనం ప్రదర్శించాలా..? కారులో తను వెళ్తుంటాడు, పక్కన హీరోయినో మరెవరో… తనకు ముద్దు పెడుతుంది… హీరో కదా, మెడికల్ షాపు దగ్గర ఆపాలా అనడుగుతాడు… అర్థం చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత… మరి విష్వక్ కదా బూతులు లేకపోతే ఎలా..? తరువాత ఆమె గెటౌట్ ఫ్రమ్ మై కార్ అంటుంది… అంటే అర్థమైంది కదా, ఈ సీన్ ఎవరి మీద ప్రతీకారమో… ఏ స్థాయి అభిరుచో…!
ఆమె టెంపర్మెంట్కు ఆమె ఎందుకు రియాక్ట్ కాలేదో తెలియదు… నంబర్ వన్ నుంచి కిందకు జారిపోయాక టీవీ9లో మునుపటి టెంపర్ లేదు, ఆ దూకుడు లేదు… చివరకు తమ కీలక ఉద్యోగి పట్ల ఎవరో పరాభవ ధోరణితో సినిమాలో సీన్ పెడితే స్పందించే స్థితి లేదు… స్తబ్దంగా పడి ఉంది టీవీ9… తోటి మహిళా జర్నలిస్టులు సైలెంట్… భయమా..? ప్రగతిశీలవిప్లవచైతన్యాభ్యుదయ మహిళలకు నోళ్లు పెగలవు… ఒక హీరోకు, దర్శకుడికి సాగిలపడుతున్నారా..? పోనీ, దేవికి ఈ శాస్తి జరగాల్సిందే అనేది వాళ్ల అభిప్రాయమా..?
నిజానికి ఆమే దర్శకురాలు కాబోతోంది… హైదరాబాద్ పహిల్వాన్ల మీద స్క్రిప్టు వర్క్ దాదాపు పూర్తి కావొచ్చింది… రీసెర్చ్ అయిపోయింది… ప్రిప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది… ఈమధ్యే అనుభవం కోసం ఓ షార్ట్ ఫిలిమ్ కూడా తీసింది… సో, ఇప్పుడు ధమ్కీలో విష్వక్సేనుడు ఏమేం సీన్లు పెట్టాడో చూసి, ఆ తరువాత తన సినిమాలో కౌంటర్ సీన్లు పెట్టుకోవాలా ఆమె..? మనకు తెలిసిన దాసరి మనవరాలు దేవేనా ఆమె…? నాగవల్లి బుసలు మరిచిపోయిందా..?!
Share this Article