ఏనాడు గెలిచింది వలపు..? తానోడుటే దాని గెలుపు…. ఎంత బాగా చెప్పేశాడు రచయిత సూటిగా… ప్రేమ ఎప్పుడు గెలిచిందని, అసలు ఓడిపోవడమే కదా దానికి తెలిసిన గెలుపు…. అంటూ ప్రేమ వైఫల్యాల గురించి నిర్వేదంగా ఒకే వాక్యంలో తేల్చేస్తాడు… అవును, ఇలాంటి రాయాలంటే ఆత్రేయే కదా… సరళమైన పదాలతో అనంతమైన భావాల్ని నింపుతూ నింపుతూ సాగిపోతుంటయ్ పాటలు… నిజానికి ఇది కథ కాదు అనే బాలచందర్ సినిమాలోని అన్ని పాటలూ బాగుంటయ్… ఎంఎస్ విశ్వనాథన్ ప్రతి పాటనూ ఓ మరుపురాని కావ్యమే చేశాడు…
చిరంజీవి నెగెటివ్ షేడ్స్ పాత్ర ధరించిన అతి కొద్ది సినిమాల్లో ఇదీ ఒకటి… అంతటి కమల్ హాసనుడు కూడా ఒక పాత్రే తప్ప లీడ్ రోల్ కాదు… శరత్‌బాబు, జయసుధ, సరిత సరేసరి… 1) సరిగమలు, గలగలలు… ప్రియుడే సంగీతము అనే పాట సుశీల పాడింది… 2) ఇటుఅటు కాని హృదయంతోని, ఎందుకురా ఈ తొందర నీకు అనే పాట అప్పుడప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న వెంట్రిలాక్విజాన్ని కూడా పరిచయం చేస్తుంది… ఓ ప్రియుడు తనలోని భావాల్ని చెప్పలేక, తన బొమ్మ రూపంలో చెప్పడానికి ప్రయత్నిస్తాడు… మంచి ప్రయోగం…
Ads
ఇదే సినిమాలోని గాలికదుపు లేదు, కడలికంతు లేదు అనే పాట గురించి విడిగా చెప్పుకోవల్సిందే… అయితే ఇందులోనే మరోపాట ఉంటుంది… అది ఇలా స్టార్టవుతుంది…
కుకుమల్లెకిట కుకుమల్లెకిట కుకుమల్లెకిట చంచం
మేరిపపిమిట మేరిపపిమిట మేరిపపిమిట పంపం
తకథిమితక థిమితక థిమితకథిమి తక ధింధిం
జతజతకొక కథ ఉన్నది.చరితైతే ఝంఝం
ఇదీ మంచి భావాల్ని రంగరించుకున్న పాటే… కానీ మిగతా పాటలకొచ్చిన పాపులారిటీ దీనికి రాలేదు ఎందుకో మరి… పైగా సినిమాలోనూ కీలక సందర్భంలోనే వస్తుంది… ఒక పాటలో వెంట్రిలాక్విజాన్ని ఆశ్రయించిన దర్శకుడు ఈ పాటలో సదరు మిమిక్రీ ఆర్టిస్టుతోనే ఓ వేషం వేయిస్తాడు… మెజీషియన్ బొమ్మ… తన ద్వారా కథా సందర్భాన్ని, తన అభిప్రాయాన్ని చెబుతాడు… ఆ పాటలో కమల్ నిజంగానే రెచ్చిపోయాడు… ఓ ఆర్టిస్టుగా ఇండియన్ సినిమా గర్వించదగినవాడు…
ఇప్పుడంటే హీరోయిజం అనేకానేక అవలక్షణాలతో భ్రష్టుపట్టిపోయింది గానీ… గతంలో ఎంతటి పెద్ద హీరోలైనా సరే… మట్టిముద్దల్లా దర్శకుల ఎదుట నిలబడేవాళ్లు… ఎలా మలుచుకున్నా సరే, దర్శకుడి ఇష్టం… అలా పాత్రల్లో అణకువగా ఒదిగిపోయిన కమల్ అలా మంచి మంచి పాత్రల్ని దక్కించుకున్నాడు… ఈ పాటకొస్తే…
ఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందం.. ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం…
ప్రేమ పెళ్లి విషయంలో ద్వైధీభావాలు, పలు ముఖాలు కరెక్టు కాదని చెబుతాడు రచయిత… సందర్భం కూడా అదే…
ఈ లోకమొక ఆటస్థలము… ఈ ఆట ఆడేది క్షణము… ఆడించు వాడెవ్వడైనా… ఆడాలి ఈ కీలుబొమ్మ… ఇది తెలిసీ… తుది తెలిసీ, ఇంకెందుకు గర్వం..? తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్దం..!!
ఆడించేవాడు ఎవడో ఆడిస్తూనే ఉంటాడు, ఈ కీలుబొమ్మ ఆడుతూనే ఉంటుంది… ఫలితం తెలిసినా, తన ప్రమేయమే లేదని తెలిసినా… ఐనా ప్రతి బొమ్మకూ తన ఆటే గెలవాలనే స్వార్థం దేనికి అని ప్రశ్నిస్తాడు… (ఆ కీలుబొమ్మలాగే కమల్ వేషం… ఒక పాటలో బొమ్మను వాడుకున్న దర్శకుడు ఈ పాటలో తననే ఆటబొమ్మగా మార్చి కథ చెబుతాడు…)
గాయాన్ని మాన్పేది మరుపు.. ప్రాణాల్ని నిలిపేది రేపు.. ప్రతి మాపు ఒక రేపై తెరవాలి తలుపు.. ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు.. ప్రతి మాపు ఒక రేపై తెరవాలి తలుపు.. ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు..
ఆశావాదంతో ఎలా ముందుకు పోవాలో… గాయాల్ని మాన్పి కాలం ఏ మేలిమలుపును తెచ్చి పెడుతుందో చూడాల్సిందే అని చెబుతాడు… కథకు తగ్గ చరణాలు… తరువాత జయసుధ అందరినీ విడిచిపెట్టేసి, భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్లిపోతుంది…!!
Share this Article