ఒక చిన్న దళిత రైతు… నిజానికి తనకు లక్షలు దక్కాలి… కానీ ఓ యూనివర్శిటీ తనను మోసగించింది… పరిశోధనలు చేతకాని శాస్త్రవేత్తలు ఈ రైతు డెవలప్ చేసిన ఓ వరి రకాన్ని హైజాక్ చేశారు… పేటెంట్ రైట్స్ పొందారు… ఎంత దారుణం అంటే… చివరకు ఆ రైతు తన అనారోగ్యానికి సరైన చికిత్స చేయించుకోలేక గడ్చిరోలిలో ఓ ఆదర్శ డాక్టర్ల జంట నడిపే హాస్పిటల్‌లో చేరి, అక్కడే చనిపోయాడు… ఇదీ సంక్షిప్తంగా కథ…
చెప్పుకున్నాం కదా… మన యూనివర్శిటీల్లో డొల్లతనం ఇంకేమీ లేదు… అన్ని రాష్ట్రాల వర్శిటీలు, రీసెర్చ్ స్టేషన్లు కలిసి వందలు, వేల కోట్లను మింగుతున్నాయి తప్ప ఏ ఫాయిదా లేదు, సరికదా ఇదుగో ఈ కుట్రలు, కుతంత్రాలు… దీన్నేమనాలి..? మనకు ఎందుకు ఇంట్రస్టు అంటే… ఆ రైతు సొంతంగా డెవలప్ చేసిన రకం పేరు హెచ్ఎంటీ… ఈరోజు టాప్ డిమాండ్… సన్నరకాల్ని తినే వైభోగం మన తెలుగువాళ్లదే కదా… రేటు ఎక్కువైనా సరే హెచ్ఎంటీని బలంగా ఓన్ చేసుకున్నారు…
హైదరాబాద్ మార్కెటే తీసుకుంటే మీకు ఎక్కడా హెచ్ఎంటీ పాత బియ్యం దొరకవు… బాయిల్డ్ నే పాత బియ్యంగా చూపి, ఎక్కువ రేట్లకు అమ్ముతారు… అసలు పాత బియ్యం మిగలనిస్తే కదా… హెచ్ఎంటీ అనుకరణ వెరయిటీలు కూడా బోలెడు… దాని టేస్టు అది, దాని నాణ్యత అది… తక్కువ పంటకాలం, తక్కువ చీడపీడలు, ఎక్కువ దిగుబడి, పైగా నాణ్యమైన ధాన్యం… ఇంకేం కావాలి..? సరే, ఆ కథేమిటో చదవాలి ఓసారి…
Ads
మన పొరుగునే ఉన్న నాందేడ్ జిల్లా, చందాపూర్ తాలూకా, నాగబిడ్ ఊరు… ఓరోజు దాదాజీ తన పొలంలో ఓ వరి కంకిని గమనించాడు… భిన్నంగా ఉంది… గింజ పొడవుగా ఉంది, సన్నగా ఉంది… దాన్ని వేరు చేశాడు, అలాంటివే మరో నాలుగైదు కనిపించాయి… ఈ గింజల్ని విడిగా నారు పోశాడు… వచ్చిన ‘పంటను’ మళ్లీ వేశాడు, తాలు తీసేశాడు… బియ్యం పట్టించాడు కొంత… అన్నం అదిరిపోయింది… ఇరుగుపొరుగు రైతులకు ఫ్రీగా ఆ సీడ్ ఇచ్చాడు…
అందరికీ మంచి లాభాలు… అప్పట్లో నాణ్యత అంటే హెచ్ఎంటీ వాచీలు కదా… తన చేతివైపు ఓసారి చూసి, ఆ వెరయిటీకి హెచ్ఎంటీ అని పేరు పెట్టాడు… పేద, దళిత రైతుకు పేటెంట్ల దందాలు ఏం తెలుసు..? ఈలోపు సమీపంలోని డాక్టర్ పంజాబ్‌రావు దేశముఖ్ కృషి విద్యాపీఠ్ యూనివర్శిటీ ఉంది… దాదాజీ దగ్గర అయిదు కిలల విత్తనాలు తీసుకుపోయింది… మల్టిప్లయ్ చేసింది… దానికి పీకేవీ హెచ్ఎంటీ అని పేరు పెట్టి, పేటెంట్ కోసం అప్లయ్ చేసింది… సాధించింది…
తీరా ఒకరిద్దరు ఎన్జీవోలు జరిగిన మోసాన్ని గుర్తించి, ఇదే హెచ్ఎంటీతోపాటు దాదాజీ డెవలప్ చేసిన ఇతర వెరయిటీల డేటా అంతా సేకరించి, నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు చేయించారు… కానీ ఈ ప్రాసెస్ జరుగుతుంటే మరోవైపు ప్రైవేటు వ్యాపారులు యూనివర్శిటీ గొప్పలు చెప్పుకున్న చోరీ వంగడాన్ని బలంగా మార్కెట్‌లోకి పుష్ చేశారు… దాదాజీ మొర వినిపించుకునేవాడే లేడు… తరువాత కొంత రచ్చ జరిగాక ప్రభుత్వం ‘కృషి భూషణ్ పురస్కారాన్ని’ ఇచ్చింది… ష్… ఎంత నీచం అంటే, గోల్డ్ మెడల్ బదులు కాపర్ మెడల్ ఇచ్చారట...
తరువాత అదీ రచ్చ జరిగాక రీప్లేస్ చేశారు… తరువాత తనకు పక్షవాతం వచ్చింది… చికిత్సకు డబ్బుల్లేవు… నాగపూర్ చేరింది ఆ కుటుంబం… ప్రభుత్వం కోరగా కోరగా 2 లక్షలు ‘సాయం’ చేసి, అదే ఎక్కువ అనేసింది… అవీ అయిపోయాయి… చివరకు విధిలేక గడ్చిరోలి అడవుల్లో ఓ ఆదర్శ డాక్టర్ల జంట హాస్పిటల్ నడిపిస్తుంటే, అక్కడికి చేరాడు దాదాజీ… చివరకు అక్కడే కన్నుమూశాడు… తన శ్రమను, తన ప్రయాసను, తనకు దక్కాల్సిన ఖ్యాతిని, డబ్బును చోరీ చేసిన దొంగలు బలిసిపోతే… దాదాజీ మాత్రం అనామకంగా ప్రాణాలు వదిలాడు… ఇదీ మన సిస్టం… ఇంకా ఎక్కువ చెప్పదలుచుకోలేదు…!
Share this Article