Taadi Prakash…… రారా.. ఒక ఉత్తేజం…. నవంబర్ 24 , కడపలో రా.రా. శతజయంతి సభ జరుగుతున్న సందర్భంగా … ‘రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) గదాఘాతం నుంచి తప్పించుకున్నది బహుశా నేనొక్కడినే’ అన్నారొకసారి సాక్షాత్తూ పుట్టపర్తి నారాయణాచార్యులవారు. ఏ కొమ్ములు తిరిగిన విమర్శకుడికైనా ఇంతకంటే గొప్ప ప్రశంస ఏముంటుంది?
సన్నిహిత మిత్రులైన కేతు విశ్వనాథరెడ్డి, వైసివి రెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, సొదుం జయరామ్ల అవ్యాజ ప్రేమని పొందడం సరే, శ్రీశ్రీ, ఆరుద్ర, కొడవటిగంటి, జ్వాలాముఖి లాంటి సాహితీవేత్తల గౌరవానికి పాత్రుడైనవాడు రారా. రారా విమర్శ, రారా వ్యక్తిత్వం, రారా వచనం… అదొక అద్భుతమైన కాక్టెయిల్. గొప్ప నవల, ఉత్తమ కవిత్వం. పరవళ్లు తొక్కే పద్యం ఇచ్చే కిక్కుని సాహిత్య విమర్శ ద్వారా ఇవ్వగలిగినవాడు రారా ఒక్కడే!
ఆ మేజిక్ ఆయనకెలా తెలుసు? చలం జీవితాదర్శం, శ్రీశ్రీ ఖడ్గసృష్టి, గురజాడ కన్యాశుల్కం, రారా ‘సారస్వత వివేచన’ నన్ను ఒక్కలాగే పరవశుణ్ణి చేశాయి. నిద్రకి దూరం చేశాయి. ఏమిటి రారాకి తెలిసిన ఆ రహస్యం? చాలా సింపుల్. ఆయన నిష్కపటి. నిర్మొహమాటి. నిజాయితీని నిప్పుల్లో కాల్చుకుతినే కిరాతకుడు. చలం చెప్పినట్టు నువ్వో నేనో ఇప్పించే రెండు ఇడ్డెన్ల మీద ఇన్స్పైర్ అయి పొగిడే రకం అస్సలు కాదు. తాళ్లపాక అన్నమాచార్యులు, పుట్టపర్తి నారాయణాచార్యులు, రాచమల్లు రామచంద్రారెడ్డి… రాయలసీమ సాహితీరుచుల్ని మనకందించిన ఈ ముగ్గురూ చిత్రంగా కడప జిల్లా వాళ్లే.
Ads
గురజాడ మనస్తత్వంలో విపరీత ధోరణులు అనే ధైర్యం ఎవరైనా చేయగలిగారా? చూడండి ఈ చలం ఎంత దిగజారుడు రాతలు రాశారో అనగలమా? స్త్రీని పట్టుకుని ‘‘నన్ను కౌగలించుకున్న పెద్దపులివి’’ అన్న దేవరకొండ బాలగంగాధర తిలక్ అభ్యుదయ కవి ఎలా అవుతాడు? అని నిలదీయడానికెంతో దమ్ముండాలి! అలా పిడుగులా విరుచుకుపడిపోవడం రారా మెథడ్. పొగడటం చేతకాకా కాదు, లౌక్యం తెలీకా కాదు. హృదయం నిండా ప్రేమనిండిన మనిషి. అది సాహిత్యం మీద, అది సమాజమ్మీద– కురిసే వెన్నెల లాంటి ప్రేమ. కపటత్వం అంటే కోపం. ప్రలోభం అంటే చిరాకు. పవిత్రమైన కళ పట్ల కమిట్మెంట్ లేకపోవడం అంటే జుగుప్స!
చాలా కష్టం సుమా రారాతో వేగటం. ‘సంవేదన’ టీంలోని మిత్రులందరికీ రారా స్వయంగా కాఫీ పెట్టి ఇచ్చేవారు. వాళ్లు దాన్ని ‘ఎడిటర్స్ కాఫీ’ అంటూ ఇష్టంగా తాగేవాళ్ళు. కళాసాహిత్యం అంటే రాజీ కుదరదు. స్నేహం అన్నావా రారాతో ఏ పేచీ ఉండదు. నాకో సిగిరెట్ ఇస్తాడు. హాయిగా ఓ పెగ్గు పోస్తాడు. పులివెందుల నుంచి అల్లా పుగచేవా దాకా ఎన్ని కబుర్లయినా చెబుతాడు. రావిశాస్త్రి అంతటి వాణ్ణి పట్టుకుని ‘పాఠకులు మెచ్చుకుంటారు జాగ్రత్త!’ అనగలిగిన మొనగాడు రారా.
రావిశాస్త్రి షష్టిపూర్తి ప్రత్యేక సంచికకి వ్యాసం రాస్తూ, ‘అనవసరమైన వర్ణనలు మితిమీరి ఉండడమే ‘రాజు మహిషి’లోని లోపం. నవలల్లో తన తత్వశాస్త్ర పాండిత్యం ప్రదర్శించుకోవాలనే తపనతో గోపీచంద్ భ్రష్టుపట్టడం మనకు తెలుసు. ఇంకా ఉపదేశం, నీతిబోధ, పాఠకులను సంస్కరించాలనే ఆరాటం ఒక ప్రలోభం. ఆధునిక కాలంలో వామపక్ష రచయితల్లో ఈ దుర్గుణం ఎక్కువగా కనిపిస్తుంది’ అని కాల్చి వాతలు పెట్టిన కఠినాత్ముడు రారా. క్రమశిక్షణ నేర్పే కన్నతండ్రికే ఆ బాధ్యత ఉంటుంది.
నవల, నాటకం, కథ, కావ్యం, ఖండకావ్యం… ఇలా సాహిత్యంలో అన్ని శాఖలకూ ఒక కళాధర్మం ఉంటుందని, దాన్ని పాటించాలని గట్టిగా చెప్పినవాడు రారా. రావి శాస్త్రి చిన్నకథల్లో కవిత్వం ఒలకబోశాడనీ చిరాకుపడ్డారు. అలాంటి రారా, గుడిపాటి వెంకటచలం వాక్యవిన్యాస పరిమళాల ప్రవాహంలో కొట్టుకుపోతూ, ‘సకలకళా నియమాలనూ ధిక్కరించినవాడు చలం’ అని అన్నారొక మైకంలో.
రాచమల్లు రామచంద్రారెడ్డి అంటే తెలుగు జాతి సమస్తం చేసుకున్న ఒక పుణ్యం. తెలుగు విమర్శకన్న ఒక బంగారు కల. తెలుగు సాహిత్యాకాశం మనకి ప్రసాదించిన కార్తీక పున్నమి వెన్నెల. రారా హెచ్చరించాడు: ‘పాఠకుని హృదయానికి ఎక్కేది కళ. పాఠకుని చర్మాన్ని మాత్రమే తాకి, గిలిగింతలు పెట్టేది వినోదం. గిలిగింతల కొరకే సాహిత్యం చదివే పాఠకులు మెచ్చుకున్నారంటే, అది రచయితలకు ప్రమాదకరమే.’
అచ్చంగా స్వచ్ఛమైన సాహిత్యం కోసమే బతికినవాడు రారా. సాహిత్యం పట్ల సీరియస్నెస్ లేకపోవడం పట్ల కోపంతో ఊగిపోయిందీ ఆయనే. ‘క్షమించరాని నేరాలను తూర్పారబట్టేటప్పుడు మాత్రమే మా విమర్శలు నిర్దాక్షిణ్యంగా ఉంటున్నాయ’ని రారా అన్నారొకసారి. లోతైన అవగాహన, గొప్ప క్లారిటీ, రసహృదయం ఉన్న అరుదైన సాహితీవేత్త రారా. రారా రచనలన్నీ ఒకచోట చేర్చి, ‘రారా సర్వస్వం’ తీసుకురావాల్సిన బాధ్యత మనకుందా? లేనట్టే ఉంది!…………. తాడి ప్రకాష్
Share this Article